Take a fresh look at your lifestyle.

పారదర్శకత కోసం.. ఎల్‌ఐసీని ప్రైవేట్‌పరం చేయడమా..!

“31 ‌మార్చ్ 2019‌లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఎల్‌ఐసి నిధులు సమకూర్చింది. ఇంతే కాకుండా ఎల్‌ఐసి టాక్స్ ‌రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతుంది. ఎల్‌ఐసి ఎంత మాత్రం నష్టాల్లో నడుస్తున్న సంస్థ కాదు. అందుచేత ఎల్‌ఐసి సంస్థను డిజిన్వెస్ట్మెంట్‌ ‌ప్రక్రియ లోకి తీసుకురావటానికి ప్రభుత్వం చెప్పిన వాదన.. పారదర్శకత కోసం ఎల్‌ఐసిని మార్కెట్‌పరం చేస్తున్నామని. ఈ వాదన కూడా పూర్తిగా అవాస్తవం.”

For transparency How to privatize LIC

ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసిని ప్రభుత్వం ఐపిఓ ద్వారా అమ్మకానికి పెట్టిందని పెద్ద ఎత్తున ఎల్‌ఐసి ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసికి సంబంధించి కొన్ని అంశాలు పరిశీలిద్దాం..ముందుగా మనం గమనించాల్సింది ఎల్‌ఐసి పుట్టుకకు కారణాలేంటి..భారత దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే 1944లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అన్న విషయంపై దేశీయ పారిశ్రామిక వేత్తలు సమాలోచనలు చేయటం మొదలుపెట్టారు. ఈ సమాలోచనల పర్యవసానమే బాంబే ప్లాన్‌. ‌బాంబే ప్లాన్‌ ‌రచించినవారు రాజకీయ నాయకులు కాదు. ఆనాటి దేశీయ పారిశ్రామికవేత్తలు అయిన జెఆర్‌డి టాటా, జే డి బిర్లా వంటి కొంత మంది పారిశ్రామికవేత్తలు, మరికొంత మంది ఆర్థికవేత్తలు కలసి స్వతంత్రానికి పూర్వమే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి వ్యూహరచన చేయడం మొదలు పెట్టారు. వీరికి గాంధీజీ అండదండ ఉండేది. స్వయంగా గాంధీజీ బిర్లా నివాసంలో ఉండి స్వతంత్ర పోరాటం చేశారు. ఈ అంశంతో గాంధీజీతో బిర్లాకు ఉన్న సాన్నిహిత్యం మనకు స్పష్టం అవుతుంది. విదేశీ పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకృత పరచటం అన్నది దేశీయ పారిశ్రామికవేత్తలకు నచ్చిన అంశం. అదే సమయంలో అహింసాయుతమైన గాంధేయమార్గమే వీరికి ఇష్టం. అందుచేత వీరు ఎప్పుడు కూడా భగత్‌ ‌సింగ్‌ ‌మార్గాన్ని మెచ్చలేదు. ఇటువంటి ఆలోచనా ధోరణి ఉన్న ఆనాటి భారతీయ పారిశ్రామిక వేత్తలు, 1927లో రష్యా వెళ్లి వచ్చి ఆ ప్రభావంలో ఉన్నా నెహ్రూ ఆలోచనలను ఎప్పటికప్పుడు పక్కన పెడుతూ.. తమదైన బాంబే ప్లాన్‌పై పని చేయటం మొదలు పెట్టారు. ఈ బొంబై ప్లాన్‌లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాజ్యం పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిపారు.

వీరంతా కలిసి ఒక అవగాహనకు వచ్చారు. సెంట్రల్‌ ‌ప్లానింగ్‌ అథారిటీ ఉండాలని, అది ప్రభుత్వం ఆధీనంలో నడవాలి అని ఒక అవగాహనకు వచ్చారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రాజ్యం పాత్ర ప్రముఖంగా ఉండాలని వీరు కోరుకున్నారు. వీరు ఈ విధంగా ఆలోచించటానికి కారణం స్టీల్‌, ‌బొగ్గు, ఇనుము, సిమెంట్‌ ‌కర్మాగారాలు పెట్టడానికి కావలసినంత పెట్టుబడి ఆనాటి భారతీయ పారిశ్రామిక వేత్తల దగ్గర లేదు. అందుచేత వీరంతా ప్రభుత్వమే స్వయంగా లార్జ్ ‌స్కేల్‌ ఇం‌డస్ట్రీస్‌ ‌పెట్టాలని ప్రతిపాదించారు. దేశ స్వతంత్రం కోసం భారతీయ పౌరులు స్వతంత్ర సమరంలో ఉండగా..దేశీయ పారిశ్రామికవేత్తలు స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రణాళికలు వేస్తూ..తమ స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో కొనసాగించాలని ఒక అవగాహనకు వచ్చారు. భారతదేశ పారిశ్రామికవేత్తలు ఈ తీరుగా ప్రణాళిక వేస్తున్న సమయం.. రెండవ ప్రపంచ యుద్ధ కాలం. ఇదే సమయంలో భారతదేశానికి స్వతంత్రం రావటం జరిగాయి. భారతదేశంలో లార్జ్ ‌స్కేల్‌ ఇం‌డస్ట్రీస్‌ ఏర్పాటు గురించి చర్చలు జరిగి. ఆ మేరకు భారతదేశంలో పారిశ్రామికీకరణ మొదలు అయ్యింది. భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్న సామ్రాజ్యవాద దేశాలకు కావలసిన ముడి స్టీల్‌, ఐరన్‌, ‌సిమెంట్‌, ‌బొగ్గు సప్లై చేయటం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను మొదలు పెట్టింది. స్వాతంత్ర అనంతరం భారతదేశం మిక్స్‌డ్‌ ఎకానమీ పాలసీ ఆధారంగా పని చేయాలి అని నిర్ణయించుకున్న నేపథ్యంలో అప్పటికి ఉన్న ప్రైవేటు బీమా సంస్థలు ప్రభుత్వానికి కావలసిన పెట్టుబడి అందించే పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రయివేటు బీమా సంస్థల మోసాలకు బలి అయిన ప్రజలు వీరిని నమ్మే పరిస్థితి లేదు. దీనితో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న భారీ పరిశ్రమలకు కావలసిన పెట్టుబడిని సమీకరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. దీనితో దేశ తొలి ప్రధాని జవహర్లాల్‌ ‌నెహ్రూ సెప్టెంబర్‌ 1956‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే లైఫ్‌ ఇన్సూరెన్స్ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా సంస్థని ఏర్పాటు చేశారు.

ఎల్‌ఐసిని ఏర్పాటు చేసినప్పుడు జవహర్లాల్‌ ‌నెహ్రూ ఆలోచన ఏమంటే..

భారత దేశ ప్రజలు దాచుకునే సొమ్ముతో దేశంలో భారీ పరిశ్రమలు పెట్టాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే డ్యాములు కట్టాలి, ఇతర పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ‌ప్రాజెక్టులు చేపట్టాలి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్ళాలి. దీనికోసం ప్రజల నుంచే నిధులు సేకరించాలి. బ్యాంకులతో పాటు ఎల్‌ఐసి ద్వారా ప్రజలు తమ సేవింగ్స్‌తో, దేశ అభివృద్ధికి సహకరిస్తున్నందున, దేశ ప్రజలు దాచుకున్న సొమ్ముకు సామాజిక రక్షణ ఎల్‌ఐసి ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రధానమైన లక్ష్యంతో ఎల్‌ఐసి పనిచేస్తుందని దేశ తొలి ప్రధాని ప్రకటించారు. ఈ ఆలోచన మేరకు ఎల్‌ఐసిని దేశ మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేలాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి, దేశంలోనే బలమైన బీమా సంస్థగా ఎల్‌ఐసిని ఏళ్లుగా భారత ప్రభుత్వం ప్రభుత్వం అభివృద్ధి చేయగలిగింది. స్వాతంత్రం వచ్చిన తరువాత సుమారు నలభై నాలుగు ఏళ్ళు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థగానే మన దేశ ఆర్థిక వ్యవస్థ కొనసాగింది. 1991లో చంద్రశేఖర్‌ ‌ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలబడింది. దీనికి ప్రధాన కారణం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో బొంబాయి ప్లాన్‌ ‌వేసిన వారు, బాగా అభివృద్ధి చెందితే.. అట్టడుగు భారతీయుల ఆర్థిక స్థితిగతులలో పెద్ద మార్పు రాలేదు. అప్పటికే పైచేయి సాధించిన పారిశ్రామికవేత్తలు భారత దేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇంకెంత మాత్రం పనికి రాదని ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. స్వతంత్రం వచ్చిన దగ్గరనుంచి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల పలుకుబడి కొనసాగుతున్న నేపథ్యంలో 1991లో కూడా వీరిదే పైచేయి అయ్యింది. తత్ఫలితంగా భారతదేశం ప్రైవేటైజేషన్‌ ‌వైపు మొగ్గుచూపే ఆర్థిక వ్యవస్థను అలవర్చుకున్నది. ఈ ప్రయాణం 30 ఏళ్లుగా కొనసాగిన నేపథ్యంలో దేశీయ పారిశ్రామిక వేత్తలు బాగా బలపడి, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలుగా కూడా అవతరించారు. ప్రస్తుతం వీరి కోరిక రాజ్యం కేవలం సైనిక, పోలీస్‌, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌విభాగాలను చూసే వ్యవస్థగా ఉంటే సరిపోతుంది. భారీ పరిశ్రమలు, వ్యవసాయం ఇవన్నీ కూడా కార్పొరేషన్స్‌కి అప్పగించాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రస్తుత సమయంలో నష్టాలలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలనే కాదు, లాభాలలో ఉన్నా ఎల్‌ఐసి వంటి కామధేను సంస్థలను కూడా భారత ప్రభుత్వం ప్రైవేట్‌ ‌పరం చేయాలని చెబుతున్నారు. అందుకే 64 ఏళ్ల ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసిని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

ఎల్‌ఐసి ఎంత బలమైన సంస్థ అనే విషయం తెలిపే కొన్ని ఆసక్తికరమైన అంశాలు పరిశీలిద్దాం..

ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న సంస్థను అమ్మాలంటే ప్రభుత్వం చెప్పే వాదన.. నష్టాలలో ఉన్న సంస్థను ప్రభుత్వం నడపలేకపోతున్నదని. అందుకే నష్టంలో వున్న సంస్థను ప్రభుత్వం అమ్మేయదలచుకుంటున్నదని. కానీ ఎల్‌ఐసి విషయంలో ప్రభుత్వం ఈ మాట అనడం లేదు. ఎందుకంటే గత ఏడాది ప్రభుత్వం ఎల్‌ఐసీలో వంద కోట్లు పెట్టుబడి పెడితే, రెండు వేల ఆరు వందల పదకొండు కోట్ల మేర డివిడెండ్లు రూపంలో ఎల్‌ఐసి ప్రభుత్వానికి ఆదాయంగా సమకూర్చింది. 31 మార్చ్ 2019‌లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఎల్‌ఐసి నిధులు సమకూర్చింది. ఇంతే కాకుండా ఎల్‌ఐసి టాక్స్ ‌రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతుంది. ఎల్‌ఐసి ఎంత మాత్రం నష్టాల్లో నడుస్తున్న సంస్థ కాదు. అందుచేత ఎల్‌ఐసి సంస్థను డిజిన్వెస్ట్మెంట్‌ ‌ప్రక్రియ లోకి తీసుకురావటానికి ప్రభుత్వం చెప్పిన వాదన.. పారదర్శకత కోసం ఎల్‌ఐసిని మార్కెట్‌పరం చేస్తున్నామని. ఈ వాదన కూడా పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎల్‌ఐసికి సంబంధించిన అకౌంట్లు ఐఆర్డిఐకి వెళతాయి. అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీ చేయవచ్చు. ఎల్‌ఐసికి సంబంధించి పాలసీ మేకింగ్‌ ‌నిర్ణయాలు కేంద్రం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఎల్‌ఐసి అకౌంట్లు పార్లమెంటు ఫ్లోర్‌ ‌మీదకు కూడా వెళతాయి. అంతేకాకుండా ఎల్‌ఐసి అకౌంట్‌ ‌వివరాలు అన్నీ కూడా ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లో మనకు దొరుకుతాయి. ఇది సరిపోదు అనుకుంటే.. ప్రభుత్వ రంగ సంస్థ కనుక ప్రభుత్వమే స్వయంగా న్యూస్‌ ‌పేపర్లలో ఎల్‌ఐసీకి సంబంధించిన వివరాలు ప్రకటించవచ్చు. ఖాతాదారుల పొదుపు చేసుకుంటున్న సొమ్మును ఎల్‌ఐసి ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెడుతున్నది, ప్రభుత్వం స్వయంగా ఖాతాదారులకు తెలిసే లాగా ప్రకటించవచ్చు. ప్రభుత్వం అలాంటి చర్యలు చేయకుండా ప్రైవేటు పరం చేస్తేనే పారదర్శకత వస్తుందని చేస్తున్న వాదనలో పస లేదు. ఎల్‌ఐసి మొదలైనప్పుడు కేవలం ఐదు కోట్లతో మొదలయ్యింది. నేడు ఇది 40 కోట్ల మంది ప్రజలు ఎల్‌ఐసి పాలసీ ఖాతాదారులుగా ఉన్న సంస్థగా ఎదిగింది. అమెరికా జనసంఖ్య 31 కోట్లు..అంటే అమెరికా జనాభా కంటే అధిక ప్రజలు ఖాతాదారులుగా ఎల్‌ఐసి సంస్థ వెంట వున్నారు. దేశంలో 24 బీమా కంపెనీలు ఉండగా, ఎల్‌ఐసి సంస్థ 76% మార్కెట్‌ ‌వాటా కలిగి ఉంది. గమనించాల్సిన విషయం ఏమంటే ఐఆర్డిఐ సంపూర్ణ మద్దతు ప్రైవేటు బీమా సంస్థలకు ఉన్నా కూడా ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన ఎల్‌ఐసినే ప్రజలు నమ్మారు. అందుకే భీమారంగంలో ఎల్‌ఐసిని ప్రజలు రారాజు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎల్‌ఐసిని ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయం.. ఖాతాదారుల నమ్మకంతో చెలగాటం ఆడటంమే అవుతుంది.

Aruna New Delhi
అరుణ, న్యూఢిల్లీ

Leave a Reply