Take a fresh look at your lifestyle.

విభజన చట్టం హామీలు గాలికి…

ఆంధప్రదేశ్‌ ‌విభజన సమయంలో ఇటు తెలంగాణాకు,అటు ఆంధప్రదేశ్‌ ‌కీ కేంద్రం ఇస్తానన్న ప్రాజెక్టులు, వాగ్దానాలు అన్నీ నీటిమూటలయ్యాయి.డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి పట్టుపట్టడం వల్ల పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అందుకు తగిన నిధులను కేటాయించేట్టు చేయగలిగారు. తెలంగాణకు కాళేశ్వరాన్ని కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిననాటి నుంచి కోరుతున్నారు.కానీ , ఆంధప్రదేశ్‌ ‌విభజన చట్టంలోని అంశాలన్నీ నీటిమూటలవుతున్నాయి. వరంగల్‌ ‌కాజీ పేట రైల్వే వర్క్ ‌షాపుకు 60 ఎకరాల భూమిని కోరితే తెలంగాణ ప్రభుత్వం 150 ఎకరాలను ఇచ్చింది.,అలాగే, ఐటి రంగంలో వేలాది ఉద్యోగాలు వొస్తాయంటూ ఊరిస్తున్న ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టును గురించి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఇప్పటికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా దానికి కూడా కేంద్రం మొండి చెయ్యి చూపిస్తోంది.అసలు కేంద్రానికి ముఖ్యంగా, బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనం ఉంటే తప్ప ప్రాజెక్టుల సంగతి గుర్తు రావడం లేదు.

తెలుగురాష్ట్రాల్లో ఎంత ప్రయాస పడినా బీజేపీకి చెప్పుకోదగిన సీట్లు రావన్న సంగతి కమలనాథులకు తెలిసింది.అందుకే, ఈ రెండు రాష్ట్రాల వారూ ఎంత మొరపెట్టుకుంటున్నా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించే ప్రయత్నం చేయడం లేదు. ఆంధప్రదేశ్‌ ‌లో అత్యంత కీలకమైన విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ‌విషయంలోనూ కేంద్రం సాచివేత ధోరణిని అనుసరిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనూ అలాగే వ్యవహరిస్తోంది.ఇటు తెలంగాణకు,అటు ఆంధప్రదేశ్‌ ‌కూ కేంద్రం విభజన చట్టంలోని హామీల్లో దేనినీ అమలు జరపడం లేదు. కర్నాటకలో కూడా ముఖ్యమంత్రి యెదియూరప్ప కారణంగానూ, జనతాదళ్‌ ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌విభేదాల కారణంగానూ బీజేపీ అధికారంలో కొనసాగగలుగుతోంది.

తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామిని చేరదీసి అన్నా డిఎంకెతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది.అయితే , కేవలం 50 లోపు సీట్లు ఇవ్వడంతో అన్నా డిఎంకె బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పుదుచ్చేరిలో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు నిలిచే పరిస్థితులు లేవు. కేరళలో ముఖచిత్ర విలువను పెంచుకోవడానికి మెట్రో మ్యాన్‌ ‌గా పేరొందిన శ్రీధరన్‌ ‌ను ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించడాన్ని బీజేపీ నాయకులే తీవ్రంగా విమర్శిస్తున్నారు. తొమ్మిది పదుల శ్రీధరన్‌ ‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడాన్ని బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర నిరసన తెలిపారు. తొమ్మిది పదులు దాటిన నాయకుణ్ణి ముఖ్యమంత్రి పదవికి ఎంపికి చేసినప్పుడు అద్వానీ, జోషి వంటి సీనియర్‌ ‌నాయకులపై ఆంక్షలెందుకంటూ ఆయన సూటిగానే ప్రశ్నించారు.

- Advertisement -

బీజేపీ ఒక సిద్దాంతమంటూ, లేదా ఒక సంప్రదాయమంటూ లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ,అక్కడి ముఖ్యమంత్రులకు గొంతెత్తే స్వతంత్రత లేకపోయినా ప్రధాని మోడీయే స్వయంగా ఆయా రాష్ట్రాల్లో పథకాలు, ప్రాజెక్టుల పనుల గురించి స్వయంగా శ్రద్ద తీసుకుంటున్నారు. ఉదాహరణకు గుజరాత్‌ ‌కు బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ గురించి తెలంగాణ మంత్రి కెటి రామారావు ఇటీవల చేసిన ఎద్దేవా సహజమైనదే. అలాగే, అసోం, పశ్చిమ బెంగాల్‌, ‌కేరళలకు ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్న ప్రాజెక్టులన్నీ నిధులు ఉండి చేసినవని ఎవరూ అనుకోరు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ నాయకత్వం ఎంతకైనా తెగబడుతోంది.

ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చేయని ప్రయత్నమంటూ లేదు.ఇన్ని చేస్తున్నా, బెంగాల్‌ ‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనైతికమైన విధానాలకు తెరలేపుతోంది. తాజాగా మరో సీనియర్‌ ‌నాయకునికి కాషాయ కండువా కప్పింది.ఎంత మంది వెళ్ళిపోయినా, బెంగాల్‌ ‌ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని మమతా బెనర్జీ బహిరంగంగానే ప్రకటించారు.ఆమెకు ప్రజల పట్ల విశ్వాసం తాను అమలు జేసిన పథకాలు, కార్యక్రమాల ద్వారానే కలిగింది. అలాగే.,ప్రజాసేవారంగంలో నిత్యం ఉండేవారికి సహజంగా ఉండే ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది. కేంద్రం రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్ష విషయంలో గతంలో ఆమె ఒక్కరే గట్టిగా మాట్లాడేవారు.ఇప్పుడు తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు కూడా గణాంకాలతో ప్రజలకు వివరణ ఇస్తున్నారు. పసుపుబోర్డు విషయంలో కేంద్రం చేసిన వాగ్దానాన్ని తీర్చలేదు.వరంగల్‌ ‌రైతులకు పత్తి విషయంలో ఇచ్చి న హామీలను నెరవేర్చలేదు.ఇవన్నీ ఆయన తాజా గా గణాంకాలతో సహ వివరిస్తూ బీజేపీ వాగ్దానాల డొల్లతనాన్ని బయటపెడుతున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబాయి తర్వాత సాంకేతిక,ఐటి రంగాల్లో పేరొందిన హైదరాబాద్‌ ‌ను అభివృద్ధి ఇంజన్‌ ‌గా చేయాలన్న డిమాండ్‌ ‌ను ఆయన ఇటీవల హైదరాబాద్‌ ‌లో జరిగిన సదస్సు సందర్భంగా సూచించారు. కేంద్రం ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటుందో అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి బదులు రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పటికైనా కేంద్రం ఎన్నికల మూడ్‌ ‌నుంచి బయటికి వొచ్చి వాస్తవ దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలను అమలు జేయాలని జనం కోరుకుంటున్నారు.

Leave a Reply