Take a fresh look at your lifestyle.

పశ్చిమ బెంగాల్‌లో ఊపందుకున్న నాలుగోవిడత ఎన్నికల ప్రచారం

అందరి దృష్టి సింగూర్‌పైనే..

‌పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నాలుగో దశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్‌ ‌జరుగనున్న 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరి దృష్టి సింగూర్‌ ‌నియోజకవర్గంపైనే ఉంది. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీకి అధికారాన్ని కట్టబెట్టడంలో నందిగ్రామ్‌తో పాటు సింగూర్‌ ఉద్యమం కీలకపాత్ర పోషించింది. అందుకే ఇప్పుడు సింగూర్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన అనివార్య పరిస్థితి మమతా బెనర్జీకి ఏర్పడింది. అంతేగాక మమతా బెనర్జీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆమెకు శిరోవేదనగా పరిణమించాయి. ఒకవైపు నందిగ్రామ్‌లో సువేంధు అధికారి బీజేపీలో చేరి బరిలో నిలబడటంతో దీదీకి కష్టాలు ఎక్కువయ్యాయి. మరోవైపు సింగూర్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన టీఎంసీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ ‌భట్టాచార్య ఇప్పుడు మమతా బెనర్జీకి తలనొప్పిగా మారారు. భట్టాచార్య వయసురీత్యా ఈసారి అతనికి టికెట్‌ ఇచ్చేందుకు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నిరాకరించింది. దీంతో 88 ఏళ్ళ రవీంద్రనాథ్‌ ‌కాషాయ కండువా కప్పుకొని సింగూరు బరిలోకి దిగి దీదీకి సవాలు విసిరారు. సింగూర్‌ ఉద్యమ సమయంలో మమతా బెనర్జీకి అండగా నిలబడిన వ్యక్తి, దీదీకి అనుకూలంగా రైతులు మొగ్గు చూపేలా చేయడంలో రవీంద్రనాథ్‌ ‌కీలక పాత్ర పోషించారు. సింగూరు ప్రాంతంలో అతనికి ఉన్న ఇమేజ్‌ ‌కారణంగా నాలుగుసార్లుగా ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సింగూర్‌ ‌నుంచి బేచారాం మన్నాను బరిలో నిలబెట్టింది. బేచారాం ప్రస్తుతం సింగూర్‌ ‌ప్రక్కనే ఉన్న హరిపాల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే ఆయనకు, రవీంద్రనాథ్‌కు మధ్య మొదటి నుంచి ఉన్న విబేధాల కారణంగా ఈసారి హరిపాల్‌ ‌సీటు నుంచి బేచారాం భార్యను అభ్యర్థిగా దీదీ నిలబెట్టింది. హరిపాల్‌ ‌సీటుకి పోలింగ్‌ ‌పక్రియ మూడోదశలో ఈనెల 6వ తేదీన జరుగనుంది.  అయితే ఒకే కుటుంబంలో భార్యభర్తలకు రెండు సీట్లు కేటాయించడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇటీవల సింగూర్‌లో జరిగిన ప్రచార సభలో ప్రసంగించిన మమతాబెనర్జీ, సింగూర్‌ అభ్యర్థిగా రవీంద్రనాథ్‌ ‌కాకపోతే, నందిగ్రామ్‌కు బదులుగా సింగూర్‌ ‌నుంచి తాను పోటీ చేసేదాన్ని అని అన్నారు. సింగూర్‌లో 2.30 లక్షలమందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 12% మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం  వామపక్ష%–% కాంగ్రెస్‌ ‌కూటమి కారణంగా మైనారిటీ ఓట్లు చీలిపోతాయి. అదే సమయంలో ప్రధానంగా ఉన్న హిందూ ఓటు టీఎంసీ, బిజెపిల మధ్య విభజించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పరిశ్రమను స్థాపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిపిఎం ప్రకటించింది. సింగూరు ఉద్యమం కారణంగా ప్రజలకు ఎలాంటి లబ్ధి జరుగకపోగా, కేవలం టీఎంసీలోని అగశ్రేణి నాయకులు మాత్రమే కోటీశ్వరులయ్యారని వామపక్షాలు వాదిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఈసారి తమకు మద్దతు ఇస్తారని పార్టీ చెబుతోంది. సింగూర్‌ అసెంబ్లీ సీటు హుగ్లీ జిల్లా పరిధిలోకి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హ్రుగ్లీ లోక్‌సభ సీటు నుంచి 70 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి లాకెట్‌ ‌ఛటర్జీ గెలుపొందారు. దీంతో ఇప్పుడు రవీంద్రనాథ్‌ ‌భట్టాచార్య సైతం టీఎంసీని వదిలి బీజేపీలో చేరడంతో తప్పకుండా సింగూరులో కమలం వికసిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

Leave a Reply