Take a fresh look at your lifestyle.

వరద రాజకీయం

  • ఫోర్జరీ సంతకంపై సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ‌సవాల్‌
  • ‌చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి ఆలయం వద్ద హైటెన్షన్‌
  • ‌సీఎంను దుర్భాషలాడారని సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు
జీహెచ్‌ఎం‌సి ఎన్నికల వేళ వరద రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సంఘం వరద బాధితులకు ఆర్థిక సాయం నిలిపివేతకు కారణం మీరంటే మీరేనంటూ అధికార టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలను రక్తి కట్టించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల సంఘానికి రాసిన లేఖతోనే వరద బాధితులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి బ్రేక్‌ ‌పడిందని స్వయంగా సీఎం కేసీఆర్‌ ఆరోపించడం, తన సంతకంతో ఫోర్జరీ లేఖను టీఆర్‌ఎస్‌ ‌నేతలే సృష్టించారనీ, దీనిపై నిజానిజాలు తేల్చుకునేందుకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు రావాలని బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌విసిరిన నేపథ్యంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. అసలే శుక్రవారం కావడంతో చార్మినార్‌ ‌వద్ద పరిస్థితి వేడెక్కింది. మరోవైపు, భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ నేతలు ర్యాలీగా బయల్దేరతారన్న సమాచారంతో నాంపల్లిలోని ఆపార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేదనీ, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనికుమార్‌ ‌చేసిన హెచ్చరికలతో పరిస్థితి మరింత వేడెక్కింది. అయితే, అమ్మవారి దర్శనం కోసం బండి సంజయ్‌కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేయడంతో ఆయన చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు.
 ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాలలో నగర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం మోహరించారు. ఫోర్జరీ సంతకంపై తేల్యుకోవడానికి చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని  సీఎం కేసీఆర్‌కు విసిరిన సవాల్‌ ‌మేరకు  బండి సంజయ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మరికొందరు పార్టీ నేతలతో కలసి మధ్యాహ్నం 11 30 గంటల సమయంలో చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీ సంఖ్యలో చేరి బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంజయ్‌ ‌ముందుగా చెప్పిన ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకే సీఎం కేసీఆర్‌ ‌కోసం వేచి చూశారు. సీఎం కేసీఆర్‌ ‌రాకపోవడంతో అక్కడే మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ‌వరద బాధితులను ఆదుకునే ఉద్దేశ్యం లేదనీ, అందుకే తన పేరిట ఫోర్జరీ చేసిన లేఖను ఎన్నికల సంఘానికి పంపించి బాధితులకు ఆర్థిక సాయాన్ని నిలిపివేయడం దారుణమని ఆరోపించారు. స్వయంగా సీఎం స్థాయి వ్యక్తి తనపై అసత్య ఆరోపణలు చేయడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన లేఖను ఎన్నికల సంఘానికి పంపారనీ, తాను ఆరోపించినట్లుగా నిజానిజాలు తేల్చుకునేందుకు రమ్మంటే చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరంలో ఎంఐఎం
అండతో  మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ ‌హయాంలో హైదరాబాద్‌ ‌నగరాన్ని అస్తవ్యస్తం చేశారనీ, విశ్వనగరమని చెప్పి విషాద నగరంగా మార్చి వేశారని ధ్వజమెత్తారు. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ప్రకటించిన రూ. 10 వేలు వారికి ఎటూ సరిపోవనీ, సీఎం కేసీఆర్‌ ‌వరద బాధితులను చిన్నచూపు చూశారని విమర్శించారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ప్రజలు బీజేపీకి పట్టం కడితే వరద బాధితులకు రూ. 25 వేలు ఆర్థిక సాయంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌దేశద్రోహి అనీ, హిందూ వ్యతిరేకి అనీ, జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు.
 అయితే, ఆ తరువాత బండి సంజయ్‌ ‌సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖలు చేశారంటూ ఆయనను అరెస్టు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌ ‌పట్ట అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్‌ ‌సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా నగర ప్రజలలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన బండి సంజయ్‌ ‌తన స్థాయిని మరచి చిల్లరగా వ్యవహరిస్తున్నారనీ, ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Leave a Reply