Take a fresh look at your lifestyle.

వందేళ్ళ పివికి ‘ప్రజాతంత్ర’ అక్షర వందనం

సామర్ధ్యం, నిజాయితీ, చిత్తశుద్ధి, వినయం, వివేకం, పోరాట పథం..ఇవన్నీ ఒక్కచోట కుప్పగా పేర్చితే అదే పివి నరసింహారావు. సాహితీ దురంధరుడు, న్యాయశాస్త్ర నిపుణుడు, బహుబాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, దేశ ఆంతరంగిక, విదేశాంగ విధానాల రూపశిల్పి, సంస్కరణల అమలుకు ఆద్యుడు, రాష్ట్రంలో, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలను ఆపోశన పట్టిన అపర భగీరథుడు….సాక్షాత్తు భారత ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించిన మహోన్నత వ్యక్తి, పాములపర్తి వేంకట నరసింహారావు. ఆయన జన్మించి నేటికి 100 సంవత్సరాలు. పివి శతజయంతి సంబురాలతో తెలంగాణ నేల నేడు పులకించింది. పివి దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఏడాదికాలంగా ఘనంగా నిర్వహిస్తున్నది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీ రంగంలో విశేష కృషి చేసిన పివి నరసింహారావుకు నివాళిగా, మహోన్నత మూర్తిమత్వం ఉన్న పివి వ్యక్తిత్వాన్ని, రాజనీతి, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు.

రాజధానిలోని నెక్‌లేస్‌ ‌రోడ్‌కు పివి మార్గ్‌గా నామకరణం చేసి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్‌ ‌తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. అంతకు ముందు పివి మార్గ్‌ను గవర్నర్‌ ‌ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పివి కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్‌ ‌రోడ్డులో 27 లక్షల రూపాయల వ్యయంతో 26 అడుగుల ఎత్తులో పివి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. పివి మార్గ్ ‌లోని జ్ఞానభూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పివి శత జయంతి సందర్భంగా దిల్లీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పివి సొంతమని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో మంత్రులు, కలెక్టర్ల నిర్వహణలో శతజయంతి కార్యక్రమాలు జరిపి గౌరవించారు.

తెలంగాణ ముద్దు బిడ్డ శతజయంతిని ఏడాదిపాటు నిర్విరామంగా దేశ విదేశాల్లో జరపాలని ఏడాది క్రిందట నిశ్చయించి సీఎం చంద్రశేఖర్‌ ‌రావు ‘‘పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ’’ ఏర్పాటు చేసి, కమిటీ చైర్మన్‌ ‌గా పార్లమెంట్‌ ‌సభ్యుడు కె కేశవరావుని నియమించారు. పివి శత జయంతి ఉత్సవాల కోర్‌ ‌కమిటీ, పుస్తక ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఒక ఉప కమిటీని నిపుణులతో ఏర్పాటు చేయగా ఉప కమిటీ పర్యవేక్షణలో దాదాపు సంవత్సర కాలపు కృషితో మొత్తం 8 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో పివి నర్సింహారావు రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వీటిని శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. కొన్ని పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. ఈ గ్రంథాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించింది. అలా ఇప్పుడు మొత్తం 8 పుస్తకాలను ప్రచురించారు. పివి గొప్పతనాన్ని ఇప్పటి, భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఉత్సవాల్లో భాగంగా పీవీ స్వగ్రామం వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నది. వందేళ్ళ క్రితం కట్టిన వంగరలోని ఆయన సొంతింటిని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘పివి నర్సింహారావు మెమోరియల్‌ ‌మ్యూజియం’గా అభివృద్ధి పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆయన వాడిన వస్తువులు, అరుదైన ఫొటోలు, రచనలు, ఆయన ఇష్టపడి తెచ్చుకున్న ప్రత్యేకమైన వస్తువులన్నింటినీ మ్యూజియంలో పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పివి సాహిత్య కృషీవలుడు. కంప్యూటరును ఉపయోగించడంలో ముందంజలో ఉండేవారు. బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వొచ్చు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్‌లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్‌ ‌కాస్ట్రోను అబ్బురపరచారు. పివి నిరాడంబరుడు. ఆయన కడిగిన ముత్యం..వజ్రతుల్యుడు..ఆయన కాలి చిరుగోటికి సరిరారెవ్వరూ. పివి ప్రధానిగా ఉన్నప్పడు జేజేలు పలికిన నోళ్ళు, మాజీగా మిగిలినప్పుడు ఒక్కటీ పెగలలేదు. గాంధిభవన్‌లో వెనుక ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి చెక్క కుర్చీల్లో పేరుకుపోయిన దుమ్మును కండువాతో తుడుచుకుని కూర్చుని మౌనంగా నడిచివెళ్ళిన మహనీయుడు. నెహ్రూ కుటుంబానికి ఆయన అత్యంత శ్రేయోభిలాషి. ఇందిరా గాంధీ, రాజీవ్‌ ‌గాంధీలకు ఆప్తుడు. కానీ సోనియాకు అయిష్టుడు.

దేశ రాజకీయాలలో విలువలకు, వ్యక్తిత్వానికి, రాజనీతిజ్ఞతకు, భాషా సంపదకు, కవిత్వానికి, రచనా పాటవానికి పివితో సరితూగగలిగే ఏకైక వ్యక్తి అటల్‌ ‌బిహారి వాజ్‌పేయీ…మాత్రమే ! మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. తెలంగాణా ముద్దుబిడ్డడుగా చరిత్ర సృష్టించిన ఘనుడు పీవీ నరసింహారావు. అందుకే ఇది పివి మన ఠీవి అని తెలంగాణా సగర్వంగా చాటుకుంటుది. దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘతన పివి దే. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసారు. ఆర్థికమంత్రి, మన్మోహన్‌ ‌సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివి ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించారు.

ఆయనొక కీర్తి శిఖరం. వెలుగులు ప్రసరించే దీప స్తంభం. భావానికే భాషనేర్పిన పాండిత్య ప్రకర్షకు ప్రతిరూపమాయన. ఒక జ్ఞాని. తెలుగు వాడి, వేడి, ఠీవి కలగలయికల రూపం. రాజకీయనాయకుడే కాదు, ఒక రాజనీతిజ్ఞుడు, బృహస్పతి. స్వాతంత్య్ర యోధుడేకాదు ఒక సాహితీ స్రష్ఠ, రచయిత, కవి, గాయకుడు. రాజర్షిగా ఆగిపోక మహర్షిగా ఎదిగారు. జనహితుడు, విద్వద్‌జన ప్రీతిపాత్రుడు. మితభాషి అయినా అమిత ప్రతిభా సంపన్నుడు. చదువులోను-చెలిమిలోనూ మిన్న. కాంగ్రెస్‌ ‌సిద్ధాంతకర్త. ఆయనది మౌన సాగర గాంభీర్యం. రాజకీయ సాహితీ రంగాల్లో సవ్యసాచి. పఠనం, రచన, రంగస్థలం ఆయనకిష్టమైన మూడు లోకాలు. విలువలు పాటించి ఎదిగిన పాత్రికేయుడు. పదవులు తృణప్రాయం. సమయస్ఫూర్తి, చమత్కారం ఆయన ఆస్తులు. అందరికీ తెలిసిన ఒక అపరిచితుడు. అర్థం కాని అంతర్ముఖుడు కూడా. సహస్ర చంద్రోదయాలను చూసిన అదృష్టవంతుడు. ప్రజ్ఞావంతుడైన పి వి పై గత ఏడాదికాలంలో పలువురు పాత్రికేయులు వివిధ భాషల్లో అనేక పుస్తకాలు రాసి ఆయన దార్శనికతను శ్లాఘించారు. అపార ప్రజ్ఞాశాలికి ఇదే అక్షర వందనం.

Leave a Reply