- పార్టీల మధ్య కాదు… కేసీఆర్ కుటుంబం-ఈటల మధ్య కొట్లాట
- విద్యలో రాష్ట్రం దేశంలోనే వెనకబడింది మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- భూముల వేలంలో వేల కోట్ల కుంభకోణం : తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీల మధ్య కాదు కేసీఆర్ కుటుంబం-ఈటల మధ్య కొట్లాట అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో విద్య, వైద్యం దేశంలోనే వెనుకబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతగానితనమని చెప్పుకొచ్చారు. తెలంగాణ సర్కార్ కొరోనా కేసులను, మరణాలను కప్పిపుచ్చిందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో 70 ఏళ్ల వెనక్కు వెళ్లిపోయిందన్నారు. పార్టీలకతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నానని, దానికోసం అందరి మద్దతు కూడబెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు సంపూర్ణ మద్దతు తెలపాలని చెరుకు సుధాకర్‌ను ఆయన కోరారు.
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం వేలం వేసినా కెసిఆర్ కుటుంబం తన సొంత లాభం చూసుకోకుండా టెండర్లకు పిలవదని ఆరోపించారు. మొన్న జరిగిన భూమి వేలంలో వేలకోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బండి సంజయ్ ఊరికే కెసిఆర్ అవినీతి బయటపెడతామనడం కాదని, కేంద్ర సంస్థలు వారి చేతుల్లో ఉన్నాయి కనుక ఎంక్వయిరి వేయాలన్నరు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దివాలా తీస్తే కాపాడవలసిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనను కలవడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో హక్కుల గురించి ఉద్యమకారులుగా తాము కోట్లాడుతాం కానీ కెసిఆర్ చేస్తున్న దుబారాకు కళ్లెం వేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేశారు.
వైద్యం, ఆరోగ్య రంగంలో తెలంగాణ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. గోదావరి నీళ్లు అలుగు పోస్తున్న కృష్ణాలో ఎత్తిపోస్తే ఓ రెండు లక్షల కోట్లు దుబారా తప్ప వొచ్చేదేమి లేదన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన కెసిఆర్ రాక్షస పాలనను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాల మధ్య సయోధ్య అవసరం అన్నారు. ఉద్యమ సమయంలో ఈటల తెరాస పార్టీకి ఎటిఎం కార్డు లాంటి వాడని అలాంటి ఒక 20 ఏళ్ల ఎమ్మెల్యేను దుర్మార్గంగా పార్టీలో నుండి పంపించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం ఈటల కోట్ల రూపాయలు ఖర్చు చేసారనేది వాస్తవమని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించే కుట్ర ఏదైనా తిప్పికొడుతామన్నారు.