Take a fresh look at your lifestyle.

దేవాలయాలకు పూర్వవైభవానికి నిధులు

  • పారుపల్లి పట్టాభి రామాలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు
  • సిఎం కేసీఆర్‌ ‌త్వరగా కోలుకోవాలంటూ కోరుకున్నట్లు వెల్లడి

దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో దేవాలయాలకు రాష్ట్ర ఖజాన నుంచి నిధులు కేటాయిస్తూ పూర్వవైభవం తీసుకువొస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామనీ, యాదాద్రి మొదలుకుని భద్రాది, వేములవాడ రాజన్న, ధర్మపురి, కాళేశ్వరం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేవాలయాల అభివృద్ధికి నిధులను కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ…సంపూర్ణ ఆరోగ్యంగా ప్రజాసేవకు రావాలని కోరుకుంటూ హరీష్‌రావు బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని సిద్ధిపేటలోని పారుపల్లిలో గల పురాతన పట్టాభి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పారుపల్లి రామాలయం సిద్ధిపేట ఊరు పుట్టినప్పుడు సిద్ధిపేట బొడ్రాయి ఈ పట్టాబి రామాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుందన్నారు. కొరోనా కారణాల వల్ల శ్రీరామ నవమి వేడుకలను దేవాలయం వరకే పరిమితం చేశామన్నారు. రాష్ట్రాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఎం కేసీఆర్‌కు అన్ని దేవుళ్ల ఆశీస్సులు ఉండాలనీ, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో అతి త్వరగా కొరోనా నుంచి కోలుకుని తిరిగి పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పారుపల్లిలోని పట్టాభిరామ ఆలయానికి 2కోట్ల 10లక్షల రూపాయలతో పూర్తిస్థాయిలో పునర్‌ ‌నిర్మాణం చేస్తున్నామన్నారు. అదే విధంగా సిద్ధిపేటలోని శరభేశ్వర, వెంకటేశ్వరస్వామి ఆలయానికి, కోటి లింగేశ్వరస్వామి ఆలయానికి 50లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. పారుపల్లిలోని హనుమాన్‌, ‌శివాలయానికి 35లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి పునరుద్దరించామన్నారు. త్వరలోనే పారుపల్లి పట్టాబిరామ ఆలయాన్ని వేద పండితులు, స్థపతి అందరి సహకారంతో రాతి కట్టడంతో అత్యంత వైభవంగా పునర్‌ ‌నిర్మాణం పనులను అతి త్వరలోనే చేపడుతామన్నారు.

సిఎం కేసీఆర్‌ ఆశీస్సులతో సిద్ధిపేట పట్టణంలోని ఆలయాలను 4కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. అతి పురాతన భోగేశ్వరస్వామి ఆలయాన్ని పునరుద్దరించాలనీ, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే సిద్ధిపేట అభివృద్ధి చెందుతుందనీ ప్రజలందరూ కోరుకునే  వారన్నారు. అందరూ కోరుకున్న విధంగానే భోగేశ్వరస్వామి ఆలయాన్ని పునరుద్దరణ చేసుకుని ప్రతినిత్యం పూజాకార్యక్రమాలు చేస్తుండటంతో సిద్ధిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందనీ, సిద్ధిపేటను ఇంకా అభివృద్ధి చేసుకుందామన్నారు. అయితే, రాములోరి ఆశీస్సులతో సిఎం కేసీఆర్‌ ‌కొరోనా నుంచి త్వరగా కోలుకోవాలనీ, ప్రజా సేవకు అంకితం కావాలని  మనస్పూర్తిగా రాములోరిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.  ఆయన వెంట మునిసిపల్‌ ‌తాజామాజీ ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply