Take a fresh look at your lifestyle.

నిమ్జ్ ‌పేరుతో…. బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి: ప్రొ.కోదండరామ్‌

రాష్ట్రంలో సెజ్‌ల నిర్మాణం పేరుతో పేదల భూముల సేకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సెజ్‌ల పేరుతో ప్రభుత్వం రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఎం.ఆశప్ప, శ్రీశైల్‌రెడ్డి, రవితో కలసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రొ.కోదండరామ్‌ ‌మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌ ‌ఝరాసంగం మండలాల పరిధిలోని 17 గ్రామాలు, 5 తండాల నుంచి 12,635 ఎకరాలను నిమ్జ్ ‌నెలకొల్పాలనే పేరుతో సేకరించి అన్ని రకాల చట్టాలను, సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కుతున్నదని ఆరోపించారు.

సంవత్సరానికి రెండు పంటలు పండే ఈ భూముల్లో చెరుకు, అల్లం, ఆలుగడ్డ, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటి పంటలు పంగుతాయనీ, ఇక్కడ పండించే కూరగాయలు బీదర్‌, ‌జహీరాబాద్‌ ‌పట్టణాలకు కూడా సరఫరా అవుతాయని తెలిపారు. ప్రభుత్వం పోలీస్‌ ‌పికెట్‌ ‌పెట్టి దాదాపు 4 వేలకు పైగా ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా నిర్బంధించిందని ఆరోపించారు. ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడటానికి పారిశుధ్య కార్మికులు, గ్రామ కార్యదర్శులను స్థానిక టీఆర్‌ఎస్‌ ‌నాయకులు తరలించారనీ, ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామాలు, తండాల నుంచి దాదాపు 30 తీర్మానాలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్నారు.

బహిరంగ విచారణను అప్రజాస్వామికంగా తూతూ మంత్రంగా జరిపారని దుయ్యబట్టారు. నిమ్జ్ ‌పేరుతో ప్రభుత్వం సేకరిస్తున్న భూసేకరణ కారణంగా హైదరాబాద్‌ ‌నగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యకారకంగా తయారవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరు ఈ వాస్తవాలను ఢిల్లీలోని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా జరుపుతున్న భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదనీ, దీనిని వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply