- సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తే తెలుస్తుంది
- మాజీమంత్రి లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్ను కోరాలని ఉందన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడుతూ.. 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3, 4గంటల కరెంట్ ఇవ్వాలని సిఎంను కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు.
సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి..ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడంలేదని, జనం మంచివారనాలా.. అమాయకులనాలో తెలియడంలేదని, పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని అన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందంటూ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.