Take a fresh look at your lifestyle.

ఎవరి ప్రయోజనాల కోసం ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు ?

‘‘‌గతంలో తరగతుల వారి భాషా గణితాలలో కనీససామర్థ్యాలు సాధించే లక్ష్యంతో అమలు చేసిన పలుకార్యక్రమాల కన్నా ఆచరణ భిన్నంగా వుందని దీని వెనుక ప్రభుత్వం  సాధించాలనుకుంటున్న అంతర్గత లక్ష్యాలు వేరే దాగున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎన్‌.‌జీ.వో.ల పేరిట ప్రభుత్వ విద్యారంగ పర్యవేక్షణతో ప్రారంభమై ప్రత్యక్ష కార్యాచరణ వరకూ జాతీయ భావజాలం ముసుగులో ‘‘కాషాయ భావజాలం’’ ప్రవేశించే అవకాశాలున్నాయని  ప్రజాస్వామ్య,ప్రగతిశీల భావజాలం గల విద్యార్థి,ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.’’

విద్యా సామర్థ్యాలు విద్యార్థుల అభివృద్ధికా!
సర్కార్‌ ‌లక్ష్యాల సాధనకా!

జాతీయ విద్యావిధానం 2020 నిర్ధేశన లో భాగంగా ఆగస్ట్ 16 ‌నుండి ప్రాథమిక విద్యారంగంలో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఎఫ్‌.ఎల్‌.ఎన్‌.ఆచరణ తీరుపై  పై మన రాష్ట్రంలో విద్యారంగ మేధావులు, క్షేత్ర స్థాయిలో పని చేసే  ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఫిలాంతఫరిస్ట్ ‌ల పేరిట ప్రయివేట్‌ ‌వ్యక్తులను ప్రాథమిక విద్యా బోధనభ్యసనలో భాగం చేయాలనే అంతర్గత లక్ష్యాలు తోనే ఈ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ఆచరణ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చిందని భావించాలి. అమలులో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం గత ఐదేళ్ళ కాలంలో అనేక రకాల విద్యారంగ ప్రయోగాలు చేసింది.ఏ కార్యక్రమాని కైనా అమలులో కనీసం ఒక మూడు నాలుగేళ్ళ కాలపరిమితి వుంటే అమలు తీరు ఫలితాలను సమీక్షిం చుకునే అవకాశముంటుంది. ఇప్పటి వరకూ అమలు చేసిన పలు విద్యారంగ ప్రయోగాల ఫలితాలను కనీస హేతుబద్ధంగానైనా సమీక్షించుకోకుండా ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ‌మరో కొత్త ప్రయోగానికి సిద్ధం కావటం ఉపాధ్యాయులను,విద్యార్థులను గందరగోళంలో కి నెట్టి వేయడమే అవుతుంది. ఏ కార్యక్రమంమైనా పిల్ల వాడిలో సంబంధిత తరగతి విషయాల్లో కనీసం సామర్ధ్యాలు పెంపొందించే లక్ష్యాలే అయినపుడు అమలు చేసిన పలు కార్యక్రమాలు సమీక్ష ఫలితాలు తెలపాల్సిన అవసరం వుంది. కార్యక్రమాల విధాన రూపకల్పనలో వైఫల్యాలు వున్నాయా!? వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న ఉపాధ్యాయులు వైఫల్యాలు వున్నాయా!? అనే సమీక్ష అవసరమనేది అధికారులు విస్మరించడం శోచనీయం! సమీక్ష చేసినట్లయితే ఆ ఫలితాలను  ప్రకటించాల్సిన అవసరం వుంది. ఆర్ధిక అసమానతలు ఫలితంగా పలు రకాల మేనేజ్‌ ‌మెంట్ల పాఠశాలల్లో చేరిన పిల్లలు మినహాయించి బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వం పాఠశాలల్లో నమోదు అవుతారనే ది అంగీకరించాలి.ఆ పిల్లలపై కుటుంబ ,ఆర్ధిక, సామాజిక అంశాల ప్రభావాల్ని కాదనలేము.

 

ఈ నేపధ్యంలో పిల్లలు హాజరు శాతం ఆందోళనకరంగా వుంటుందనేది తెలిసిందే! అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు ఆయా విద్యార్థులలో సామర్థ్యాలు సాధింపచేసేందుకు బోధనభ్యసన కార్యక్రమాలు నిర్వహించటం సవాల్‌ ‌తో కూడు కున్నదే అనేదిఅంగీకరించాలి. ఇప్పటికే విద్యార్థికి, పాఠశాలకు మధ్య దూరం పెంచేందుకు, ప్రభుత్వ బడి పట్ల సమాజంలో చులకన భావం కలుగచేసేందుకు  ప్రభుత్వ విద్యా విధానాలు దోహదప డుతుండగా ఈ  ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ‌విధానం అమలు అందుకు మరింత ఊతమవుతున్నది. ప్రభుత్వ విద్యారంగంలో తరగతి గది బోధ నాభ్యసన ప్రక్రియల పరిశీలనకు ఎన్‌.‌జీ.వో. లో పేరిట ప్రయివేట్‌ ‌వ్యక్తులను నియుక్తులను చేసే ప్రయత్నమనేది విద్యను ప్రయివేటీకరించే దిశలో ఇది’’తొలిమెట్టు’’అని భావిం చాలి.అనేక విద్యారంగ కమీషన్ల నివేదికలను ఆచరణలో బుట్టదాఖలు చేసిన కేంద్రప్రభుత్వం తన నూతన విద్యా విధానం 2020 లో అంతర్గతంగా పేర్కొన్న లక్ష్యాల సాధన వైపు చాప కింద నీరులా ఈ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ‌దారి చూపుతున్నది.

మరోవైపు విద్యారంగాన్ని అధోపాతాళానికి తొక్కేసి, ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేసే అనేక అవగాహనారాహిత్య చర్యలకు పాల్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు పేరిట ఉపాధ్యాయులపై తీవ్ర పని ఒత్తిడి పెంచుతుంది. ఈ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు పర్యవేక్షణ కోసం తాజాగా ‘‘టాస్క్ ‌ఫోర్స్ ‘‘‌టీం లను ఏర్పాటును ప్రకటించి, ఉపాధ్యాయ లోకం నుండి పెల్లుబుకిన నిరసనలతో తాజాగా ఉపసంహరించుకుంది. . ఈ విధంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న ఎఫ్‌.ఎల్‌.ఎన్‌.అమలు ఉపాధ్యాయులకు పని వత్తిడి పెంచి, ప్రాథమిక స్థాయి బోధించే ఉపాధ్యాయులకు తలకు మించిన భారమైంది.

ఏమిటి ఈ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌.?
‌దేశవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో ఐదుకోట్ల మంది విద్యార్థులకు భాషా,గణితాలలో కనీస సామర్థ్యాలు లేవని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి నుండి మూడవ తరగతి విద్యార్థుల లో వారి వారి తరగతి భాషా,గణితాలలో కనీస సామర్థ్యాలు పెంపొందించే జాతీయ లక్ష్యంతో ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ‌కార్యక్రమం అమలు చేస్తుంది. ‘‘డెవలపింగ్‌ ‌ఫౌండేషన్స్ ‌లిటరసీ అండ్‌ ‌న్యూమరసీ స్కిల్స్’’ (ఎఫ్‌.ఎల్‌.ఎన్‌) ‌ను ‘‘నిపుణ భారత్‌’’ ‌లో భాగంగా అమలు చేయపూనుకున్నది.ఒకటి నుండి మూడవ తరగతి విద్యార్థులు ‘‘చదవటం నుండి నేర్చుకుంటా’’రని,మూడు నుండి పై తరగతుల విద్యార్థులు ‘‘ నేర్చుకోవటం ద్వారా చదువుతార’’ని,మూడు నుండి తొమ్మిది వయసు గల విద్యార్థుల కోసం ఈ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలుకు పిలుపునిచ్చింది.వీరిలో అభ్యసన అవసరాలు గుర్తించటం,అభ్యసన అంతరాలు  గుర్తించటం కోసం స్థానిక పరిస్థితులకు,దేశ భిన్నత్వాలకు తగినట్టుగా ఈ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. 2026-2027 సంవత్సరాల లోగా ఈ ఐదు కోట్ల మంది విద్యార్థులకు వారి  తరగతుల భాషా గణితాలలో కనీస సామర్థ్యాలు సాధింప చేసే జాతీయ లక్ష్య సాధన కోసం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నది. ఇందులో ఐదంచెల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. జాతీయ,రాష్ట్ర,జిల్లా,బ్లాక్‌,‌పాఠశాల స్థాయి కమిటీల ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమం లో  ఉపరితలంగా ఈ విద్యా లక్ష్యాలు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఈ కార్యక్రమం అంతర్గతంగా ప్రయివేట్‌ ‌వ్యక్తులకు ప్రభుత్వ పాఠశాలలో తరగతి బోధనభ్యసనల పర్యవేక్షణలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించటానికి ఒక ప్రయత్నంగా భావించాలి.

‘‘టాస్క్ ‌ఫోర్స్’’ ‌ప్రయోగం తాత్కాలికంగా వెనక్కి వెళ్ళి వచ్చునేమో కానీ, మరో రూపంలో దాని లక్ష్యాల సాధనకు తప్పకుండా రూపం మార్చుకొని రాదని అశించలేము.ఈ అంతర్గత లక్ష్యాలు మేరకు రూపొందించబడిన విద్యా కార్యక్రమాల పై  మొదట రాష్ట్రాల్లో దాని అమలు, ఆచరణ పర్యవేక్షించే అధికారుల పై ఎంతో వత్తిళ్లు వుంటున్నాయనేది గమనార్హం. జిల్లా కలెక్టర్‌, ‌పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, సంచాలకులు, జిల్లా,మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ‌ప్రధానోపాధ్యాయులు నోడల్‌ అధికారులు ఇంత మంది పర్యవేక్షణలో తలమునకలయ్యేలా అమలయిన కార్యక్రమాలు గతంలో ఏమైనా వున్నాయా!? పర్యవేక్షణ లో బడి లేదా ఉపాధ్యాయులు వైఫల్యాలు సంభవించిన సందర్భంలో సదరు ఉపాధ్యాయులపై అధికారులు ప్రవర్తనా తీరు తీవ్ర ఆక్షేపణీయంగా వుంటున్నది, ఈ విషయమై పాఠశాల సంచాలకులు ప్రత్యేకంగా వర్చువల్‌  ‌మీటింగ్‌ ‌నిర్వహించి పర్యవేక్షకుల ప్రవర్తనా తీరుపై సూచనలు చేయటం గమనార్హం.ఈ నేపధ్యంలో ఈ కార్యక్రమం అమలు పై జరుగుతున్న పర్యవేక్షణ పలు అనుమానాలకు తావిస్తున్నది. గతంలో తరగతుల వారి భాషా గణితాలలో కనీససామర్థ్యాలు సాధించే లక్ష్యంతో అమలు చేసిన పలుకార్యక్రమాల కన్నా ఆచరణ భిన్నంగా వుందని దీని వెనుక ప్రభుత్వం  సాధించాలనుకుంటున్న అంతర్గత లక్ష్యాలు వేరే దాగున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎన్‌.‌జీ.వో.ల పేరిట ప్రభుత్వ విద్యారంగ పర్యవేక్షణతో ప్రారంభమై ప్రత్యక్ష కార్యాచరణ వరకూ జాతీయ భావజాలం ముసుగులో ‘‘కాషాయ భావజాలం’’ ప్రవేశించే అవకాశాలున్నాయని  ప్రజాస్వామ్య,ప్రగతిశీల భావ జాలం గల విద్యార్థి,ఉపాధ్యాయులు ఆందోళన చెందు తున్నారు.ప్రాథమిక విద్యలో ఎన్‌.‌జి.వో.లు, ప్రయివేట్‌ ‌వ్యక్తుల పేరిట కాషాయ దళాల ప్రవేశం కల్పించేందుకు జాతీయ విద్యావిధానం 2020 దోహదపడుతుందని ప్రజాస్వామిక వాదులు అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌.ఎల్‌.ఎన్‌.అమలులో భాగంగా  ‘‘సంఘం పరివార్‌’’ ‌కార్యకర్తలే  ఎన్‌.‌జి.ఓ.లుగా  ప్రవేశించి ప్రాథమిక స్థాయిపసి మెదళ్ళలో వారి మనుస్మృతి విత్తనాలు చల్లే అవకాశాలను కాదనలేమని ఈ అంతర్గత లక్ష్యాలు మేరకే అమలులో కాఠిన్యం,అనవసర ఖచ్చితత్వం పై అధికారులను వత్తిళ్ళకు గురిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
– అజయ్‌

ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలులో భారమమెవరికి?
రేపటి సంచికలో…

Leave a Reply