“సిద్ధిపేట జిల్లాలో ఇప్పటి వరకు 250కిపైగా వరకు కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కొరోనా కేసులు అంతకం తకు పెరగడంతో అటు ప్రజలు, ఇటు అధికార యంత్రాంగం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. పట్టణాలకే పరిమితమైన కొరోనా నేడు పల్లె తలుపులు తట్టింది. పేద, ధనిక తేడా లేకుండా కొరోనా వైరస్ అందరినీ వెంటాడుతుంది. కొరోనా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. కొరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తుంది. కొరోనా వైరస్ సిద్ధిపేట జిల్లాలో వారు, వీరు అని తేడా లేకుండా అందరి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇప్పటి వరకు సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 250 వరకు పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగింది. వీరిలో 100కు పైగా వరకు చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. అయినప్పటికీ..కొత్తగా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.”
పట్నం నుంచి పల్లె తలుపు తట్టిన కొరోనా
రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు
గజ్వేల్‌లో మొదటి కేసు నమోదు…
డబుల్ సెంచరీ దాటిన పాజిటివ్ కేసులు..
భయం గుప్పిటో్ల సిద్ధిపేట ప్రజలు..
భయపడకండంటూ భరోసా ఇస్తున్న మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట జిల్లాలో కొరోనా విలయతాండవం చేస్తుంది. వైరస్‌ను అరికట్టడంలో భాగంగా గత మార్చి 24న మొట్టమొదటిసారిగా లాక్డౌన్ పెట్టిన ఒకట్రెండు నెలల వరకు సిద్ధిపేట జిల్లా గ్రీన్ జోన్లోనే ఉంది. లాక్డౌన్ సడలింపో, మరేదో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు సిద్ధిపేట జిల్లాలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య డబుల్ సెంచరీ దాటింది. మరణాలు 10వరకు చేరాయి. రాష్ట్రమంతటా వైరస్ వణికించిన వేళ…సిద్ధిపేటలో మాత్రం కొరోనా జాడే లేదు. ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే, ఎప్పుడైతే ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లొచ్చిన గజ్వేల్‌కు చెందిన వ్యక్తికి కొరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందో అప్పటి నుంచి జిల్లాలో ఎక్కడో ఒక చోట కొరోనా పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ మహామ్మారి నేడు పల్లెలకు సైతం పాకి..పల్లె ప్రజల్ని వణికిస్తున్నది. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటతో పాటు జిల్లాలోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ
వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్నది. కొరోనా కట్టడికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు.
వైరస్ నివారణకు, పాజిటివ్ వొచ్చిన బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు సంబంధిత అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఆదేశాలూ ఇస్తున్నారు. కానీ, కొరోనా విజృంభిస్తుండటంతో జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100పడకల కోవిడ్ వార్డును కూడా ప్రారంభించారు. జిల్లా ప్రజల బాగు కోసం మంత్రి హరీష్‌రావు అహార్నిశలు శ్రమిస్తున్నప్పటికీ…కొరోనా కరాళ నృత్యం ముందు అంతగా ఫలితాలు రాకుండా పోతున్నాయి. ఇదిలా ఉంటే, సిద్ధిపేట జిల్లాలో ఇప్పటి వరకు 250కిపైగా వరకు కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కొరోనా కేసులు అంత••ంతకు పెరగడంతో అటు ప్రజలు, ఇటు అధికార యంత్రాంగం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. పట్టణాలకే పరిమితమైన వైరస్ నేడు పల్లె తలుపులు తట్టింది. పేద, ధనిక తేడా లేకుండా వైరస్ అందరినీ వెంటాడుతుంది. కొరోనా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తుంది. వైరస్ సిద్ధిపేట జిల్లాలో వారు, వీరు అని తేడా లేకుండా అందరి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇప్పటి వరకు సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 250 వరకు పాజిటివ్ కేసులలో 100కు పైగా బాధితులు చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. అయినప్పటికీ..కొత్తగా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి జరుపుతున్న పరీక్షల్లో వరుసగా కొరోనా కేసులు బయట పడుతున్నాయి. దీంతో ప్రజలు హాస్పిటల్ పేరెత్తితేనే గజగజ వణికిపోతున్నారు. అయితే, కనిపించని శత్రువు కరోనాతో ముందుండి పోరాటం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను కొరోనా వెంటాడడం ఆందోళన కలిగించే విషయం. వైరస్ ప్రభుత్వాఫీసులనూ చేరింది. జిల్లాలోని దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే అధికారులు, సిబ్బందిని తాకింది.
ఏకంగా జిల్లా కలెక్టరే హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వొచ్చిందంటే పరిస్థితి ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ హోం క్వారంటైన్ వెళ్లడంతో ప్రభుత్వ శాఖల్లో పని చేసే వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆఫీసులకు వెళ్లకుండా హోం నుంచి వర్క్ చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. సిద్ధిపేట జిల్లాను ఆనుకుని ఉన్న జిల్లాలో కొరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ సిద్ధిపేట జిల్లాలో మాత్రం కొరోనా వైరస్ ఫ్రీ జిల్లాగా ఉండేది. కానీ, లాక్డౌన్లో ఆంక్షలు సడలించడమే సిద్ధిపేట జిల్లాలో కొరోనా విజృంభించడానికి ప్రధాన కారణమన్న అభిప్రాయం అందరిలో ఉంది. అయితే, పల్లెలు మొదలుకుని సిద్ధిపేట పట్టణం వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయి. దుకాణాలు, హోటళ్లు, ఇతరత్రా వ్యాపార సంస్థల వద్ద ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. భౌతిక దూరాన్ని పాటిస్తున్న వారే లేరు. శానిటైజర్ల ఊసే లేదు. ఎవరికి తోచినట్లుగా వారు గుంపులు గుంపులుగా చేరి వారికి కావల్సింది కొనుక్కోని వెళ్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలెవరూ లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదు, కొరోనా వైరస్‌ను గుర్తించడం లేదు. సడలింపులతోనే జిల్లాలో కొరోనా విజృంభిస్తున్నది యధార్థం. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అసలు లాక్డౌన్ అనేది ఉందా..? అనే చర్చ ప్రజల్లో మొదలైంది. ప్రతి రోజు ఎక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడమే ఇందుకు కారణం. సిద్ధిపేట పట్టణం సహా వివిధ గ్రామాలలో పాజిటివ్‌లు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మళ్లీ లాక్డౌన్ విధించక తప్పదా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే, దుబ్బాక వంటి ఒకట్రెండు ప్రాంతాలలో వ్యాపారస్తులే స్వచ్చందంగా ముందుకువచ్చి సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు.
గజ్వేల్‌లో తొలి కేసు నమోదు..
సిద్ధిపేట జిల్లాలో తొలి కొరోనా కేసు గజ్వేల్‌లో నమోదైంది. గజ్వేల్‌కు చెందిన 51ఏండ్ల వ్యక్తికి కొరోనా మొట్ట మొదటిసారిగా వొచ్చింది. ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాలకు హాజరై తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కొరోనా లక్షణాలు ఉండటంతో సిద్ధిపేట ఐసోలేషన్ కేంద్రానికి తరలించి..అతని గొంతు నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో సదరు వ్యక్తిని సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. 20రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ నుంచి మొదలైన కొరోనా పాజిటివ్ కేసులు నేడు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. పల్లెలను సైతం తాకింది. పల్లె ప్రాంతానికి చెందిన వారు సైతం కొరోనా కాటుకు బలయ్యారు. రెండు నెలల కిందట ఒక కేసుతో మొదలైన కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేడు డబుల్ సెంచరీని దాటింది.
కొరోనా భయం..ప్రజలు బేజారు…
కొరోనాతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా కొరోనాతో బేజారవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జిల్లా ప్రజానీకం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం. సీజనల్ వ్యాధులు కూడా వచ్చే సమయం. జ్వరాలు వచ్చే సీజన్ కూడా. అయితే, ప్రస్తుతం సాధారణ జ్వరం ఉన్నా కూడా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ సీజనల్ వ్యాధుల లక్షణాలు, కొరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండటంతో జనం వణికిపోతున్నారు. ఒకమాటలో చెప్పాలంటే ప్రజలను కొరోనా వైరస్ భయం వెంటాడుతోంది. సంబంధిత అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కొరోనాకు భయపడాల్సిన అవసరం లేదంటూ చెబుతున్నప్పటికీ..వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోననీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలందరూ పండుగలు, పబ్బాలకు దూరమవుతున్నారు.
నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజాప్రతినిధులు…
గత జూన్ నె)లో సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావుకు వ్యక్తిగత సహాయకుడుగా పని చేస్తున్న వ్యక్తికి కొరోనా పాజిటివ్ రావడంతో…మంత్రి నివాసంలో పని చేస్తున్న ప్రయివేట్, ప్రభుత్వ సిబ్బందితో పాటు కొరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి తిరిగిన పలువురు ప్రజాప్రతినిధులు సుమారు 30మందికిపైగా సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో కొరోనాకు సంబంధించి గొంతు స్రావాలను పరీక్షల నిమిత్తం ఇవ్వగా… వారందరికీ కొరోనా నెగటివ్ రావడంతో ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి హరీష్‌రావు భరోసా
కొరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, భయాందోళనకు గురి కావద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు భరోసా ఇస్తున్నారు. చిరునవ్వుతో ప్రతి ఒక్క రోగిని పలకరిస్తూ వైద్యం అందించాలని వైద్యులు, స్టాఫ్‌నర్సుల, పారిశుద్ధ్య కార్మికులకు తనదైనశైలిలో భరోసాను కల్పిస్తున్నారు. అంతేకాకుండా, సిద్ధిపేట పట్టణంతో పాటు ఆయన ఎక్కడ పర్యటించినా కూడా కొరోనాపై ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. కొరోనాకు భయపడాల్సిన అవసరం లేదనీ, అయితే నిర్లక్ష్యం ఏమాత్రం తగదని చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న కొరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో 100పడుకలు, వంటిమామిడిలోని ఆర్వీఎం ప్రయివేట్ మెడికల్ కళాశాలలో మరో 100పడకల కోవిడ్ చిక్సిత వార్డును ప్రారంభించారు. అలాగే, తన సొంత డబ్బులతో సిద్ధిపేటలోని ముస్తాబాద్ రోడ్డులో కషాయ వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా పట్టణంలోని మూడు ప్రాంతాలలో వేడి నీటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందించే డాక్టర్లు, సిబ్బందికి ముఖానికి ధరించి హెల్మెట్ తదితర కిట్స్‌ను అందజేశారు.
సంపూర్ణ లాక్‌డౌనే శరణ్యమా?
రెండు నెలల కిందట గ్రీన్ జోన్‌గా ఉన్న సిద్ధిపేట జిల్లాలో ఇప్పుడు కొరోనా విజృంభిస్తుంది. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య అధికారికంగా డబుల్ సెంచరీ దాటింది. అయితే, అనధికారికంగా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగానే ఉంటుందని తెలుస్తుంది. కొరోనా ఇంతగా విజృంభించడానికి లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రజలందరూ ఇంటికి పరిమితమయ్యారనీ, తద్వారా సిద్ధిపేట జిల్లా సేఫ్ జోన్లో ఉందంటున్నారు. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ను ఎత్తివేశారో అప్పటి నుంచి ప్రజలు రోడ్లపైకి రావడం…ఇష్టమొచ్చినట్లు తిరగడంతో కొరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరగడానికి లాక్‌డౌన్‌ను ఎత్తివేతనే కారణమనీ చెప్పే వారి సంఖ్య భారీగానే ఉంది. సంపూర్ణ లాక్‌డౌన్‌ను పెడితే కొరోనా వైరస్ వ్యాప్తిని చాలా వరకు కట్టడి చేసే అవకాశం ఉంటుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొరోనా కట్టడికి సంపూర్ణ లాక్‌డౌనే శరణ్యమన్న భావన ప్రజల్లోనూ ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేసే పరిస్థితులు కనుచూపు మేర కూడా కనిపించడం లేదు. మొత్తానికి సిద్ధిపేట జిల్లా కొరోనాతో గజగణ వణికిపోతుంది. రెండు నెలల కిందటి వరకు గ్రీన్ జోన్లో ఉన్న సిద్ధిపేట జిల్లా నేడు డేంజర్ జోన్లోకి వచ్చిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.