రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్
ఇంకా..జల దిగ్భంధంలోనే ఎల్బినగర్
ఒక్కప్రక్క వరద నీరు ప్రవాహం, మరోప్రక్క ఆకలిచావులు. ఇంకోప్రక్క వరద కారణంగా ఎంతో మంది చనిపోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాంహౌస్‌లో విలాసవంతమైన జీవనం కొనసాగిస్తూ రాక్షసపాలన కొనసాగించడం దారుణం, అమానుషం అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు నీటిలో కొట్టుకుపోయి ఎందరో ప్రాణాలు కోల్పోగా, ఎంతో ఆస్తినటష్టం జరిగినా వారికి తగిన సహాయం చేయాల్సిన సిఎం ఫాంహౌస్‌లో ఎంజాయ్ చేయడం శోచనీయమన్నారు. శుక్రవారం బైరామల్‌గూడ, బంజారకాలని, తదితర ప్రాంతాలను బండి సంజయ్ సందర్శించి పరిస్థితినిన సమీక్షించి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిసి కార్మికులు కూడా వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసిన సందర్భంలో కూడా సిఎం సందర్శించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్ఆర్ఐ ఇచ్చిన ధనాన్ని దర్జాగా భోంచేసిన కెసిఆర్ కుటుంబీకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని బండి సంజయ్ నిశితంగా విమర్శించారు.
వరదనీటిలో చనిపోయిన కుటుంబాలకు తగిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, సర్వస్వం కోల్పోయిన బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బైరామల్‌గూడ సందర్శించిన పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌కు కష్టసుఖాలు చెప్పుకోవాలని అణగారిన, బడుగువర్గాలు ప్రయత్నిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా పోలీసులద్వారా భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్యగా బండి సంజయ్ అభివర్ణించారు. నగరాన్ని డల్లాస్‌గా మార్చుతానని గొప్పలు చెప్పుకునే కెటిఆర్‌పై ఎస్టి, ఎస్సి కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. దళితులపై దాడులు చేయడం సిగ్గుచేటని బిజెపి ఈ విషయమై తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. వరదనీటిలో కార్టు కొట్టుకుపోయినట్లు జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ గుర్తు కార్లు కూడా కొట్టుకుపోవడం ఖాయమని, జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. రాష్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంవల్లే ఇంత దారుణం జరిగిందని, వరదలవల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందని దుయ్యబట్టారు.
ప్రజలకు ఎదో మేలు జరుగుతుందని ప్రజలు టిఆర్ఎస్కు అధికారం ఇస్తే నేడు ప్రజల జీవితాలను ఛిద్రంచేస్తూ అందరి జీవితాలలో చెలగాటం ఆడుతున్న టిఆర్ఎస్ ఆ వరదలో సముద్రంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర వనరులను దోచుకుంటున్న కెసిఆర్ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ మేల్కొని ఫాంహౌస్ నుండి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్భన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్బినగర్ బిజెపి కన్వీనర్ వంగ మధుసూదన్‌రెడ్డి, నాయకులు పోచంపల్లి గిరిధర్, సామ ప్రభాకర్‌రెడ్డి, బండారి భాస్కర్, సత్యనారాయణ, ఆకుల రమేష్‌గౌడ్, శేఖర్‌గౌడ్, కళ్ళెం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.