Take a fresh look at your lifestyle.

తెలుగు భాషకు వన్నె తెచ్చిన సాహితీ ప్రక్రియ అవధానం

తెలుగుభాష మాధుర్యాన్ని పరిమళింపజేయాలి.. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు
తెలుగు భాష మాధుర్యానికి, తెలుగు పద్య వైభవానికి మరింత వన్నె తీసుకొచ్చిన సాహితీ పక్రియే అవధానమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అవధానం చేస్తున్నకవి..ఆశు కవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణాశక్తి, పాండితీ ప్రకర్షకు పరీక్ష వంటిదని అన్నారు. బహుశా సంస్కత, తెలుగు భాషలకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పక్రియను మరింతంగా ప్రోత్సహిస్తూ..తెలుగుభాష మాధుర్యాన్ని, సాహితీ సౌరభాన్ని మరింత పరిమళింపజేయాల్సిన బాధ్యత భాషాపండితులు, సాహితీవేత్తలపై ఉన్నదని ఉపరాష్ట్రపతి సూచించారు. గురువారం తిరుపతిలోని శ్రీ కష్ణదేవరాయ సత్సంగ్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ ‌మేడసాని మోహన్‌ ‌నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ శతావధానం’ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రతి అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. ‘క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను సులువుగా పూర్తి చేస్తూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ అద్భుతమైన సాహితీ విన్యాసంగా ముందుగా సాగే అవధాన పక్రియ ఎంతో ఆసక్తిదాయంగా ఉంటుంది’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషే మన అస్తిత్వమన్న ఉపరాష్ట్రపతి.. తెలుగు భాష పరిరక్షణ, తర్వాతి తరాలకు ఈ మాధుర్యాన్ని అందించడంలో రచయితలు, సాహితీవేత్తలు, కవులు, భాషా నిపుణులు మరింత కృషిచేయాలన్నారు. తెలుగు భాష పరిరక్షణకోసం విదేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. భాష ఔన్నత్యాన్ని కాపాడుతున్న అవధానులందరూ అభినందనీయులని అన్నారు.

తెలుగు భాష వైభవాన్ని పరంపరగా ముందుకు తీసుకువెళుతున్న మేడసాని మోహన్‌ను ప్రశంసిస్తూ.. ‘సరస్వతి పుత్రులు. అసాధారణ జ్ఞాపకశక్తి, ప్రజ్ఞాపాటవాలు కలిగిన వారు. తెలుగు భాషకు, సాహితీ రంగానికి ఆయన చేస్తున్న సేవ అభినందించదగినది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మహత్తర అవధాన కార్యక్రమంలో అమెరికా, యూరప్‌, ఆసియా ఖండాలకు చెందిన 20 దేశాల నుంచి సాహితీ వేత్తలు పృచ్ఛకులుగా పాల్గొనడం అభింనదనీయమన్నారు. అంతర్జాతీయ శతావధానంలో భాగంగా ‘కురు, చిరు, కడు, నడు, నిడు’ లను ఉపయోగించుకుంటూ భారతీయ సంస్క•తి వైభవం గురించి గానీ, పర్యావరణ పరిరక్షణ గురించి గానీ, ప్రపంచ శాంతి గురించి గానీ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని చెప్పమని ఉపరాష్ట్రపతి సమస్యను సంధించారు. దీనికి డాక్టర్‌ ‌మేడసాని మోహన్‌ ‘శ్రీ‌లు చేకురు గాక, శ్రీ భారతోర్వీ యశస్ఫూర్తి దిగ్వియసంభుతముగ ….తల్లి స్వాంతమందు వెలుగగ నుపాసనము చేయు విభుదవరుల నిలయముగ భారతంబు సొంపలరుచుండె సౌభాగ్య విభవము అలర’ అని పూరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, భాషా పండితులు, రచయితలు, కవులు, భాషాభిమానులు, భాషావేత్తలతో పాటు వివిధ దేశాలకు చెందిన తెలుగువారు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply