Take a fresh look at your lifestyle.

అం‌దరికీ ఉచితంగా టీకా….ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

అరవై ఏళ్ళ వారికీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న ఏభై ఏళ్ళు పైబడిన వారికీ ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగానూ, ప్రైవేటు దవాఖానాల్లో 250 రూపాయిల ఫీజుతోనూ కొరోనా వ్యాక్సిన్‌ ‌వేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా వేయించుకున్నారు. భారత్‌లో తయారైన టీకాలకు రక్షణ ఉందనీ, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన టీకా వేయించుకునే సమయంలో అసోం కండువాను ఎందుకు మెడలో వేసుకున్నారో జనానికి అర్ధం కాలేదు. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ‌కూడా టీకా వేయించుకున్నారు. బీహార్‌లో ప్రైవేటు దవాఖానాల్లో కూడా ఉచితంగా కొరోనా టీకాలు వేయాలని ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ఆదేశించారు.

ఎన్నికల వాగ్దానంలో భాగంగా అందరికీ ఉచిత టీకా వేయించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బీహార్‌లో అధిక సంఖ్యాకులు పేదవారనీ, 250 రూపాయిలు కూడా వారు ఇచ్చుకోలేరనీ, అందుకే, ఉచితంగా టీకాలు వేయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నితీశ్‌ ‌కుమార్‌ ‌చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న వారికి హృదయం, మానవీయ కోణం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండాలి. వేల కోట్ల రూపాయిలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం యావత్‌ ‌ప్రపంచాన్నీ గడగడలాడిస్తున్న కొరోనా నివారణకు వ్యాక్సిన్‌ను ఉచితంగా వేసినా తప్పుపట్టేవారెవరూ ఉండరు.

పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంకు వద్ద రుణాలు తీసుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ ‌మోడీని అప్పగించేందుకు బ్రిటన్‌ ‌లోని కోర్టు అంగీకరించింది. అయినప్పటికీ అతడిని తీసుకుని రావడానికీ, విచారణ జరిపించేందుకు ప్రభుత్వం శషభిషలకు పోతున్నది. ఇలాంటి పరిస్థితులలో ఉచితంగా కొరోనా టీకా పంపిణీకి వేల కోట్లు ఖర్చయినా, అది ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్ము అయినా, దానిని ఖర్చు చేస్తే తప్పేమీ ఉండదు. ప్రజల ఆరోగ్యం కన్నా ముఖ్యమేదీ ఉండదు. ప్రజలకు కావల్సింది…ప్రాణాల భద్రత, మహమ్మారిల నుంచి ఆరోగ్యానికి భద్రత. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 11 లక్షల మంది కొరోనా టీకా వేయించుకున్నారు.

ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరాలంటే వ్యాక్సినేషన్‌ ‌పక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేటు నర్సింగ్‌ ‌హోంలు, దవాఖానాలు కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలి. అయితే, డబ్బు లేనిదే ప్రైవేటు దవాఖానాల్లో రోగులతో మాట్లాడరు. కార్పొరేట్‌ ‌దవాఖానాలైతే గేటు దగ్గరే ఆపేస్తారు. వివరాలు కనుక్కున్న తర్వాతే లోనికి వెళ్ళనిస్తారు. ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు. కొరోనా టీకా వేయాల్సిన పరిస్థితి ఎప్పుడో కొండకచో వొస్తుంటుంది. అయినప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్‌ ‌దవాఖానాల వ్యాపార దృక్పథంలో ఏమాత్రం మార్పు లేదని రుజువు అవుతోంది.

ఈ మధ్య ప్రైవేటు, కార్పొరేట్‌ ‌దవాఖానాల్లో నిర్వహణ చాలా భారంగా ఉందంటూ మీడియాలో కథనాలను వ్యాపింపజేస్తున్నారు. ఈ కథనాలన్నీ జనం సానుభూతిని పొందేందుకేనన్న సంగతి తెలిసిందే. అయితే, కార్పొరేట్‌ ‌దవాఖానాలు ఆర్థిక ఇబ్బందులనూ, లేదా నష్టాలను ఎదుర్కొంటున్నాయంటే ఎవరూ నమ్మరు. అవి దిగుమతి చేసుకునే యంత్రాలు, మెషీన్లు చాలా ఖరీదైనవన్న సంగతి నిజమే అయినా, వివిధ రకాల పరీక్షల పేరిట రోగుల వద్ద వేలకు వేలు గుంజేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ ‌దవాఖానాలకు నష్టాలు వొచ్చే అవకాశమే లేదు. పైగా ట్రస్టుల నిర్వహణలలో పని చేసే దవాఖానాల్లో కొన్ని వార్డులకు భూరిగా వదాన్యులైన వారు వీరాళాలిస్తూ ఉంటారు. అందువల్ల ప్రైవేటు దవాఖానాలు ఒక టీకాను వేయించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నవారే ఎక్కువ మంది ఉంటారు.

250 రూపాయిలలో 150 రూపాయిలు టీకా ఖరీదనీ, వంద రూపాయిలు సర్వీసింగ్‌ ‌చార్జి అని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ ‌పంపిణీని ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా చేస్తున్న దృష్ట్యా ప్రైవేటు దవాఖానాల్లో కూడా వేస్తే సామాన్యులకు ఊరటగా ఉంటుంది. సర్వీస్‌ ‌చార్జి వంద రూపాయిలు ఇచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రభుత్వాలు ఇందుకు బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ దవాఖానాలకు ప్రభుత్వాలు కేటాయించే నిధుల్లో అత్యధిక భాగం సిబ్బంది వేతనాలు చెల్లించడానికే సరిపోతుంది. దవాఖానాల్లో సిబ్బంది పైసలివ్వనిదే పని చేయరనే నానుడి స్థిరపడిపోయింది. ఉచితంగా టీకా వేసే ప్రభుత్వ దవాఖానాల్లో కూడా ఎంతో కొంత గుంజుతున్నారన్న ఫిర్యాదులు వొచ్చాయి.

అందువల్ల ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, అవినీతి రహితంగా జరిపించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానాల్లో టీకా తీసుకోవడానికి చాలా మంది వెనకాడుతుంటారు. సిరంజ్‌లు మార్చరనీ, శుభ్రంగ కడగరనే అనుమనాలు ఉన్నాయి. అందువల్ల జనం ప్రైవేటు దవాఖానాలకు వెళ్ళేందుకే మొగ్గు చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉన్న వైద్య రంగానికి వేల కోట్లు కేటాయిస్తున్నా ఇలాంటి అత్యవసర కార్యక్రమాలకు కూడా వ్యాక్సినేషన్‌ ‌చేసే వారిని వెతుక్కోవల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొక్కుబడిగా జరిపిస్తోందేమోననిపిస్తోంది. సామాన్యులకు కోవిడ్‌ ‌టీకా అందేట్టు తగిన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యం తర్వాతే ఏదైనా అనే విషయం ప్రభుత్వం మరిచి పోరాదు.

Leave a Reply