Take a fresh look at your lifestyle.

ఖజానా ఆరోగ్యానికి ‘‘ఉచిత మందు’’..!

  • బార్లా తెరచినా, డోర్‌ ‌డెలివరీకీ స్పందనలేదా?
  • అయితే వారానికి ఒక రోజు మద్యం ‘ఫ్రీ ’..!

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : అపాయం తప్పించుకోవాలంటే ఉపాయం అవసరం. ఉపాయం లేనివాణ్ణి ఊరినుంచి వెళ్ళగొట్టి, ఉపాయం చెప్పేవాణ్ణి పాలకులు జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అందులోనూ ఆర్థిక వ్యవహారాల్లో ఈ సూత్రం మరింత ప్రాధాన్యత ఊపందుకుంటుంది. బొక్కసానికి చిల్లిపడుతున్న సమయంలో భేషైన మార్గం చూపేవాడే తెలివైన వాడు. నష్టాన్నిపూడ్చి మళ్ళీ పుంజుకునేట్లూ చేయగలిగిన వాడే నిజమైన ఆర్ధిక సలహాదారుడన్న మాట. తెలంగాణ ప్రభుత్వానికి అటువంటి సలహాదారులు, అధికారులకు కొదవలేదు. కోవిడ్‌ ‌ముప్పువలన గత ఏడాదిన్నరగా వలన అనేక కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. ప్రజా జీవితానికి తోడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు దిగజారి ప్రభుత్వం నడవడమే కష్టమైపోయింది. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకు పోయిన సమయంలో అధికారులకు మెదడు పాదరసంలా పనిచేసి ఒక అద్భుత ఆలోచన వొచ్చిందట.
వస్త్ర వ్యాపార సీజన్లలో కనిపించే ఫ్రీ ఆఫర్లు, భారీ డిస్కంట్ల పక్రియ ఒక ప్రధాన రంగంలో ప్రవేశపెడితే అద్భుత ఫలితాలు ఇస్తాయన్న మెరపు ఆలోచన కలిగిన వెంటనే ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు ఆ ఆలోచన చేరవేయడం.. అందుకు వారు కూడా సరేననడం జరిగిపోయిందట, ఇక అమలు కోసం కుస్తీ సాగుతున్నట్లు అభిజ్ఞ వర్గాల భోగట్టా. అన్ని రంగాలూ కుదేలై, కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడి వ్యాపారాలు మూత పడుతున్న దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్దీపన కార్యక్రమాలు ప్రకటించి ఆదాయాలను పెంచి పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లే.. మద్యం వ్యాపారం ఊపందుకుని పూర్వంలా కనక వర్షం కురవాలని, ఆ దిశగా ప్రోత్సహించేందుకు కొత్త నినాదాలు సిద్ధమయ్యాయట. అదే.. ఉచిత మద్యం, మద్య ప్రియులకు భారీ డిస్కౌంట్ల కార్యక్రమం.

ప్రయోగాత్మకంగా ముందు జంటనగరాల్లోని లైసెన్సుడ్‌ ‌బార్లు, రెస్టారెంట్లలో వారంలో ఒక రోజు ఉచిత మద్యం..మిగిలిన రోజుల్లో భారీ రాయితీపై మద్యం సరఫరా విధానం ప్రారంభిస్తే మంచి ప్రోత్సాహం లభించి ఆర్థికంగా రాష్ట్రం పరిపుష్ఠి చెందుతుందన్న భావన. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే మద్యం ప్రియులు కూడా ఊరట చెందుతారని ఆలోచన కూడా. అంచలంచెలుగా రాష్ట్రం మొత్తం అన్ని లైసెన్సుడ్‌ ‌బార్లు, రెస్టారెంట్లలో విస్తృత పరచవొచ్చునని..అప్పుడు మద్యం వ్యాపారం అభివృద్ధి చెంది రాష్ట్ర ఖజానా కూడా గల గల లాడుతుందని ఇటీవల రెస్టారెంట్‌ ‌యజమానులు ఎక్సైజ్‌ ‌విభాగ ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమావేశం చర్చల్లో అభిప్రాయం కలిగిందట. బార్‌, ‌రెస్టారెంట్‌ ‌యాజమాన్యాలు తమ వినియోగ దారులకు వారంలో ఒక రోజు బీరు, విస్కీ, బ్రాందీ, వోడ్క, జిన్‌ ‌తదితర పానీయాలను నిర్ణీత మోతాదులో ఉచితంగా అందిస్తే.. తరువాత మద్యం ప్రియులు కోరిన మేరకు మద్యం విక్రయంలో ఒక సీసా విక్రయానికి మరొక సీసా ఉచితం, ధరపై రాయితీ కూడా కల్పించవచ్చని, దీంతో వ్యాపారాభివృద్ధి చెంది ఆదాయం పూర్వ స్థితికి చేరుతుందని ఒక ఆలోచన. అంతేగాక పుట్టిన రోజులు, వివాహాలు, పండుగలు, కుటుంబ, మిత్ర, వ్యాపార ఇతర ప్రత్యేక సందర్భాలలో ఇచ్చే విందులకు బార్లు, రెస్టారెంట్లు వేదికలైతే..వ్యాపారం పుంజుకుని ఆర్థికంగా బలపడవొచ్చునని, ఆ కారణంగా ప్రభుత్వ ఖజానాకు పడిన గండి పూడుతుందని కొందరి భావన.

తొలి అడుగుగా బార్‌, ‌రెస్టారెంట్లలో వారంలో ఒక రోజు ఉచిత మద్యం విధానం ప్రవేశపెట్టి ప్రాచుర్యం వస్తే రాయితీలు రెండో దశలో అమలు చేయవొచ్చునని ఆలోచన. ఈ ఉచిత మద్యం, రాయితీల వలన పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌ ‌నుంచీ సరిహద్దు పట్టణాలు, గ్రామాలకు మద్యం సందర్శకుల సంఖ్య పెరిగి అదనపు ఆదాయ వస్తుందని కూడా నమ్మకంగా ఉన్నారు. మద్యం సేవనానికి ఎవరికీ ఎటువంటి ఇ-పాసులూ అవసరం లేనందున దీంతో అటు ప్రభుత్వం, ఇటు మద్యం వ్యాపారుల కష్ఘ్టాలు గట్టెక్కుతాయని ఆశ. బార్లు కానీ, రెస్టారెంట్లు కానీ ఉచిత మద్యం ఇవ్వలేని పక్షంలో 300 వందల రూపాయల పైగా మద్యం సేవించే వారికి ఉచితంగా మంచింగ్‌ ‌స్నాక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కొంతవరకూ వ్యాపారానికి ప్రోత్సాహం ఇస్తుందని ఆశాజనకంగా ఉన్నారు. గణాంకాల ప్రకారం తెలంగాణలో 1100 లైసెన్సుడ్‌ ‌బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది కోవిడ్‌ ‌విస్తృతి ఫలితంగా లాక్‌ ‌డౌన్‌ ‌వలన కోలుకోలేని నష్టం వచిందీ. ఆదుకునే చర్యగా ప్రభుత్వం ఆరు నెలల లైసెన్స్ ‌రద్దు చేసింది.

ఈ ఏడాది మే నెలలో లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడంతో అన్నీ మూతపడి మద్యం వ్యాపారం నిలిచిపోయి వ్యాపారులకు నష్టం కలిగింది. ప్రభుత్వం కూడా నెలకు 500 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. ప్రభుత్వం ఇటీవల లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేసినా.. వినియోగదారులు బార్లకు రెస్టారెంట్లకు రావడానికి భయపడుతున్నారు. అందుకే ఇంకా అన్ని తలుపులు బార్లా తెరచుకోలేదు. ఈ పర్యాయం ప్రభుత్వం లైసెన్స్ ‌ఫీజు రద్దు చేసే ఉద్దేశం లేదు. ప్రత్యామ్నాయంగా ఉచిత, రాయితీ మద్యం విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు అధికార యంత్రాంగమే చెబుతున్నదట. మద్యం అమ్మకాల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఉదార విధానంతో ముందుకు వస్తున్నదని బార్‌ల ప్రతినిధులు చెబుతున్నారు. అందరూ భయపడుతున్నట్లూ థర్డ్ ‌వేవ్‌ ‌వచ్చినా, బార్లలో మద్యం ప్రియుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని సదుపాయాలు, చర్యలు పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. బార్‌లు, రెస్టారెంట్‌ ‌సిబ్బందికి వాక్సినేషన్‌ ‌కూడా వేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇంకేం.. ఫ్రీ మందు, ఆ తరువాత డిస్కౌంట్‌..

Leave a Reply