Take a fresh look at your lifestyle.

అటవీ చట్టం సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం….??

తినడానికి తిండి గింజల కోసం, తాతముత్తాతల కాలం నుండి అడవిని నమ్ముకొని, అడవిని కాపాడుతూ, అడవియే జీవనాధారంగా ప్రకృతి ఒడిలో నివసిస్తున్న కల్లకపటమెరుగని, కల్మషం లేని మట్టి మనుషులు ఆహారం కోసం పోడు భూములను సాగు చేస్తుంటే వారిపై అనేక రకాల కేసులు బనాయించి ఆడా మగా అనే తేడా లేకుండా జైల్లో పెట్టి నానా చిత్రహింసలకు గురి చేస్తూ వారి జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. ఆ భూములలో పండించిన పంటలు చేతికందే వాటిని కూడా నాశనం చేస్తూ వారి జీవన మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారు.

భూగోళం మీద సమస్త జీవజాలానికి మరియు మానవ మనుగడకు జీవనాధారం పచ్చని చెట్లు.. చెట్లు లేని మానవ జీవితం ఉండదు. మానవుని జీవితంతో ముడిపడి ఉన్న చెట్లను అత్యంత ప్రాముఖ్యత నిచ్చి పెంచాల్సిన అవసరం ఉంది .అందుకు గాను భారత ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టం 1980 లో తీసుకు వచ్చింది .వలస పాలకుల హయాంలో అమలు చేసిన అటవీ చట్టం 1927 కొనసాగింపు. దానిని మరింత పటిష్ట పరిచి స్వాతంత్య్రానంతరం అడవిని కాపాడుకునేందుకు తీసుకువచ్చిన అటవీ పరిరక్షణ చట్టం .దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలను కట్టబెట్టింది .అటవీ భూమిలో అటవీయేతర కార్యక్రమాలు ,రాష్ట్రాలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంతటి కీలకమైన చట్టాన్ని ఇంతవరకు రెండు సార్లు సవరించడం జరిగింది. మొదటగా 1988లో మరియు 1996లో రెండోసారి సవరించడం జరిగింది,. భూమి మీద నానాటికీ తరిగిపోతున్న పచ్చని చెట్లు భవిష్యత్తు తరాల మనుగడను ప్రశ్నిస్తుంది. ఇలా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణ కర్తవ్యంగా మొక్కలు నాటాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పదేపదే పిలుపునిస్తూ ఉండటం., ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2020 ప్రకారం విష గాఢత గల గాలి అధికంగా ఉన్న మొదటి 30 నగరాల్లో 22 భారత్‌ ‌లోనే ఉండటం ఇబ్బంది కరం. ఈ గడ్డు పరిస్థితి నుండి బయట పడాలంటే శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడంతోపాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.

దేశంలోని చాలా నగరాలు కాలుష్య నిలయాలుగా మారాయి. ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉంది. అక్కడ 2020 ఏప్రిల్‌ ‌కంటే 2021 ఏప్రిల్‌ ‌లో నైట్రోజన్‌ ‌డయాక్సైడ్‌ ఏకంగా 125% పెరిగింది. ఏడాది వ్యవధిలో నైట్రోజన్‌ ‌డయాక్సైడ్‌ ‌స్థాయి బెంగళూర్‌ ‌లో 90%, హైదరాబాద్‌ ,‌ముంబైలలో 52% జైపూర్‌ ‌లో 47% లక్నోలో 32 శాతం చొప్పున పెరిగింది. ఇలా జీవకోటి ప్రాణాధారమైన గాలి విషతుల్య మవుతుంది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి . కానీ భారత్‌ ‌లో 21 శాతం అటవీ ప్రాంతాన్ని మాత్రమే కలిగి ఉంది. అడవిని పెంచడానికి కృషి చేస్తామని ప్రపంచ వేదికలకు భారత్‌ ‌హామీ ఇచ్చింది. మూడు బిలియన్‌ ‌టన్నులుగా ఉన్న వార్షిక కార్బన్‌ ‌వినియోగాన్ని 2030నాటికి 2.5 బిలియన్‌ ‌టన్నుల కు తగ్గిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇందుకోసం రానున్న కాలంలో అటవీ విస్తీర్ణాన్ని 21 శాతంనుండి 33 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికి భిన్నంగా ఇతర అవసరాల కోసం అటవీ మళ్లింపు అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అడవిని కొట్టుకుంటాం… అభివృద్ధి ప్రాజెక్టులు కడతాం అంటూ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టాన్ని నవీకరించాలి అని కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.

అటవి పరిరక్షణ చట్టం 1980 (ఫారెస్ట్ ‌కన్జర్వేషన్‌ ‌యాక్ట్ ‌FCA) ) ను సవరించాలని ప్రతిపాదన సవరణలను తయారుచేసింది. ప్రతిపాదిత సవరణలపై వ్యాఖ్యలు సలహాలు ఆహ్వానిస్తూ ఈ నెల 2న సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్‌ ‌ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలో అటవీ భూమిని అటవీ యేతర ప్రయోజనాలకు ఉపయోగించుకునే టప్పుడు ప్రాజెక్టులో నెలకొల్పే ప్రైవేట్‌ ‌డెవలపర్లు, రాష్ట్రాలు కేంద్రం అనుమతి తీసుకోవాలని, కానీ కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు డెవలపర్లు ఇందుకు కావలసిన అనుమతుల కోసం కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనను ఈ ముసాయిదాలో పొందుపరిచారు. జాతీయ భద్రతకు సరిహద్దులో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టి ఏజెన్సీలు కేంద్ర రోడ్డు రవాణా శాఖ 1980 కి ముందు, అటవీ పరిరక్షణ చట్టం అమలులోకి రాకముందు సేకరించిన భూముల్లో చేపట్టే కార్యకలాపాలకు కేంద్రం అనుమతులు అవసరం లేదు. తద్వారా అటవీ భూముల మళ్లింపు లకు ఇప్పటివరకు చట్టపరంగా ఉన్న కఠిన నియంత్రణను మొత్తంగా సడలించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవరణ ప్రతిపాదనలు ప్రైవేటు వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని నిర్దిష్ట సవరణలు ,సవరణలకు సంబంధించిన పదాలు వాటికి ప్రతిస్పందన రూపొందించడంలో చాలా కీలకమని అయితే ఈ విషయాలను విస్మరించారని ప్రతిస్పందనలకు 15 రోజులు మాత్రమే వవ్యధి ఇచ్చారని, చట్ట సవరణ కోసం ముందు జరిగే సంప్రదింపుల విధానం ప్రకారం 30 రోజులు ఇవ్వాలి. అడవుల సంరక్షణ అటవీకరణ పరిహారం చెల్లింపులు వంటి అంశాలపై వివిధ సందర్భాలలో అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను నాశనం చేయడానికి తాజా ప్రతిపాదన సవరణలు ముందుకు తేవడం జరుగుతుందని, అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించుకునే టప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిపాదకులకు ఏదైనా అసౌకర్యం కలిగితే ఫారెస్ట్ ‌కన్జర్వేషన్‌ ‌యాక్ట్ ‌దరఖాస్తును రద్దు చేసుకోవాలని ప్రతిపాదించారని ఈ ప్రతిపాదనతో అటవీ భూమిని హస్తగతం చేసుకునే సౌకర్యం ఇవ్వటమే కాకుండా ప్రైవేటీకరణ ప్రయోజనాలను పొందాలనుకునే కార్పొరేట్లకు సులభంగా అతి చౌకగా అందించే అవకాశాలు ఉన్నాయి.

పర్యావరణ సమస్యలు పరిష్కరించడం కన్నా ప్రైవేటు ప్రాజెక్టుల ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం ఎక్కువ ఆందోళన చెందుతుంది. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించి సమాఖ్య విధానానికి తూట్లు పొడిచి, కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కేంద్రీకృతం అవుతాయి. చట్టాలను ఉల్లంఘించే పెద్ద కంపెనీలు ప్రైవేటు వ్యాపారాలపై భారీ జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నా ప్రతిపాదిత సవరణలు ఆ వర్గాల ప్రయోజనాలకే ఉద్దేశించినవి అని , అటవీ భూముల నిర్వచనాన్ని సడలించడం ద్వారా గిరిజన తెగల ఆదివాసీలపై పడే ప్రభావాన్ని గురించి ఎక్కడ చర్చించలేదు. గిరిజన తెగల ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతిపాదనలు ఏమీ లేవని 2006లో అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి నూతన ప్రతిపాదనలు ఉపయోగపడతాయి. అడవిలో లభించే 42 రకాల ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు, ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల జీవనాన్ని ఛిద్రం చేసేందుకు ఈ ప్రతిపాదనలు పనికొచ్చే విధంగా అటవీ చట్టాన్ని సవరించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రయత్నాలు పాలకవర్గాలకు అనుకూలురైన కార్పొరేటు పెత్తందార్ల జేబులు నింపడానికి మాత్రమే.

తినడానికి తిండి గింజల కోసం, తాతముత్తాతల కాలం నుండి అడవిని నమ్ముకొని, అడవిని కాపాడుతూ, అడవియే జీవనాధారంగా ప్రకృతి ఒడిలో నివసిస్తున్న కల్లకపటమెరుగని, కల్మషం లేని మట్టి మనుషులు ఆహారం కోసం పోడు భూములను సాగు చేస్తుంటే వారిపై అనేక రకాల కేసులు బనాయించి ఆడా మగా అనే తేడా లేకుండా జైల్లో పెట్టి నానా చిత్రహింసలకు గురి చేస్తూ వారి జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. ఆ భూములలో పండించిన పంటలు చేతికందే వాటిని కూడా నాశనం చేస్తూ వారి జీవన మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందించాల్సి ఉండగా, ఆ విషయాలను పక్కన పెట్టి అడవులను పెంచే కార్యక్రమం పేరిట విస్తారంగా అడవులు ఉన్నచోటనే హరితహారం కార్యక్రమంతో 30, 40 ఏండ్ల నుండి సాగుచేస్తున్న, గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆదివాసి రైతుల కంటిమీద కునుకు లేకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తుండటం కళ్ళముందు కదలాడుతున్న దృశ్యం.. అటువంటి ఆదివాసి రైతులకు చేయూతనిచ్చి, చట్టప్రకారం వారికి హక్కు పత్రాలను అందించి కనీస మౌలిక సదుపాయాలను, ఉపాధిని కల్పించడంలో కృషి చేయాల్సిన పాలకవర్గాలు, ఆ సామాజిక బాధ్యతను విస్మరించి వేలకోట్ల రూపాయలు కార్పొరేటు దారులకు సంపాదించి పెడుతూ, వారి సంక్షేమం కోసం, శ్రేయస్సుకోసం, ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన నిలబెట్టడానికి చట్టాలను సైతం సవరించ పూనుకోవడం శోచనీయమైన విషయం.

తినడానికి తిండి లేని వారికోసం చట్టాలను అమలు చేయకపోగా, బడా పారిశ్రామికవేత్తల కోసం చట్టాలను సవరించాలని కోవడం ఏ సహజ న్యాయ సూత్రమొ… వారికే తెలియాలి. చట్టాలు ఉన్నవారికి చుట్టాలు అవుతున్నాయి, లేని వారిని బాధితులను నేరస్తులుగా మార్చేస్తున్నాయి, ఇంతటి వివక్షత ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధం. కొరోనా మహమ్మారి విజృంభణ కాలంలో సామాన్యులకు వ్యతిరేకమైన చట్టాలు నిర్ణయాలు అనేకం జరిగాయి. అందులో భాగంగానే అటవీ పరిరక్షణ చట్టం 1980 సవరణలకు కూడా ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఈ ప్రతిపాదనలను కేబినెట్‌ ‌లో చర్చించి పార్లమెంట్‌ ‌ముందుకు తీసుకెళ్లి చట్టానికి మరో సవరణ చేయాలని ఉబలాటం లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ సవరణలను అడ్డు పెట్టుకొని క్రమంగా అటవీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారని, మామూలు ప్రాజెక్టులను కూడా మినహాయింపు ఉన్న ప్రాజెక్టులు గా చూపి అడవుల్ని కొట్టివేసి తమకు అనుకూలంగా మలచుకుంటారు అని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా పటిష్టమైన నిబంధనలు పొందుపరిచి, అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఆదివాసీల జీవనానికి, అభివృద్ధికి తోడ్పడే విధంగా ఏలికలు సత్వర చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిద్దాం…..


– తండ సదానందం, టి పి టి ఎఫ్‌ ‌జిల్లా ఉపాధ్యక్షుడు
మహబూబాబాద్‌

Leave a Reply