Take a fresh look at your lifestyle.

రాజకీయాలకతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించండి

  • ఉత్తమ్‌ ‌రాజకీయాలు మాని ఇంట్లో కూర్చుంటే మంచిది
  • కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
  • కాంగ్రెస్‌, ‌బిజేపి ప్రజలను అవమానపరుస్తున్నాయి
  • కొత్త మేయర్లు, మున్సిపల్‌ ‌చైర్మన్ల సమావేశంలో కేటీఆర్‌

Focus on the development it and municipal minister ktr

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, మేయర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. ఇంటి నిర్మాణాలు, ఇతర అంశాలపై కౌన్సిలర్లు, వార్డు సభ్యులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలో కొత్త మున్సిపల్‌ ‌చట్టంపై సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కలిగిస్తామని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో తనను కలిసేందుకు వచ్చిన మున్సిపల్‌ ‌చైర్మన్లు, మేయర్లతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ ‌మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలితాల కారణంగానే ప్రజలు మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ఘన విజయాన్ని అందించారని చెప్పారు.పార్లమెంటు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు స్థానాలు తగ్గగానే పార్టీ పని అయిపోయిందని విపక్షాలు హద్దులు లేకుండా ఎగిరెగిరి పడ్డాయని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని జడ్పీ చైర్మన్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో 130 స్థానాలకు గాను 122 గెలుచుకుని చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. సొంత బలంపై నమ్మకం లేని ప్రతిపక్షాలు మున్సిపల్‌ ఎన్నికలను అడ్డుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయనీ, ఎప్పటిలాగే కాంగ్రెస్‌ ‌పార్టీ కోర్టులకు వెళ్లి భంగపడ్డాయని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారనీ, టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ఎగిరిపడ్డ బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను సైతం బరిలోకి దింపలేక పోయిందని వ్యాఖ్యానించారు.

మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ, రూ. వందల కోట్లు ఖర్చు చేసి ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకుందని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌ఖండించారు. ఉత్తమ్‌ ‌మాటలు ఓట్లేసిన ప్రజలను అవమానించడమేననీ, న్యాయ, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందంటున్న ఉత్తమ్‌ ‌రాజకీయాలు మానుకుని ఇంట్లో కూర్చుంటే మంచిదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈవీఎంల మీద, బ్యాలెట్‌ ‌పద్దతిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనూ గెలిచి టీఆర్‌ఎస్‌ ‌సత్తా చూపించామన్నారు. టీఆర్‌ఎస్‌ను అనవసరంగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలను మేం పట్టించుకోవడం లేదు, మీరు కూడా పట్టించుకోవద్దని సూచించారు.మున్సిపల్‌ ఎన్నికలు ముగిసినందున ఇక మేయర్లు, మున్సిపల్‌ ‌చైర్మన్లు అభివృద్ధిపై దృష్టి సారించాలని కేటీఆర్‌ ‌సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ఏటా రూ. 3 వేల కోట్ల నిధులు వస్తాయనీ, ఈ నిధు)తో పట్టణాలను శరవేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ‌చెప్పినట్లు మున్సిపల్‌ ఎన్నికలలో గెలిచామని అహంకారం తలకెక్కించుకోవద్దని సూచించారు. ప్రణాళికబద్దమైన అభివృద్ధి, పారదర్శక సేవలు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ విధానమనీ, కొత్తగా రూపొందించిన మున్సిపల్‌ ‌చట్టంలో నిధులతో పాటు విధులనూ పొందుపరచామనీ, దీనిపై త్వరలోనే అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవినీతికి దూరంగా ఉండాలి తప్పులు చేసి తలవంపులు తేవొద్దు తప్పులు చేస్తే ఎవరివైనా పదవులు ఊడతాయని హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామనీ, తప్పు చేసిన వారిని కాపాడాలని ఎవరు చెప్పినా తాను విననని ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించిందనీ, 57 శాతం మహిళలకు మున్సిపల్‌ ‌పీఠాలలో అవకాశం ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీలుగా తెలంగాణ పట్టణాలు మారడం ఖాయమనీ, మున్సిపల్‌ ఎన్నికలలో ఘన విజయాన్ని అందించిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపించి వారి రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.