Take a fresh look at your lifestyle.

బీహార్‌ ‌వోటర్లకు ఉచిత వ్యాక్సిన్‌ .. ‌బీజేపీ హామీ .. సిగ్గు ..సిగ్గు ..!

కొరోనా వ్యాక్సిన్‌ ‌త్వరలో వచ్చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌నుంచి మన ప్రధాని నరేంద్రమోడీ వరకూ అంతా ఊరిస్తున్నారు.అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ఈ ఇరువురు నాయకులకూ కొరోనా వ్యాక్సిన్‌ ఇప్పుడు ఎన్నికల్లో వాగ్దానమయింది. . అగ్రరాజ్యం అధినేత కొరోనా వ్యాక్సిన్‌ ‌యా వత్‌ ‌ప్రపంచానికీ అందుబాటులో ఉంచేట్టు చేయాల్సిన బాధ్యతను పట్టించుకోకుండా, తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కొరోనా వ్యాక్సిన్‌ ‌గురించి, కాశ్మీర్‌ ‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దు వల్ల కలిగిన ప్రయోజనాల గురించి తమ ప్రచారంలో పేర్కొంటున్నారు. కాశ్మీర్‌ ఎన్నికల్లో ఈ అంశాన్ని గురించి ఆయన ప్రచారం చేస్తే సముచితంగా ఉంటుంది. కానీ, బీహారీలు కాశ్మీర్‌ ‌వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని తమ ప్రభుత్వం సృష్టించిందని చెబుతున్నారు.ఇదెంత నిజమో అక్కడి పరిస్థితిని గమనించేవారికి చెప్పనవసరం లేదు. ఈ అధికరణం పునరుద్దరణకు కాశ్మీరీ పార్టీలు ఏకతాటిపైకి వొచ్చాయి. కేంద్రంతో పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో బీహారీ వ్యాపార సంస్థలను అక్కడి పార్టీలు రానిస్తాయా అనేది ప్రధాని చెప్పాలి. బీహార్‌ ఎన్నికల కు బీజేపీ ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌విడుదల చేశారు.

కొరోనా నియంత్రణలో బీహార్‌ ‌ముందు వరసలో ఉందంటూ కితాబు ఇచ్చారు. కొరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభం కాగానే ఉచితంగా వ్యాక్సిన్‌ ‌సరఫరా చేస్తామంటూ బీజేపీ ఇచ్చిన వాగ్దానం అపహాస్యం పాలైంది. కొరోనా వల్ల ఒక్క బీహార్‌ ‌ప్రజలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. కొరోనా వ్యాక్సిన్‌ ‌ను వీలైనంత త్వరగా తయారు చేయించి దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత కేంద్రానిది. ఆ విషయాన్ని ప్రధాని, ఆర్థిక మంత్రి మరిచిపోయినట్టున్నారు. మనుగడలో లేని , ఉహాజనితమయిన ఇంకా పూర్తీ స్థాయిలో శాస్త్రీయంగా నిర్ధారణ కానీ వాక్సిన్‌ ‌ను ఉచితంగా బీహార్‌ ‌ప్రజలకు అందజేస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వడం ఆ పార్టీ దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం.దీనిపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు సబబుగానే ఉన్నాయి . అలాగే, పదిహేను లక్షల మంది యువకులకు ఉద్యోగాలిస్తామంటూ బీజేపీ వాగ్దానం చేసింది. దీనిపై కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ముందు రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ చేసిన వాగ్దానం మాదిరిగానే ఈ వాగ్దానం కూడా నేతి బీరకాయే అవుతుందని వ్యంగ్యోక్తి విసిరారు.

ఉద్యోగాల కల్పన విషయంలో రాజకీయ పార్టీల వాగ్దానాలు నీటి బుడగలేనన్న సంగతి దేశ ప్రజలకు అనుభవమే. ప్రతి పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండకపోవడం వల్లనే ఐదేళ్ళ తర్వాత మరో పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెడుతున్నారు. బీహార్‌ ‌లో 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ అధికారంలో కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా ఆయన మచ్చలేని నాయకుడన్న పేరున్న మాట నిజమే కానీ, పాలనా వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోరన్న అపప్రథ ఉంది.అంతేకాకుండా భాగస్వామ్య పక్షాల ఒత్తిళ్ళకు లొంగుతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన హయాంలో కొత్త ఉద్యోగాలు ఏవీ రాలేదని ఒక వంక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్‌ ‌జెడి, కాంగ్రెస్‌ ‌తదితర ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుంటే, నితీశ్‌ ‌కూటమి అధికారంలోకి వొస్తే 15 లక్ష ల ఉద్యోగాలు ఇస్తుందనడం బూటకపు వాగ్దనమే. బీహార్‌ ‌ని పెట్టుబడులకు స్వర్గధామంగా చేస్తామని కిందటిసారి ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని నితీశ్‌ ‌కుమార్‌ ‌నిలబెట్టుకోలేకపోయారు.అయితే, ఆర్‌ ‌జేడీ అధికారంలోకి వొస్తే ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తాయన్న నమ్మకం లేదు. బీహార్‌ ‌లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరిగితే తప్ప పరిశ్రమలు రావు. పరిశ్రమలు వస్తే తప్ప కొత్త ఉద్యోగాలు రావడం అనేది బూటకమే. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉన్న ఉద్యోగాలను నిలబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో ఉద్దీపన పథకాల కింద కేంద్రం నుంచి భారీగా నిధులు అందుకున్న కార్పొరేట్‌, ‌భారీ పారిశ్రామిక సంస్థలు తామింకా కోలుకోలేందటూ సన్నాయి నొక్కులు ప్రారంభించాయి.

మన దేశంలోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఉద్దీపన పథకాల వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగలేదంటూ ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా లేదు.ఇంకా చెప్పాలంటే మరీ అధ్వాన్నంగా ఉంది. దానికి తోడు భారీ వర్షాలు, వరదల వల్ల పరిశ్రమలు దెబ్బతిని ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. అందుకు మన హైదరాబాద్‌ ఉదాహరణ. వీటి నుంచి కోలుకోవడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చని అంటున్నారు. నిరుద్యోగ సమస్య బీహార్‌ ‌లో మాత్రమే కాదు , దేశమంతటా ఉంది. కొరోనాకు ముందు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న ఏక పక్ష నిర్ణయాల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడాయి. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌ ‌టి ని ప్రవేశపెట్టడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు బాగా దెబ్బతిన్నాయి. నల్లధనం వెలికితీత కోసం పెద్ద కరెన్సీని రద్దు చేస్తే కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా తయారైంది.అలాగే, పన్నుల విషయంలో సంస్కరణల కోసం జిఎస్‌ ‌టి ని తెచ్చామని పదే పదే ఊదరకొడుతున్న బీజేపీ నాయకులు జిఎస్‌ ‌టి వల్ల చిన్న వ్యాపారులు. చిన్న పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విస్మరిస్తున్నారు. కొరోనా వ్యాక్సిన్‌, ఉద్యోగాలు ఎన్నికల వాగ్దానాల్లో చేర్చడం బీజేపీ అనాలోచిత చర్య. దీనిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. బీహార్‌ ‌కి నితీశ్‌- ‌బీజేపీ కూటమి చేసిందేమీ లేదు కనుకనే, అపహాస్యపు వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికను బీజేపీ విడుదల చేసిందని ప్రతిపక్షాలే కాదు. ప్రజలు కూడా అనుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply