వికారాబాద్: వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో మంగళవారం జంతువులను వేటాడడానికి యత్నించిన వ్యక్తులను పట్టుకున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి వేణుమాధవ్, వికారాబాద్ రేంజ్ ఫారెస్టు అధికారి బాలయ్యలు తెలిపారు. మంగళవారం ఉదయం దామగుండం రిజర్వు ఫారెస్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు జంతువులను వేటాడటానికి ఉపయోగించే ఉచ్చులతో పట్టుబడటం జరిగిందని తెలిపారు.
పట్టుబడ్డ వారిలో పూడూరు గ్రామానికి చెందిన తిప్పని నరేందర్, మల్ల గట్టి పాండు, షాబాద్ తిరుపతిలు ఉన్నారని, వీరిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న లాక్ డాన్ పరిస్థితుల్లో ప్రజలు ఎవరైనా సరే అడవుల్లో వన్యప్రాణులను వేటాడటం, అటవీ భూములను ఆక్రమించడం, చెట్లను నరకడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ హెచ్చరించారు.