“తన మొదటి ఉపన్యాసంలో సబ్బంఢ వర్గాలను పేరు పేరున చెప్తూ వారి కష్టాన్ని గూర్చి మాట్లాడిన ప్రవీణ్ కుమార్ వారిని ఆకర్షించే ప్రయత్నం చేసారని చెప్పవచ్చు. అయితే వారిలో విశ్వాసం ఏర్పడి అతనితో కలిసి నడవాలంటే అతను వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది. అతను వేసే ప్రతి అడుగు ఆశావహులైన బహుజన సునిశితంగా గమనిస్తుందనే విషయాన్ని ప్రవీణ్ కుమార్ మరిచిపోవద్ధు. తను ఏవైతే ఆదర్శాలు చెప్పాడో ఆ ఆదర్శాలను చేరుకునే కార్యాచరణను కూడా ఇంకా ప్రకటించలేదు. తన కార్యాచరణను ప్రకటించకపోతే ప్రవీణ్ కుమార్ తో కలిసి నడుద్దామని ఆలోచించే బహుజన మేధావులు, ప్రజలు ఏ నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో ఉండిపోతారు. కాబట్టి తన లక్ష్యాలు, తను చెప్పే ఆదర్శాలను చేరుకునే కార్యాచరణ ప్రణాళికను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలి.”
పోలీస్ ఆఫీసర్ గా తనదైన అధికార ముద్రను చూపించి ప్రజాస్వామిక వాదుల నుండి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికి గురుకులాల కార్యదర్శిగా అభిమానాన్ని చూరగొన్నాడు. దళిత,గిరిజన, బహుజన జాతులకు చెందిన నిరుపేద సామాన్య విద్యార్థులను అసమాన విద్యార్థులుగా తీర్చి దిద్దాడు. తనదైన సృజనాత్మక ఆలోచన శక్తితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవకాశాలు కల్పిస్తే అందరూ అద్బుతంగా తమ ప్రతిభను ప్రదర్శించగలరని చేసి చూపించాడు. ప్రతిభకు అగ్రవర్ణాల,ఆధిపత్య కులాలు,వర్గాలు ఇచ్చిన నిర్వచనం తప్పని నిరూపించాడు. ఇట్లా కార్య నిర్వహణ క్షేత్రం నుండి ప్రజా క్షేత్రం లోకి వచ్చిన గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజీనామా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం అయ్యింది. విశాల ప్రజానీకానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజీనామా చేశా అని చెప్పుకొచ్చిన ప్రవీణ్ కుమార్ ఉన్న పళంగా రాజీనామా చేయడానికి గల స్పష్ఠమైన కారణాన్ని మాత్రం తెలియజెయలేదు.ఇక రాజీనామా చేసిన రోజు ఎవరికి వారూ విపరీతమైన ఊహాగానాలు చేసి అతని ప్రతిష్టను కొంత దెబ్బ తీయాలని ప్రయత్నించారు.ఇందులో అధికార పార్టీ కూడా పావులు కదిపింది. దానిలో భాగంగానే ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరుపున పోటీకి దిగుతున్నాడని సామజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం కల్పించారు. దీనికి మొదట్లోనే చెక్ పెట్టిన ప్రవీణ్ కుమార్ అధికారపార్టీ పై సూటిగా విమర్శలు మొదలు పెట్టడంతో ప్రభుత్వంతో పడలేకనే బయటకి వచ్చారని సామాన్య జనం బహిరంగంగానే గుసగుసలాడారు.
అయితే ప్రవీణ్ కుమార్ కంటే ముందుగా కార్యనిర్వహణ క్షేత్రం నుండి ప్రజా క్షేత్రంలోకి వచ్చిన అధికారులలో కేజ్రీవాల్ ఒక్కడే ఢిల్లీ లో అధికారంలో కూర్చో గలిగాడు. అది కూడా అక్కడి ప్రత్యేక పరిస్థితుల వల్ల అది సాధ్యమైంది. తెలుగు రాష్ట్రాలలో జయప్రకాష్ నారాయణ మొదట అవినీతి నిర్మూలన పేరుతో లోక్ సత్తా అని ఉద్యమ సంస్థగా ప్రారంభించి తర్వాత రాజకీయ పార్టీగా ప్రజలలోకి వచ్చిన పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అట్లాగే సిబిఐ ఆఫీసర్ గా విశిష్టమైన పేరు సంపాదించుకున్న లక్ష్మి నారాయణ కూడా ఉన్నపళంగా ఉద్యోగానికి రాజీనామా చేసి మొదట రైతు సమస్యల ,గ్రామీణ అభివృద్ది పేరుమీద కార్యక్రమాలు నిర్వహించి రాజకీయాలలోకి వచ్చి అతను కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇక ప్రవీణ్ కుమార్ విషయానికి వస్తే పైన చెప్పిన వారిలా కాకుండా నేరుగా రాజకీయ కదనరంగం లోకి దూకినవాడు. అయితే జయప్రకాశ్ నారాయణ,లక్ష్మి నారాయణ లాంటి వారూ రాజకీయ ప్రవేశం చేసినప్పుడు పెద్దగా కలవరపడని పాలకవర్గం ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశంతో మాత్రం ఒక్కసారి ఉలిక్కిపడ్డదని చెప్పుకోవచ్చు.అందుకు కారణం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎత్తుకున్న నినాదమే. ‘‘బహుజన రాజ్యాధికారం’’ లక్ష్యంగానే రాజకీయాలలోకి వచ్చానని ప్రవీణ్ కుమార్ ప్రకటించడంతో రాష్ట్రంలోని అధికారపార్టీ అయోమయంలో పడిపోయింది.ఇప్పటికే ఈటల రాజేందర్ రాజీనామాతో ఒకింత విమర్శలకు గురైన ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ విమర్శలతో పాటు బహుజన రాజ్యాధికార నినాదం బలంగా వినిపించే సరికి సందిగ్ధంలో పడి నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
నిజానికి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత బహుజన అంత ఈటల వైపు ఆసక్తిగా చూసారు.కానీ కారణాలు ఏవైనా ఈటల మనువాద పార్టీ సంకలో చేరేసరికి సగటు బహుజనులు కూడా ఒకింత నిరాశ చెందారు.ఇదే సమయంలో బహుజన నినాదంతో రాజకీయ ప్రవేశం చేసిన ప్రవీణ్ కుమార్ నిరాశతో ఉన్న జాతికి కొత్త ఆశను కలిగించాడు. ఆధిపత్య రాజకీయ గుహలో వెలుగు రేఖగా కనిపిస్తున్నాడు. అయితే వినడానికి వినసొంపుగా, ఊహించుకోడానికి అద్బుతంగా అనిపించే ఈ ‘‘బహుజన రాజ్యాధికార’’ సాధన అంత సులభమైనదేమీ కాదు. గురుకులాల కార్యదర్శిగా తను చేసిన పనులతో సంపాదించిన గుర్తింపు, పూర్వ విద్యార్థులతో ఏర్పాటు చేసిన స్వేరో అనె అనుచర గణం ప్రవీణ్ కుమార్ బలాలు అయితే బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి అనేక సవాళ్లు ఉన్నాయి. నిచ్చెనమెట్లుగా చీలిపోయిన ఈ సమాజంలో వోట్లు కూడా నిచ్చెనమెట్లు గానే చీలిపోయి ఉన్నాయి.అట్లాగే బహుజన పేరు మీద అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు చీలిపోయి ఉన్నాయి. పాలక వర్గాలు వారి ప్రయోజనాలకోసం చీల్చినవి కూడా. బీసీ సామాజిక వర్గం నుండి బలమైన నాయకునిగా ఉన్న ఆర్.క్రిష్నయ్య, అదే సామజిక వర్గం నుండి ఎదిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇంకా ఇతర బీసీ సామాజిక వర్గ నాయకులు ఏ మేరకు ప్రవీణ్ కుమార్ తో కలిసి వస్తారా అనేది ఒక ప్రశ్న? గిరిజనం కూడా వర్గాలుగా చీలిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నాయకులు ఏ మేరకు ప్రవీణ్ కుమార్ తో కలిసి వస్తారు అనేది ప్రశ్నే? సాధారణ సామాజిక రిజర్వేషన్లకు ఆటంకం కలిగినపుడు ఐక్యంగా ఉన్నట్టు కనపడి రిజర్వేషన్ల వర్గీకరణ విషయానికి వచ్చేసరికి అగ్గిమీద గుగ్గిలం లాగ మండే దళిత సోదర కులాలు ఏమేరకు ప్రవీణ్ కుమార్ తో ఐక్యంగా నిలబడతాయి అనేది ప్రశ్నే? ఇప్పటికే మహాజన సోషలిస్ట్ పార్టీ పేరుతో ప్రయోగం చేసిన మంద కృష్ణ మాదిగ, అదే మంద కృష్ణ మాదిగ అనుచరుడిగా ఎదిగి పాలక వర్గాల కోసమో, మరింక దేనికోసమో కానీ బలమైన దళిత ఉద్యమ సంస్థ యం.ఆర్.పి.ఎస్ ను చీల్చిన వంగపల్లి శ్రీనివాస్ మాదిగను, సామాజిక పరివర్తన పేరుతో నడుస్తున్న విశారదన్, బహుజన వాద ప్రచారంతో తిరుగుతున్న కదిరి కృష్ణ లాంటి దళిత బహుజన నాయకులు ఏ మేరకు ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నడుస్తారు అనేది ఒక ప్రశ్న. అయితే వీరందరినీ కలుపుకుపోవటానికి ప్రవీణ్ కుమార్ సుదీర్ఘ చర్చ ,నిత్య సంభాషణ చెయ్యాల్సి ఉంటుది . అతను చెప్పిన విద్యా , వైద్యంల నిర్వహణ ఎట్లా ఉంటుంది, ఆర్ధిక సృష్టి దాని పంపిణి ఏ రకంగా జరుగుతుందనే విషయాన్నీ వారితో పంచుకుని వారిని ఒప్పించి కలుపుకోవలసి ఉంటుంది.
ఇంకా తన ప్రధాన బలంగా చెప్పుకునే స్వేరో అనే సంస్థ ద్వారా ఆ సంస్థలోని సభ్యులు చేసిన పనులు ప్రవీణ్ కుమార్ కి తెలిసి జరిగాయో, తెలియక జరిగాయో తెలియదు కానీ కొందరు వ్యక్తులు చేసిన చర్యలకు ఇబ్బంది పడ్డ దళిత జనం కూడా ఒకింత అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలోకి వచ్చాక కొత్తగా వచ్చే నాయకత్వాన్ని సమాజం సునిశితంగా గమనిస్తోంది. అందుకే స్వేరో సంస్థలోని వ్యక్తులను కట్టడి చేస్తూ నిబద్దత కలిగిన నాయకులుగా మలచవలసిన పని కూడా ప్రవీణ్ కుమార్ చెయ్యాలి. అంతేకాక గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు సంస్థ ఉద్యోగులతో ప్రవర్తించిన తీరుకు కూడా కొన్ని వర్గాల ఉద్యోగులు ప్రవీణ్ కుమార్ తో కలిసి నడవడానికి ఆలోచిస్తూ ఉండవచ్చు. అందరికి అన్నీ సానుకూలతలు రాజకీయాలలో కష్టమే కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారిని అందులో దళిత,బహుజన నాయకత్వాన్ని ఏదో ఒకరకంగా నీరు కార్చాలని చూస్తుంది ఈ ఆధిపత్య పాలక వర్గం. అందుకు బాలగోపాల్ అన్నట్టు హక్కుల అమలుకు ఇష్టంలేని పాలక వర్గం లేదా సమాజం హక్కుల దుర్వినియోగాన్ని ముందుకు తీసూకొచ్చి చర్చకు పెట్టినట్టే దళిత, బహుజన నాయకత్వాన్ని అడ్డుకోడానికి వారిలో ఏదో ఒక తప్పు దొరకపట్టడానికి కళ్ళకు భూతద్దం పెట్టుకుని మరీ వెతుకుతుంది ఈ పాలక వర్గం. కాబట్టి చాల జాగ్రత్తగా కార్యకర్తలను నడిపించవలసి ఉంటుంది.
విశాల ప్రజా నాయకునిగా ఎదుగాలంటే ప్రవీణ్ కుమార్ తన యూనిఫామ్ ద్వారా సంక్రమించిన వ్యక్తిగత అహం, దర్పాన్ని కూడా వదిలించుకొని సామాన్యులలో సామాన్యుడిలా కలిసిపొవలసిన అవసరం ఉంది. ఇక ప్రవీణ్ కుమార్ ముందున్న అతి పెద్ద సవాలు దళిత నాయకత్వాన్ని బహుజనం ఏ మేరకు అంగీకరిస్తుంది అనేది. రిజర్వుడ్ స్థానాలలో తప్పించి మిగతా అన్ని స్థానాలలో ఆధిపత్య కులాలు, వర్గాల వారినే ఎన్నుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. సహజంగానే కింది కులాల నాయకత్వం కంటే తమకంటే పై కులం నాయకత్వంలో పని చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపే భావజాలంలో ఉన్న సామాన్య ప్రజానీకం ని తనవైపుకు తిప్పుకోవడం ప్రవీణ్ కుమార్ ముందుగా చెయ్యాల్సిన పని. తన మొదటి ఉపన్యాసంలో సబ్బంఢ వర్గాలను పేరు పేరున చెప్తూ వారి కష్టాన్ని గూర్చి మాట్లాడిన ప్రవీణ్ కుమార్ వారిని ఆకర్షించే ప్రయత్నం చేసారని చెప్పవచ్చు. అయితే వారిలో విశ్వాసం ఏర్పడి అతనితో కలిసి నడవాలంటే అతను వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది. అతను వేసే ప్రతి అడుగు ఆశావహులైన బహుజన సునిశితంగా గమనిస్తుందనే విషయాన్ని ప్రవీణ్ కుమార్ మరిచిపోవద్ధు. తను ఏవైతే ఆదర్శాలు చెప్పాడో ఆ ఆదర్శాలను చేరుకునే కార్యాచరణను కూడా ఇంకా ప్రకటించలేదు. తన కార్యాచరణను ప్రకటించకపోతే ప్రవీణ్ కుమార్ తో కలిసి నడుద్దామని ఆలోచించే బహుజన మేధావులు, ప్రజలు ఏ నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో ఉండిపోతారు. కాబట్టి తన లక్ష్యాలు, తను చెప్పే ఆదర్శాలను చేరుకునే కార్యాచరణ ప్రణాళికను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలి.
ఇకపోతే ప్రవీణ్ కుమార్ ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాలు భావజాల పరమైనది. హిందుత్వ భావజాలాన్ని ఎదుర్కొకుండా బహుజన రాజ్యాధికారం సాధ్యం కాదు. ప్రస్తుత సమాజం నిలువునా చీలి అంతస్తులుగా స్థిరీకరించబడి బహుజనం విడదీయబడి విడివిడిగా ఉండటానికి ఆ భావజాలమే కారణం. కాబట్టి హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తూ హిందుత్వ వాదానికే తప్ప హిందువులకు వ్యతిరేకం కాదనే స్పష్టమైన సందేశాన్ని పంపుతూ బహుజనం అందరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి అప్పుడే ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న లక్ష్యం సాధ్యం అవుతుంది. ఏ కులం వారు ఆ కులం వారిని చూసి వోట్లు వేసుకునే సంస్కృతి ప్రబలంగా ఇంకిన ఈ సమాజంలో బహుజనున్ని ఎన్నుకోడానికి అవసరమైన చైతన్యాన్ని ముందుగా ఈ ప్రజలలో కల్పించాల్సిన బాధ్యత ప్రవీణ్ కుమార్ పై ఉన్నది. ఇందుకోసం ప్రవీణ్ కుమార్ తనకున్న అన్ని రకాల వనరులను ఉపయోగించుకుని గ్రామీణ ప్రజానీకంలోకి చొచ్చుకుపోవాలి. కాన్షీరామ్ బాటలో నడుస్తానన్న ప్రవీణ్ కుమార్ అదే తరహాలో గ్రామీణ ప్రాంతాలకు తరలి అన్ని వర్గాలను చైతన్య పరిచే కార్యక్రమాలు చెయ్యాలి. నూటికి తొంబై శాతం దళితులలో తనపై గల అభిమానాన్ని వోటు బ్యాంకుగా మార్చుకోవాలి. అట్లా అన్ని సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకుని బహుజన రాజ్యాధికారం దిశగా పయనించాలని బలంగా పడిన ప్రవీణ్ కుమార్ అడుగులు మధ్యలో ఆగొద్దని వెనక్కి తిరుగొద్దని ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకునే ఆశావహులు చాలా మంది ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ‘‘బహుజన రాజ్యాధికారం’’ ఎన్నికల నినాదం మాత్రమే అనే అపవాదుకు గురికాకుండా సుదీర్ఘ ప్రయాణంగా ముందుకు సాగాలి. అందుకు ప్రవీణ్ కుమార్ ప్రజాస్వామికంగా పనిచేస్తూ,ప్రజాస్వామిక హక్కులను మానవ హక్కులను గౌరవిస్తూ భవిష్యత్తులో వాటికి భంగం కలుగకుండా చూసుకుంటాననే హామీ ఇస్తూ బహుజనం అందరిని భుజం భుజం కలిపి నడిసేలా కృషి చేస్తేనే తాను బహుజనుడు కాగలడు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు.
– వి. దిలీప్, జిల్లా కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా
మానవ హక్కుల వేదిక, సెల్:8464030808