Take a fresh look at your lifestyle.

ఆహారమే ఆయుధం – వ్యవసాయమే మార్గం

‘గత అర్థశతాబ్ధ కాలంగా వ్యవసాయ రంగంలో అభివృద్థి పేరుతో జరిగిన విధ్వంసం అంతా ఇంతా  కాదు ..  ఇప్పుడు కేవలం ముఖానికి మాస్క్ వేసుకుంటే సరిపోదు. లోపలి నుంచి ఒక రక్షణ కవచం కావాలి. అదే రోగనిరోధక శక్తి. ఈ హైబ్రీడ్ పంట నుంచి వచ్చే ఆహారం ద్వారా అది లభించేది నామమత్రమే. నేను  సేంద్రీయ విధానాలలో  పండించే పంట ద్వారా వచ్చిన బియ్యం నుంచి కూడా మొలకలు రావడాన్ని చూడండి .. ఇలా మొలకెత్తే సామర్థ్యం ఉన్న ధాన్యం తిన్న తర్వాత మనిషిలోని జీవం ఎలా ఉంటుందో ఆలోచించండి ..’                                 – విజయారామ్  

దాదాపు ప్రపంచం అంతా ఒకేసారి యుధ్దంలో ఉంది. ఎవరో సినీ కవి చెప్పినట్టు కంటి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుధ్దం సాగుతోంది. ప్రతి మనిషి సైనికుడే.  ఇదెంత కాలమో తెలియదు. కాలం కరోనాకు ముందు, కరోనా తర్వాతగా రూపు సంతరించుకుంటోంది. ఇక ముందులా మన జీవితాలు నడవవేమో అనే నిజం ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఈ యుధ్దంలో గెలుపు సాధించేందుకు కావల్సింది మానసిక శారీరక దృఢత్వం కలిగిన మనుషులు. అందుకు అనుగుణంగా మన జీవిన విధానం, ఆహార విహారాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.

ఆహార విహారాల్లో మొదటిది ఆహారం. ఆహారోత్పత్తిలో తీసుకురావల్సిన మార్పుల గురించి, ఆహార ఉత్పత్తి రంగమైన వ్యవసాయంలో ఎలాంటి మార్పులు అవసరమో చర్చించాల్సిన సమయం వచ్చేసింది. ఈ చర్చకు తెరలేపారు విజయారామ్. విజయారామ్ దాదాపు పది సంవత్సరాలుగా సేంద్రీయ విధానాలలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్న అభ్యుదయ రైతు. ఆయన ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 7వేల 5 వందల ఎకరాలలో చాలా మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఆయనతో జరిపిన చర్చ సారాంశం.

Food is the weapon - farming is the way1

బలమైన వ్యక్తులదే భవిష్యత్తు:

సమాజం రెండుగా విడిపోబోతోంది ప్రస్తుతం అంటున్నారు విజయారామ్. కొంత మంది డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే మరికొంత మంది ఆరోగ్యమే మహా భాగ్యం అని బతికేస్తారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిరోధకకత కలిగి బలంగా ఎదిగిన వ్యక్తులే కోవిడ్ 19 ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అని చెబుతోంది. కాబట్టి నిరోకథకత సాధించడం అన్నింటికంటే ప్రథామిక లక్ష్యం. నిరోథక శక్తి పెరగాలంటే కచ్చితంగా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం. జీవ శక్తి తొణికిసలాడే ఆహారం తీసుకున్న వారిలోనే అలాంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అటువంటి పోషకాలు అందించే ఆహారోత్పత్తి చాలా ముఖ్యమైన విషయం. అలా జరిగినపుడే అందరకీ పౌష్టికాహారం అందుబాటులో ఉంటుంది. అప్పుడే సమాజంలో బలమైన వ్యక్తులు రూపొందుతారు. ఆ దిశగా వ్యవసాయం సాగాలనేది విజయరామ్ ఆలోచన. రైతులు, ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంగా సాగితే ఇది సాధించడం భారతదేశానికి సులభమే అంటారు ఆయన. ఇప్పుడు మనం కూలీలను ఉత్తర భారత దేశం నుంచి పిలిపించుకుంటున్నాం. వారిలో ఎక్కువ మంది కేవలం కాయకష్టం చేసేందుకు వచ్చే వారే. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు వారిలో చాలా తక్కువ మంది. మన దగ్గర మనుషులకు కరువుందా? అని ప్రశ్నిస్తారు విజయారామ్. ఒక యాభై కేజీల బస్తా ఎత్తగలిగే సామర్థ్యం ఉన్న బలమైన వ్యక్తులు మనకు కరువైపోయారు. ఎందుకలా జరుగుతోందో ఒకసారి ఆలోచించాలని అంటారు ఆయన.

లోపలి నుంచి కాపాడే రక్షణ:

ప్రపంచమంతా కూడా వ్యాక్సిన్ వచ్చేస్తుంది. కొవిడ్ అంతమవుతుంది అని ఎదురు చూస్తున్నారు. వస్తుందో రాదో తెలియని వ్యాక్సిన్ గురించి సాగుతున్న సమాలోచనలతో పాటు నిరోధకత పెంచుకునే మార్గాలను కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఈ వైరస్ జంతువుల కంటే మనుషుల మీద మాత్రమే ఇంత నిర్ధయగా ఎందుకు ఉంటోంది. కారణం ఒకటే మనషులు క్రమంగా ప్రకృతికి దూరంగా జరిగిపోయారు. విత్తనాలు కూడా సహజమైనవి ఉండడం లేదు. అవికూడా హైబ్రీడ్ విత్తనాలు రూపొందించడం అవే వాడడం వల్ల రోజురోజుకు మనుషులు బలహీన పడుతున్నారు. గత అర్థశతాబ్ధ కాలంగా వ్యవసాయ రంగంలో అభివృద్థి పేరుతో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదని అంటారు విజయారామ్. ఇప్పుడు కేవలం ముఖానికి మాస్క్ వేసుకుంటే సరిపోదు. లోపలి నుంచి ఒక రక్షణ కవచం కావాలి. అదే రోగనిరోధక శక్తి. ఈ హైబ్రీడ్ పంట నుంచి వచ్చే ఆహారం ద్వారా అది లభించేది నామమత్రమే. విజయారామ్ ఆయన పండించే పంట ద్వారా వచ్చిన బియ్యం నుంచి కూడా మొలకలు రావడాన్ని చూపించారు. ఇలా మొలకెత్తే సామర్థ్యం ఉన్న ధాన్యం తిన్న తర్వాత మనిషిలోని జీవం ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు ఆయన.

ప్రస్తుతం అవసరం

ఇంతకు ముందు రైతు ఉత్పత్తి దారుడు. వ్యవసాయ క్షేత్రాలలో ఉత్పత్తి మాత్రమే జరిగేది. ఒక ముప్ఫై నలభై సంవత్సరాల క్రితం కార్పొరేట్ వ్యవస్థ ప్రభావం వ్యవసాయం మీద ఇంత ఉండేది కాదు. అప్పుడు రైతుల ఆత్మహత్యలు కూడా నామ మాత్రంగా ఉండేవి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వాళ్లను కూడా వినియోగదారులుగా మార్చాయి. ఈ పరిస్థితి మారితే తప్ప వ్యవసాయ రంగం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కటం కష్టం అనేది ఆయన వాదన. అంత పంట పండించే రైతు విత్తనం కోసం ఎదురు చూడడం ఏమిటి? పంట వేసిన తర్వాత దాని పోషణకు కూడా తిరిగి అదే దుకాణాల ముందు ఎరువుకని, పురుగు మందుకని నిలబడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింద? అనేది అనేది విజయరామ్ ప్రశ్న. ఇలా హైబ్రీడ్ విత్తనాలు వాడడం వల్ల పంట కాపాడుకోవడం, అధిక ధిగుబడి కోసం రసాయనాలు వాడడంతో కేవలం జీవ శక్తి తక్కువగా ఉన్న ఆహారోత్పత్తి జరగడం మాత్రమే కాదు, భూమిలోని సారం తగ్గిపోతోందని అంటారు. అంతే కాదు హైబ్రీడ్ పంటకు తెగుళ్ల సమస్య కూడా చాలా ఎక్కువ కావడం వల్ల వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. ఖర్చు పెరిగిపోవడం వల్ల వ్యవసాయాన్ని జూదంతో పోల్చడం మొదలుపెట్టారు. అందువల్ల భారతీయ యువత వ్యవసాయం నుంచి పక్కుకు తప్పుకు పోతోందనేది ఆయన అభిప్రాయం. ఉత్పత్తి ఖర్చు తగ్గిస్తే ఎటువంటి ప్రత్యేక ప్రయత్నాలు అవసరం లేకుండానే రైతుల ఆత్మహత్యలు నిరోధించబడుతాయి.

ఓల్డ్ ఈజ్ గోల్డ్

ఇది వరకు రోజుల్లో మనుషులు బలంగా ఉండేవారని చెప్పుకోవడం మనం చూస్తుంటాం. ఎందుకు వాళ్లు బలంగా ఉండేవారు? మనమెందుకు క్రమంగా బలహీన పడ్డాం? అందుకు ఒకేఒక కారణం మనం తీసుకునే ఆహారం. ముఖ్యంగా ప్రధాన ఆహారం అయిన బియ్యం. అన్నం పరబ్రమ్హ స్వరూపం అనే వారు. ఇప్పుడు అన్నం తినకూడదు అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అన్నం అలా ఎందుకు మారింది? కారణం హైబ్రీడ్ సాగు. బియ్యపు నూక నుంచి కూడా మొలకలు వచ్చే సామర్థ్యం ఉన్న నవారా రకం విత్తనం దాదాపు 5వేల సంవత్సరాల పూరాతనమైనది. కానీ ఈ రకం వరి సాగు చేస్తున్న వారేరి? అందుకే సమాజంలో ఇలాంటి దుర్బర పరిస్థితులు నెలకొన్నాయని విజయరామ్ విచారం వ్యక్తం చేశారు.

మన నేల మీద మనకు వేలాది రకాల దేశీయ విత్తనాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ అందుబాటులో లేవు. కొన్ని మాత్రం సేకరించగలిగాము అని చెప్పుకొచ్చారు ఆయన. ఈ దేశీ పంట పండించేందుకు అవసరమయ్యే ఖర్చు చాలా తక్కువ అని చెప్పారు. నీటి వినియోగం కూడా చాలా తక్కువంటారు. కొన్ని రకాల వంగడాలను ఆరుతడి విధానంలో కూడా పండించడం సాధ్యమే అని ఆశ్చర్య పరిచారు. రసాయనాల వడాకం పెరగడం వల్ల కర్చు పెరగడం మాత్రమే కాదు భూమిలో సారాన్ని పెంచే వానపాములు కూడా అంతరించి పోతున్నాయి. పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు మనలేని స్థితికి వచ్చాయి. ఈ దుస్థితి నుంచి నేలను, మానవ జాతిని కాపాడుకోవాల్సిన తరుణం వచ్చేసింది. వచ్చే పంటకు విత్తనాలను కూడా రైతు స్వయంగా నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిలువ చేసుకున్న విత్తనాలు రెండేళ్ల వరకు పనికి వస్తాయి. ఇకనైనా పాలకులు, రైతులు, ప్రజలు ఈ దిశగా ఆలోచించాలని ఆయన అభ్యర్థించారు. ఇలా ఆహార ఉత్పత్తి దగ్గరే పోషక విలువల గురించి ఆలోచించి పంటలు వేసుకోవడం పండించుకోవడం మీద దృష్టి పెట్టడం ద్వారా భావి తరాలను బలంగా తయారు చేసుకునేందుకు మార్గం సుగమమం అవుతుందన్నది విజయారామ్ ఉద్దేశ్యం.
-భైరవి

జీవామృతం

వ్యవసాయం భారత దేశంలో ఒక వృత్తి కాదు. ఇదొక జీవన విధానం. ఇది వరకు రోజుల్లో పాడీ పంట, గొడ్డు గోదా అనే వారు. రైతనే వాడికి కచ్చితంగా పశువులు ఉండాలి. ఆవు, ఎద్దు ఉన్న రైతు ఎప్పటికీ సుభిక్షంగా ఉంటాడు. అభివృద్ధి అంటూ ఎద్దులను పక్కన పెట్టి ట్రాక్టర్ల వాడకం పెరిగింది. ఎద్దు పొలంలో నడవడం వల్ల వాటి గిట్టలు మట్టికణాలను కదుపుతాయి. అదే ట్రాక్టర్ నడిస్తే ఆ నేల కాంక్రీటులా గట్టిపడి సారం చచ్చిపోతుంది. పంట దిగుబడి పెంచేందుకు రసాయన ఎరువులకు బదులుగా ఆవుపేడ వాడడం వల్ల మట్టిలోపలి నుంచి వానపాములు మట్టి నుంచి రంద్రాలు చేసుకుంటూ నేలను గుల్ల బారుస్తూ బయటకి వస్తాయి. దాదాపు 70 రకాల పోషకాలు పంటకు అందుతాయి. అటువంటి పంట తిన్న మనుషులు తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారు.

10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 200 కిలోగ్రాముల బెల్లం, 200 కిలోగ్రాముల శనగపిండి, దోసెడు మట్టికి 200 లీటర్ల నీళ్లు కలిపితే అది ఎరువుగా మారుతుంది. దీన్ని జీవామృతం అంటారు. ఇదే మిశ్రమం నీళ్లు లేకుండా తయారు చేసుకుంటే దాన్ని ఘనామృతం అంటరు. దీన్ని పంట వేసే ముందు ఒకసారి వేసి దున్నుకోవాలి. తర్వాత పంట వేసిన నెలరోజుల తర్వాత ఒకసారి వేసుకోవాలి. పంట వేసుకున్నకా వీలును బట్టి వారంలో ఒకసారి లేదా కనీసం 18 రోజులకు ఒకసారి జీవామృతం వేసుకుంటే సరిపోతుంది. ఇక ఎలాంటి ఎరువు వాడాల్సిన అవసరం ఉండదు.

విత్తనాలు ఇవే

దేశీ విత్తనాల ద్వారా పండించిన పంట నుంచి వచ్చిన ధాన్యంలో పోషకాలు పుష్కలం. వీటిని తీసుకోవడం ద్వారా షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలు దరిచేరవు. ఉన్నవాళ్లు తినడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. ఈ బియ్యంలో దాదాపు 14.3 శాతం వరకు ఫైబర్ ఉంటుంది. బి12, బి6, రాగి, ఇనుము వంటి అనేక పోషకాలు అందుతాయి.

నివారణ్ – నవారా

ఎరుపు రంగులో ఉంటుంది. దీని గురించి వేదాల్లో సైతం ప్రస్తావన ఉంది.

మా పిళ్లై సాంబ

ఇది పురుషుల్లో వీర్యవృద్దిని పెంచుతుంది

పులకార్

నానబెడితేనే దాదాపు 60-80 శాతం ఉడికినట్టు మెత్తబడిపోతుంది. గర్భిణులకు చాలా మంచిది. ఇది తింటే సుఖప్రసవం అవుతుంది.

మైసూర్ మల్లిగ

కర్ణాటకలో ఎక్కువగా పండిస్తున్నారు. పిల్లలకు మంచి బలవర్ధక ఆహారం.

కాలాబత్

వీటిని నల్ల బియ్యం అంటారు. ఈ రకం వరి వంగడం చాలా ప్రత్యేకమైంది. నలభై, యాభై రోజుల వయసున్న పంట ఆకులను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కూడా నయమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆకును శనగపిండిలో ముంచి బజ్జీల మాదిరిగా వేసి క్యాన్సర్ బాధితులకు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు కనిపించాయట.

బహురూపి

ఇది పేరుకు తగ్గట్టుగానే చాలా పోషకాలున్న ఆహారం. దీని గురించి కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద లో కూడా ప్రస్థావించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy