Take a fresh look at your lifestyle.

జర జాగ్రత్త…

“వైద్యుడిని దేవుడితో పోల్చటం మన సంప్రదాయంలోనే ఉంది. కరోనా బాధితులను ఏ దేవుడు ఆదుకుంటాడో తెలియదు కాని వైద్యుడు మాత్రం కచ్చితంగా ప్రాణాలు పోస్తున్నాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ క్రమంలో తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. వైద్యులే చేతులెత్తేస్తే, మొహం చాటేస్తే, ప్రాణభయంతో ముందుకు రాకపోతే ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించగలం. అంతకు మించిన ఘోర విపత్తు ఇంకా ఏమి ఉండదు. అందుకే కరోనాపై యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి పోరాటం చేస్తున్న వైద్యుల్ని, వైద్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం మన మీదే ఉంది.”

Rehanaకరోనా కల్లోలం నెమ్మదిగా కొత్త వర్గాల్లో విస్తరిస్తోంది. ముందు అంతర్జా తీయ ప్రయాణాలు చేసిన వారి నుంచి మొదలై తర్వాత వారి నుంచి సెకెండ్‌ ‌కాంటాక్ట్ ‌పర్సన్స్‌కి విస్తరించింది. కేంద్రం మూడు వారాల లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిన మొదట్లో కేసులు కాస్త నెమ్మదించాయి పరిస్థితి అదుపు లోనే ఉందనుకునేంతలోనే ఢిల్లీ తబ్లీగీ జమాత్‌ ఉం‌దంతం తెర మీదకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ కేసులు సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. రోజు రోజుకు కేసులు పెరుగుతూ ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 20వేలను దాటింది. మరణాలు ఆరువందలకు పై మాటే. కరోనా కేసుల నమోదులో ఇప్పుడు కొత్త పంథా ఏర్పడుతోంది. అత్యవసర సేవలు అందిస్తున్న వారు సైతం కరోనా కోరల్లో చిక్కుతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు కరోనా బాధితుల జాబితాలో చేరుతున్నారు. కరోనా కట్టడికి ఎమర్జెన్సీ సర్వీసులు చేస్తున్న వారిని మరింత భద్రంగా చూసుకోవాల్సిన అవసరాన్ని తాజా కేసులు స్పష్టం చేస్తున్నాయి.

ప్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్…
‌వైద్యుడిని దేవుడితో పోల్చటం మన సంప్రదాయంలోనే ఉంది. కరోనా బాధితులను ఏ దేవుడు ఆదుకుంటాడో తెలియదు కాని వైద్యుడు మాత్రం కచ్చితంగా ప్రాణాలు పోస్తున్నాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ క్రమంలో తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. వైద్యులే చేతులెత్తేస్తే, మొహం చాటేస్తే, ప్రాణభయంతో ముందుకు రాకపోతే ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించగలం. అంతకు మించిన ఘోర విపత్తు ఇంకా ఏమి ఉండదు. అందుకే కరోనాపై యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి పోరాటం చేస్తున్న వైద్యుల్ని, వైద్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం మన మీదే ఉంది. అయితే చాలా చోట్ల తగిన ఆయుధాలు లేకుండానే యుద్ధం చేయాల్సిన దుస్థితిని వైద్య లోకం ఎదుర్కొంటోంది. దానికి అగ్రరాజ్యం అమెరికా సైతం మినహాయింపు కాదు. తగిన సంఖ్యలో వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోవటంతో డాక్టర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మాయదారి మహమ్మారి ఎటు నుంచి దాడి చేస్తుందో ఊహించలేని పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఈ మధ్య చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ ‌విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 1,716 ఆరోగ్య సిబ్బంది వైరస్‌ ‌బారిన పడ్డారు. వీరిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనల్లో 90 శాతం వైరస్‌ ‌పుట్టుకకు కేంద్రం వూహాన్‌లోనే చోటు చేసుకున్నాయన్నది ఆ దేశం చెప్పిన అధికార సమాచారం. వాస్తవంగా ఈ లెక్కలు మరింత ఎక్కువే ఉండొచ్చు అనే అనుమానాలు లేకపోలేదు. మన దేశంలో కరోనా చికిత్సలో భాగం అయిన ఆరోగ్య సిబ్బంది పలువురు వైరస్‌ ‌కాటుకు గురి అవు తున్నారు. మహారాష్ట్రలోని పుణెలో ఓ ప్రైవేటు క్లినిక్‌ ‌నర్సులు 19 మందికి, మరో ఆరుగురు పారామెడికల్‌ ‌సిబ్బందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది.

అలీగఢ్‌ ‌ముస్లిం యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మెడికల్‌ ‌కాలేజ్‌లో కూడా అనుమానాలు రేగటంతో 47 మంది సిబ్బందిని క్వారం టైన్‌లో ఉంచారు. ఢిల్లీ ఉదంతం కూడా తెలిసిందే. బస్తీ దవాఖానాలో ఓ వైద్యుడు కరోనా బారిన పడటంతో కలకలం రేగింది. యూపీలో ఓ వైద్యుడు కరోనాతో మరణించారు. ముంబాయిలో రెండు ప్రైవేటు హాస్పటల్స్‌ను మూసివేశారు. అక్కడ మెడికల్‌ ‌స్టాఫ్‌కు వైరస్‌ ‌నిర్దారణ అవటమే కారణం. ప్రస్తుతం అత్యధిక కేసుల నమోదులో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన గుజరాత్‌ ‌రాష్ట్రంలో వంద మంది వైద్య శాఖ సిబ్బంది, పోలీసులు వైరస్‌ ‌బాధితులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అమెరికాలో కరోనా చికిత్సలో సేవలు అందించిన భారతీయ వైద్యులు మృతి చెందిన విషయం మీడియాలో వచ్చింది. ప్రత్యక్షంగా ఐసోలేషల్‌, ‌క్వారంటైన్‌ ‌వార్డుల్లో సేవలందించే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…ప్రమాదపు అంచుల్లో పని చేస్తున్నట్లే. ఆ ప్రమాదం వారికే కాదు ఇళ్ళకు వెళితే వారి కుటుంబ సభ్యులు సైతం ప్రమాదంలో పడతారు. ఆరోగ్య ప్రమాదమే కాదు మానసికంగానూ తీవ్ర ఒత్తిడిని ఈ ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే ఈ యోధుల మీదే కొందరు దాడులకు పాల్పడటం హేయమైన, క్షమించరాని అంశం. అందుకే కేంద్రం ఎపిడమిక్‌ ‌డిసీసెస్‌ ‌యాక్ట్ 1897‌కు సవరణలు చేస్తూ తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ఆహ్వానించదగింది. కొత్త ఆర్డినెన్స్ ‌ప్రకారం వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే అవి కాగ్నిజబుల్‌ ‌నేరం అవుతుంది. బెయిల్‌ ‌కూడా దొరకదు.

మీడియా ప్రతినిధులు సైతం…
వైద్యులు లేదా పారామెడికల్‌ ‌సిబ్బంది చికిత్స అందించటంలో భాగంగా వైరస్‌ ‌సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి వీరికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యవస్థకు సహాయకారంగా ఉండేవి మిగిలిన అత్యవసర సేవలు అంటే మీడియా, పోలీసింగ్‌, ‌ప్రభుత్వ యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ వంటివి. దీన్ని సెకెండ్‌ ‌లేయర్‌గా పరిగణించవచ్చు. ఈ వర్గాలు కూడా పరోక్షంగా హై రిస్క్‌ను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎవరిలో వైరస్‌ ఉం‌దో తెలియని పరిస్థితుల మధ్య వీరు పని చేయాల్సి ఉంటుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ వర్గాలు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళనను మరింత పెంచేదే. ముంబా యిలో ఏకంగా 53 మంది మీడియా ప్రతినిధులు వైరస్‌ ‌బారిన పడ్డారు. వారి నుంచి ఎంత మందికి కరోనా సోకిందో లెక్కలు తేల్చుతున్నారు. ఇటు చెన్నైలో ఓ మీడియా ఛానల్‌లో 26 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య నలభై• వరకు చేరిందని తాజా మీడియా రిపోర్టస్ ‌చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కష్టపడుతున్న పోలీసులు సైతం మహమ్మారి బాధితులు అవుతున్నారు. అహ్మదాబాద్‌లో 24 మంది పోలీసులకు కరోనా వైరస్‌ ‌సోకింది. వీరిలో 9 మంది ట్రాఫిక్‌ ‌పోలీసులు ఉన్నారు. హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఖడియా ప్రాంతానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ ఒకరు కరోనా బారినపడ్డారని మీడియా రిపోర్టస్ ‌వెల్లడించాయి. అందరూ ఇళ్ళల్లో ఉన్న సమయంలో అత్యవసర సేవలు అందించే ఈ వర్గాలు రోడ్ల మీదకు రావల్సిందే. ఓ వైపు భయం వెంటాడుతున్నా, ప్రమాదం పక్కనే ఉన్నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సిందే. కాని అదే సమయంలో వీరందరిని కాపాడుకోవటం, నైతిక స్థైర్యం దెబ్బతినకుండా చూసుకోవటం, భరోసా ఇవ్వటం చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యక్తులకే పరిమితం కాదు ఆ ప్రభావం కుటుంబంపై పడుతుంది. వారు కూడా వైరస్‌ ‌బారిన పడే ప్రమాదం ఉంది. జరగరానిది ఏమైనా జరిగితే కుటుంబం యావత్తు రోడ్డున పడుతుంది. ఈ వర్గం అంతా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలే ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే తగిన ఆరోగ్య, జీవిత బీమా కవర్‌ ‌కూడా లేని వారే అత్యధికులు. కాబట్టి ప్రభుత్వాలు, వీరు పని చేసే మేనేజ్‌మెంట్లు వీరి భద్రత కోసం పెద్ద మనసు చేసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

Leave a Reply