- విశాఖ పర్యటలో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కేసు నమోదు చేసి దెందులూరు తరలింపు
ఏలూరు,ఆగస్ట్ 30 : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు విశాఖ జిల్లాలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం కోర్టుకు సెలవు కావడంతో ఏలూరులో మేజిస్ట్రే ఇంటికి తీసుకువెళ్ళి,న్యాయమూర్తి ఎదుట చింతమనేని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనపై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు ముందుగా ఇక్కడే అరెస్టు చూపించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రభాకర్, ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరిగారంటూ విశాఖ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం అని విశాఖపట్నం రూరల్ ఎస్పీ తెలిపారు.
గంజాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మూగజీవాల అక్రమ, రవాణా మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నాం. దారకొండ ఏజెన్సీ ప్రాంతానికి పదికి పైగా వాహనాల్లో కొంతమంది వచ్చి ఇక్కడ అలజడి సృష్టించి వెళ్తున్నట్లుగా స్థానిక గ్రామస్తుల నుండి మాకు( పోలీసులకు) సమాచారం వచ్చింది. చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు జరుపుతుండగా ఓ వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని మా సిబ్బంది గుర్తించారు. అయితే ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా వాహనంలో ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్లేందుకు వచ్చిన వ్యక్తి మాజీ ఎంఎల్‌ఏ చింతమనేని ప్రభాకర్ గా గుర్తించాం. అధికారులు అడుగుతున్నా ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా చింతమనేని ప్రభాకర్ ను అదుపులో తీసుకున్నామని అన్నారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు మరికొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చింతమనేని తో పాటు వచ్చిన మరో 8 నుండి 10 వాహనాల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నాం అని పేర్కొన్నారు.