- 160 మినహా అందరికీ పరీక్షలు నిర్వహించాం
- గాంధీలో చికిత్స పొందుతున్న 10 మందికి నెగెటివ్..ఇద్దరి డిశ్చార్జి
- మర్కజీ సమాచారం కేంద్రానికి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే: మంత్రి ఈటల
కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా పనిచేస్తున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఢిల్లీలోని మర్కజీలో జరిగిన మత సమావేశం సమాచారాన్ని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకి చికిత్స పొందుతున్న ఇద్దరిని బుధవారం డిశ్చార్జి చేశామనీ, మరో పది మందికి నిర్వహించిన టెస్టులలో నెగెటివ్‌గా వచ్చిందనీ, మరోమారు పరీక్షలు నిర్వహించి వారికి కూడా డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం మంత్రి ఈటల మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీలోని మర్కజీకి 1000 మందికి పైగా వెళ్లినట్లు సమాచారం సేకరించామనీ, వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగడం లేదన్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారిని సైతం 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచి పరిశీలిస్తామని తెలిపారు.
ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారని వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్డౌన్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని కేంద్రాన్ని మొదటగా కోరింది తెలంగాణ రాష్ట్రమేనని గుర్తు చేశారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచి మాదిరిగా పని చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి మర్కజీ సమావేశానికి వెళ్లివచ్చిన 1000 మందిలో 160 మినహా మిగతా అందరికీ కేవలం రెండు రోజుల్లోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, సత్తాకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నేడు ప్రధాని, సీఎంతో ప్రైవేటు కాన్ఫరెన్స్కరోనా వైరస్ కట్డడికి ఆయా రాష్ట్రాలలో లాక్డౌన్ అమలవుతున్న తీరుతో పాటు తీసుకుంటున్న చర్యలపై గురువారం ప్రధాని మోదీ సీఎంల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో పాటు ఈటల రాజేందర్ కూడా హాజరు కానున్నారు.