- కొరోనా పేషెంట్లను దోచుకుంటున్నాయి
- రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేసిన టిఆర్ఎస్ ఎంపి కెకె
కొరోనా వేళ ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయిందని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మండిపడ్డారు. ప్రైవేట్ హాస్పిటళ్లు దోపిడీ కేంద్రాలుగా మారాయని రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రస్తావించారు. అంటు వ్యాధుల సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కేశవరావు మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్ ఓ రోగి నుంచి 90 లక్షల బిల్లును చార్జ్ చేసిందన్నారు. అలాంటి హాస్పిటళ్ల నుంచి రక్షణ కల్పించాలన్నారు. కోవిడ్ ఉధృతి వేళ తాను ఓ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ శవాలు గుట్టలుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలన్నారు. కేంద్రమైనా, లేక రాష్ట్రమైనా కేర్ తీసుకునే విధంగా చట్టాన్ని తయారు చేయాలన్నారు.
లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వలస వెళ్తుంటే రు వారిని అడ్డుకున్నారని, రైళ్లను ఆపేశారని,ఇంటర్ స్టేట్ బస్సులను నడపకుండా చేశారన్నారు. ఇలాంటి సమయాల్లో రాష్ట్రాల ప్రమేయంతో నిర్ణయాలు తీసుకోవాలని, ఆయా రాష్ట్రాలకు సహకరించాలని కేశవరావు కేంద్రానికి సూచించారు. అంతకముందు కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అంటువ్యాధుల సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 1897లో మాండవీలో ప్లేగు రావడంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టాన్ని రూపొందించిందన్నారు. కొరోనా వైరస్ కొత్త వైరస్ అని, దాని గురించి పూర్తిగా తెలియకపోవడంతో మొదట్లో హెల్త్‌కేర్ వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.