Take a fresh look at your lifestyle.

విస్తరణవాదానికి ఇక ముగింపేనా

దొంగచాటుగా దాడులుచేసి దేశ సరిహద్దులను విస్తరించుకునే రోజులు పోయాయని ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా చైనా దేశాన్ని హెచ్చరించారు. గతంలోలాగా దురాక్రమణలు చేస్తే భారత్‌ ‌చూస్తూ ఊరుకోదన్న సంకేతాన్నిచ్చారాయన. గతంతో పోలిస్తే భారత్‌ ఇప్పుడు అన్నిరంగాల్లో శక్తివంతంగా తయారైంది.  అంతర్జాతీయ రాజకీయరంగంలోనైతేనేమీ, ఇటు దేశంలోని మిలటరీ, ఆయుధసంపత్తిని సమకూర్చుకోవడంలో నైతేనేమీ మరే ఇతర దేశాలకు  తీసిపోని విదంగా  భారత్‌ ‌పటిష్టంగా మారింది. అంతర్గతంగా దేశంలో వొచ్చిన అనేక విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలు భారత్‌ ‌వెంట నిలిచి ప్రభుత్వానికి ధైర్యాన్ని, స్థైర్యాన్నిస్తున్నారు. అన్నిటికి మించి దేశసరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న ధీరోదాత్తమైన సైనిక బలం మనకుంది. అందుకే భారత దేశాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితిలో కబళించలేరన్న సంకేతాన్ని ఆయన శుక్రవారం లద్దాక్‌ ‌సందర్శించిన సందర్భంగా భారత సైనికులనుద్దేశించి అన్నమాటలివి. విచ్చిన్నకర శక్తులకు ఇప్పటికే లద్దాఖ్‌ ‌ప్రజలు తిప్పికొట్టారు. నిజంగా చెప్పాలంటే ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో, వేల అడుగుల ఎత్తైన మంచుకొండల్లో నివసిస్తున్న లద్దాఖ్‌ ‌ప్రజల ధైర్యసహాసాలను  ఆయన మెచ్చుకున్నారు. ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి శత్రువులను తిప్పికొట్టిన వారి సామర్ధ్యాన్ని ఆయన ప్రశంసించారు.

సముద్ర మట్టానికి పద్నాలుగు నుండి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున చుకొండల మధ్య  ఉండే  అత్యంత చల్లని ఎడారి ప్రాంతం లద్దాఖ్‌. ఇక్కడ మామూలు పరిస్థితిలోకూడా పశువులకు ఆహారం లభ్యం కావడం చాలా కష్టం. ఇవ్వాళ వివాదస్పదంగా మారిన గాల్వాన్‌ ‌లోయ, పాంగాంగ్‌ ‌సరస్సుకు దగ్గరలోఉండే మన్మెర్క్, ‌నాంగోస్‌ ‌లాంటి మరికొన్ని గ్రామాలకు చెందిన పశువులను మేపుకోవడానికి ఇండో-చైనా మధ్య ప్రస్తుతం వివాదస్పదంగా మారిన పచ్చిక మైదాన ప్రాంతమే ఆధారం. ప్రతీఏటా ఏదో ఒంకతో దొంగతనంగా చైనా కొద్దికొద్దిగా ఈ భూమిని ఆక్రమిస్తుండడం స్థానిక ప్రజలకు ఆందోళనగా మారుతోంది. ఇలానే జరుగుతూపోతే కనీసం పశువులను మేపుకునే స్థలంకూడా లేకుండాపోతే,  తమ జీవనమే ప్రమాదంలో పడుతుందన్న అయోమయస్థితిలో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో చైనా ఇప్పుడు లద్దాఖ్‌నే ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది. ఇటీవల గాల్వాన్‌ ‌లోయలో జరిగిన ఘర్షణ ఇందులో భాగమే. ఈ ఘర్షణలో  ఒప్పందంమేరకు ఎంతో ధైర్యసహాసాలతో చైనా సైనికులను ఎదిరించి నిలిచిన ఇరవై మంది భారత సైనికులను చైనీయులు దొంగదెబ్బతీసి పొట్టన పెట్టుకున్నవిషయం తెలిసిందే. భారత సైన్యంకూడా ఇందుకు ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో శుక్రవారంనాడు లద్దాఖ్‌ ‌వెళ్ళి భారత్‌ ‌సైనికుల మనోధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు భారత ప్రధాని నరేంద్రమోదీ. సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తున ఉన్న నీమ్‌లో ముందుగా ఆయన మిలటరీ ఉన్నతాధికారులతో, అక్కడి సైన్యంతో సరిహద్దు భద్రతా విషయాలను తెలుసుకున్నారు. ఉద్రిక్తత కొనసాగుతున్న ఆ ప్రాంతాన్ని ప్రధాని లాంటి రాజకీయ నాయకులు వెళ్ళడం నిజంగా సాహాసంతో కూడుకున్న విషయమే. దీనికి భారత్‌ ‌ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
ముఖ్యంగా చైనాకు ఇది ఊహించని పరిణామం. ఒక పక్క  శాంతి చర్చలు జరుపుతూ అలజడి సృష్టిస్తున్న చైనాకు, ఉన్నళంగా మోదీ పర్యటనతో భారత్‌ ‌యుద్దానికి సన్నద్ధమవుతున్నదన్న సంకేతాన్నిచ్చినట్లైంది.  సరైన ఆక్సిజన్‌కూడా అందని ఆ ప్రాంతంలో దేశ రక్షణలో నిమగ్నమైన భారత సైనికుల తెగువను, వారి దైర్య సాహాసాలు వెలకట్టలేనివంటూ మోదీ సైనికుల మనో నిబ్బరాన్ని మరింతగా పెంచారు.  అలాగే మన సంకల్పం హిమాలయాలకన్న ఉన్నతమైనదని, దాన్ని కాపాడాల్సిన బాధ్యతకూడా వారి భుజస్కందాలపైనే ఉందని,   దేశంలోని నూటా ముప్పై కోట్ల మంది భారతీయులకు మీరే ప్రతీకలంటూ వారిలో మరింత శౌర్యాన్ని రంగరించారు.  దురాక్రమణలకు ఇక ఎంతమాత్రం అవకాశంలేదని, ఇప్పుడంతా వికాస యుగమన్న విషయాన్ని గమనించాలంటూ ఆయన పరోక్షంగా  మరోసారి చైనాను హెచ్చరించడాన్ని చూస్తే, యుద్దం అనివార్యంగా మారినా ఎట్టి పరిస్థితిలో వెనకాడేదిలేదన్న దృఢ సంకల్పం స్పష్టంగా కనిపించింది. భారత దేశం ప్రాచీన కాలంనుండీ   అనేక విదేశీ దాడులను ఎదుర్కుని తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ నిలదొక్కుకోగలిగింది.  భారత్‌ ఎం‌త శాంతిని కోరుకుంటుందో, అంత వీరత్వానికి ప్రతీకగా నిలిచింది. శాంతిని కోరుకోవడమంటే చేతులు కట్టుకుని కూర్చోవడంకాదని, 1962నాటి ఇండో చైనా యుద్దం, కార్గిల్‌ ‌యుద్దాలే చెబుతాయన్న  మోదీ మాటలు సైనికులను మరింతగా ఉత్సాహ పరిచేవిగా ఉన్నాయి.

Leave a Reply