Take a fresh look at your lifestyle.

కవిత రీఎంట్రీ ..!

  • సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశంతో… బీజేపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు
  • నిజామాబాద్‌ ‌నియోజకవర్గంలో మళ్లీ పట్టు పెంచుకునే వ్యూహం

‌గత కొన్నాళ్లుగా రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్న నిజామాబాద్‌ ‌మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్‌ ‌కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకుపై ఆమె కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టడంతో నిజామాబాద్‌ ‌జిల్లా గులాబీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశంపై కేవలం విమర్శలకే పరిమితం కాకుండా బీజేపీ నేతల దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలతో పాటు 24 గంటల సింగరేణి బంద్‌కు పిలుపునిచ్చి మరోమారు తన రాజకీయ అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేరు. గత పార్లమెంటు ఎన్నికలలో నిజామాబాద్‌ ‌స్థానం నుంచి సిట్టింగ్‌ ఎం‌పీగా పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ‌చేతిలో ఓటమి చవిచూశారు. సీఎం కేసీఆర్‌ ఆమె విజయం కోసం స్వయంగా ప్రచారం చేసినప్పటికీ అనూహ్యంగా ఆమె ఓటమి పాలు కావడం అప్పట్లో రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఆ తరువాత నుంచి కవిత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకుంటారనీ, కీలకమైన పోర్ట్‌ఫోలియో సైతం ఇస్తారని ప్రచారం జరిగింది. కవిత మళ్లీ రాష్ట్ర రాజకీయాలలో యాక్టివ్‌గా ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీని దెబ్బతీయవచ్చని సైతం కేసీఆర్‌ ‌కుటుంబం సైతం భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ ‌నేతలు పేర్కొంటున్నారు. ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకు రావాలంటే ప్రభుత్వ పరంగా కీలక పదవిని అప్పగించే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని పార్టీ వర్గాలలో చర్చ జరిగింది. అయితే, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చే ఎన్నికల నాటికి అధికార పీఠం దక్కించుకోవాలని భావిస్తున్న కమలనాథుల ఆశలకు బ్రేక్‌ ‌వేయాలన్నా కవిత రీఎంట్రీ ఇవ్వాల్సిందేననే టీఆర్‌ఎస్‌ ‌నేతలు పలుమార్లు ఆమెకు విజ్ఞప్తి చేశారు. అయితే, నిజామాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌ ‌వేసే సమయానికి రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌ప్రభావం తీవ్రంగా పెరగడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మరోసారి కవిత నిరాశకు గురికాక తప్పలేదు. అయితే, ఆ నిరాశ నుంచి తేరుకుని పార్టీలో క్రియాశీలకంగా మారని పక్షంలో భవిష్యత్తులో రాజకీయంగా మరింతగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో కవిత మరోసారి క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు అందివచ్చిన అవకాశంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా నిజామాబాద్‌ ఎం‌పీగా సైతం ఉన్న ధర్మపురి అర్వింద్‌ ‌కూడా బీజేపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా అటు కేంద్రంపై ఇటు స్థానిక ఎంపీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టినట్లవుతుందని కవిత భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించడం ద్వారా కార్మికులకు కలిగే నష్టాలను వివరిస్తూ ఆమె బీజేపీపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. లాభదాయకమైన బొగ్గు గనుల ప్రైవేటీకరణతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి కార్మికులను రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నదని పదునైన విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా తన పిలుపుతో సింగరేణి బొగ్గు గని కార్మికులు భారీ సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారనీ, దీంతో ఇప్పటికీ రాజకీయంగా తన ప్రభావం తగ్గలేదని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇక టీఆర్‌ఎస్‌ అనుబంధ సింగరేణి బొగ్గు గని కార్మికసంఘమైన టీబీజీకేఎస్‌ ‌సమ్మె ఘన విజయం సాధించిన అంశంపై కవిత చేసిన ట్వీట్‌ ‌వైరల్‌గా మారింది. వందల సంఖ్యలో రీట్వీట్లతో ట్విట్టర్‌ ‌ట్రెండింగ్‌లో అగ్రగామిగా సైతం నిలవడం గమనార్హం. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశంపై పోరాటంతో కవిత ముందస్తు వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె తాజా రాజకీయ కార్యాచరణను బట్టి స్పష్టమవుతున్నది. మరి ఈ విషయంలో ఆమె ఎంత వరకు విజయవంతమవుతారో చూడాలి.

Leave a Reply