- ప్రతీ ఏటా అధికారికంగా సెప్టెంబర్ 17
- వరద బాధితులకు రూ.25వేల సాయం
- బస్సుల్లో, మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం
- పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- ఎల్ఆర్ఎస్ రద్దు…బీజేపీ జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల
- విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. గురువారం(నవంబర్ 26) మధ్యాహ్నం 12గంటలకు బేగంపేటలోని తాజ్ వివంతాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ… హైదరాబాద్ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముంబై 26/11 పేలుళ్లలో అమరులైనవారికి శ్రద్ధాంజలి తెలియజేశారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఎంతోమందితో సంప్రదింపులు జరిపి మేనిఫెస్టో రూపొందించామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఫడ్నవీస్ అన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్, మహారాష్ట్రలోని మరాఠ్వాడా, కర్ణాటకలో కొంతభాగం ఒక సంస్థానంగా కలిసి ఉండేవారన్నారు. పోలీస్ యాక్షన్ తర్వాత ఇక్కడ నిజాం పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న మరాఠ్వాడాలో,కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని… మరి తెలంగాణలో మాత్రం ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి అవకాశం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్తో ప్రజలపై రూ.15వేల కోట్లు భారం పడుతుందని… బీజేపీ గెలిస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు.
ఇదే సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లిఖితపూర్వక లేఖ రాసిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దానిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని, వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. సరైన సమయంలో కేంద్రం దానిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్లో పాతబస్తీ ఎందుకు అభివృద్ది చెందట్లేదని ప్రశ్నించారు. పాతబస్తీ అభివృద్దిని ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఎంఐఎంకి మేయర్ పదవి దక్కితే హైదరాబాద్లో రెండు జెండాలు ఎగురుతాయని… ఇద్దరు సీఎంలు ఉంటారని విమర్శించారు.