ఖాట్మండ్, జనవరి 16 : నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ ధ్రువీకరించింది. పోఖారకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారలో నిర్వహిస్తున్న ఒక ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. నీరాది నేపాల్‌లోని బగ్లుంగ్ ప్రాంతం.
పుట్టి పెరిగింది అంతా అక్కడే. అయితే.. కొన్నాళ్లుగా రాజధాని ఖాట్మండ్‌లో ఉంటోంది. జానపద గీతాలతో పాపులర్ అయింది. తన మధురమైన గొంతుతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకుంది. నేపాల్ సంప్రదాయాన్ని ప్రతిబింబించే వేషధారణతో ఈవెంట్స్‌కు వెళ్తుంది. అంతేకాదు తన పాటల్ని తరచూ సోషల్వి•డియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. నీరా పాటల్లో పిర్తికో డోరీ పాట చాలా ఫేమస్. ఖాట్మాండ్లో ఒక పోగ్రాంలో పాల్గొన్న ఆమె తర్వాత పొఖారకు బయలు దేరింది. అయితే.. అనూహ్యంగా విమాన ప్రమాదంలో తుది శ్వాస విడిచింది. నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపాడు.•