Take a fresh look at your lifestyle.

చంటోడి కోసం

ఆకాశంలో
సగమన్న సంగతి మరచి
వాడు నిప్పుతో
చెలగాటమాడుతుండు
మానవతను మరచి
అవని మానంతో
వాడు ఆటలాడుతుండు
గురిపెట్టి పేల్చిన తూటాలు
సగం ఆకాశాన్ని
వివస్త్రను చేసినయి
ఇప్పుడు అమ్మ
బిడ్డల మాన ప్రాణాలను
కాపాడటం కోసం
చంటి దాన్ని
మింటి పైకి విసిరింది
అస్తమిస్తున్న సూర్యుడు
అందుకున్నాడో లేదో
చల్లని వెన్నెల ప్రసరించే
చంద్రుడు చేరదీసిండో లేదో
చంకలో లేని చంటోడి కోసం
అమ్మ చనుబాలు
ఆగని కన్నీటి ప్రవాహమై
సముద్రగర్భంలో
సీమంతం చేసుకుంటున్నయి
ఓ అల్లాహ్‌!
ఇక నీ నమాజ్‌ ‌నీవే చేసుకో
మా మానాన మమ్మల్ని వదిలేయ్‌
‌నీవిక తప్పుకో
నీముసుగును తొలగించి
మానవారణ్యంలో
ఆటవిక మానవ మృగాలను
ఇక మేమే వేటాడుతాం

(ఆఫ్ఘన్‌ ‌మహిళలు తమ చంటిపిల్లలను కాపాడుకునేందుకు వారిని కాబూల్‌ ‌విమానాశ్రయంలోకి విసిరేసిన సంఘటనకు స్పందన)

– కట్టెకోల చిన  నరసయ్య
9951260316

Leave a Reply