నలుగురు మావోయిస్టులు మృతి ఆయుధాలు స్వాధీనం
తెలంగాణ సరిహద్దున ఉన్న ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలో బుధవారం నాడు పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురరు మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని సుకుమార్ జిల్లా జాగరుగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడపడుతున్నారు. పోలీస్ బలగాలను మావోయిస్టులు పసిగట్టారు.
వెంటనే కాల్పులకు దిగడంతో పోలీసులు కూడ ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తరు ఐజి సుందర్రాజు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాల కోసం గాలిస్తుండగా మావోయిస్టుల వద్ద 303 రైఫిల్ కంట్రిమేట్ తుపాకులు మందుగుండు సామాగ్రి లభించినట్లు ఐజి పేర్కొన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.