Take a fresh look at your lifestyle.

ఇప్పటికీ వెంటాడుతున్న నోట్ల రద్దు కష్టాలు

మాజీ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌స్వతహాగా ఆర్థిక శాస్త్రవేత్త. దేశంలో ఆర్థిక సంస్కరణలను ఆయన చేత అమలు జరిపించేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మన్మోహన్‌ను ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆర్థిక మంత్రిగా నియమించారు. పీవి తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆయన  నుంచి మన్మోహన్‌ ‌ప్రశంసలు పొందారు. పెద్ద నోట్లను నరేంద్రమోడీ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు అందరికన్నా ముందుగా స్పందించింది ఆయనే.

ఆయన ఒక రాజకీయ వేత్తగా కాకుండా, ఆర్థిక వేత్తగానే  స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అమూల్యమైనవి. ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎంతో విలువైనవి. దేశంలో నిరుద్యోగిత పెరిగి పోవడానికి నోట్ల రద్దే కారణమన్న విషయంలో మరో మాట లేదు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు రాజకీయ సుస్థిరత ఎంత అవసరమో, ఆర్థిక సుస్థిరత కూడా అంతే ముఖ్యం. ఆయన మాటల్లో ప్రజలకోసం ప్రభుత్వాలు కొత్తగా చేస్తున్నవి వెంటనే ఫలితాలను ఇవ్వకపోయినా, ప్రజలపై భారాన్ని మోపకూడదు. నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు ద్వారా చేసింది అదే. దాని వల్ల కొత్త సమస్యలు పుట్టుకుని వొచ్చాయి. నిరుద్యోగం పెరిగింది. అప్పుడు చెప్పిన విషయాన్నే మన్మోహన్‌ ఇప్పుడు ఒక ఆన్‌ ‌లైన్‌ ‌గోష్టిలో మళ్ళి స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇప్పుడు  ఐదు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని చోట్లా ఉద్యోగాల సమస్య చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఉద్యోగాల విషయమై తెరాస, బీజేపీ నాయకులు సవాళ్ళు, ప్రతిసవాళ్ళు విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే, ఆంధప్రదేశ్‌లోనూ, అధికార వైసీపీకీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉద్యోగాలు  కల్పించడం అనేది  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, మన దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా పాలకులందరికీ పెను సవాల్‌గా తయారైంది. ఎన్నికల సందర్భంగా వోట్లు రాబట్టుకోవడం కోసం ఏటా కోటి ఉద్యోగాలిస్తామని నరేంద్రమోడీ 2014 ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. కానీ, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు  నోట్ల రద్దు వల్ల ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారు.

అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఐదేళ్ళలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలిస్తామని వాగ్దానం చేస్తున్నారు. పార్టీ పెట్టకుండానే వైఎస్‌ ‌షర్మిలా మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తెస్తామనీ, ఉద్యోగాలు  కల్పిస్తామని వాగ్దానం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏభై ఏళ్ళ క్రితం జరిగిన పోరాటంలో కొత్త ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు ఎంతో మంది  ఈ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. కొందరు ప్రాణాలు అర్పించారు. ఇంత కష్టపడి సాధించిన ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని వల్ల ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం చాలా మందిలో ఏర్పడుతోంది. కమ్యూనిస్టులు తమ మ్యానిఫెస్టోలో నిరుద్యోగ సమస్య, కొత్త ఉద్యోగాలను  ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారు.

కేరళలో వారిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌ ‌కూడా ఆకర్షణీయమైన వాగ్దానాలు చేయాలి. ఆయన కేరళలోని రాజీవ్‌ ‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌డవలెప్‌ ‌మెంట్‌ ‌స్టడీస్‌ ఆధ్వర్యంలో ఆన్‌ ‌లైన్‌లో నిర్వహించిన  గోష్టిలో పాల్గొని నిరుద్యోగ సమస్యపై సాధికారికమైన గణాంకాలతో ప్రసంగాన్ని వినిపించారు. మోడీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదనీ, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని సింగ్‌ అన్నారు. తెలుగువారు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం అవుతోందని ఆందోళన చెందుతున్నారు. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ  ప్రభుత్వం సాగిస్తున్న యత్నాలకు వ్యతిరేకంగా  దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. మన్మోహన్‌ ‌సింగ్‌ ఆ అం‌శాన్ని కూడా ప్రస్తావించారు.

సాగు చట్టాల వల్ల కూడా నిరుద్యోగం పెరుగుతుందన్న భయాలు వ్యవసాయరంగంపై ఎంతో కాలంగా ఆధారపడి జీవిస్తున్న వారిలో ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సాగు చట్టాల వల్ల కొత్త ఉద్యోగాలు వొస్తాయని ప్రధాని మోడీ ఇప్పటికీ నమ్మబలుకుతున్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్‌ ‌వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది ఆయన ఉద్దేశ్యం. కాంట్రాక్టు ఫార్మింగ్‌ ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అమలులోఉంది. పెట్టుబడిదారులు, కాంట్రాక్టు ఫార్మింగ్‌ ‌చేసే పెద్ద భూకామందుల చేతుల్లో రైతులు విలవిల లాడుతున్నట్టు వార్తలు వొస్తున్నాయి.   బార్గైనింగ్‌ అం‌టే బేరసారాలు లేకుండా భూకామందులు ఎంతిస్తే అంత తీసుకునే పరిస్థితి కొనసాగుతుంది.

ఇంతవరకూ రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూసుకుని సంతృప్తి చెందేవారు. ఇక మీదట వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్త ఉద్యోగాల మాటేమోగాని, వ్యవసాయ రంగంలో కూడా కొత్తగా నిరుద్యోగులు తయారవుతారు.ఈ భయాలతోనే సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరవధిక ఆందోళన సాగిస్తున్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పన పథకాలను నీరుగారుస్తుంది. ఈ పథకాల కింద రాష్ట్రాలకు రావల్సిన నిధుల కేటాయింపు విషయంలో  బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తుంది. ముద్రా రుణాల కింద తెలంగాణకు 68 లక్షల మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా , 40.8 లక్షల మందికే ఇచ్చారని బీజేపీయేతర రాష్ట్రాల పట్ల వివక్షకు ఇదే నిదర్సనమని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ ‌కుమార్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిరుద్యోగులు, చిన్న వ్యాపారులకు రిక్త సాయం అందించడమే ఈ రుణాల ముఖ్యోద్దశ్యమన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగాలపై  మన్మోహన్‌ ‌చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజముందో తెలుపడానికి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనం.

Leave a Reply