Take a fresh look at your lifestyle.

ఎన్నికల ఫలితాల తరువాత వరద సాయం చేయొచ్చు

కొనసాగింపుపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు

జీహెచ్‌ఎం‌సి ఎన్నికల తరువాత వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. వరద సాయం కొనసాగింపుపై ప్రస్తుతం స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. వరద బాధితులకు ఆర్థిక సాయం యధావిధగా కొనసాగించాలన్న పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికల సంఘం వరద బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సాయం నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ ‌శరత్‌ ‌వాదించారు. ప్రభుత్వానికి ఎన్నికలు ఉన్న విషయం ముందే తెలుసా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదల కాకముందే బాధితుల అకౌంట్‌లో డబ్బులు ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. అయితే, వరద బాధితులకు ఇచ్చే సాయం మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్ ‌కిందకు రాదని చెప్పి 25 గంటల్లోనే ఎన్నికల సంఘం మాటమార్చిందని పిటిషనర్‌ ‌హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థనా లేక రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలా అని ప్రశ్నించింది. అలాంటప్పుడు ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించాలనీ, బాధితులకు సహాయం ఆపకూడదని ఎన్నికల నియమావళిలో ఏదైనా ఉందా అని పేర్కొంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కాండక్ట్ ‌జీహెచ్‌ఎం‌సి ఎన్నికలకు కూడా వర్తిస్తుందనీ, సెక్షన్‌ 8 ‌ప్రకారం వరద సాయాన్ని హోల్డ్‌లో పెట్టవచ్చు కదా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎన్నికల కంటే ముందే వరద బాధితుల సాయం పథకం అమలులోకి వచ్చిందని పిటిషనర్‌ ‌హైకోర్టు దృష్టికి తీసుకొస్తూ, ఇప్పుడు దానిని ఆపడం పొలిటికల్‌ ఎజెండా అవుతుందని పేర్కొన్నారు. వరద సాయం కొంత మందికి మాత్రమే పంపిణీ జరుగుతోందనీ, కాబట్టి ఈ పథకాన్ని ఆపివేయాలని నిర్ణయించామని ఎన్నికల కమిషన్‌ ‌కోర్టుకు తెలిపింది.

ఇది కేవలం ఎన్నికలు జరిగేంత వరకు మాత్రమేననీ, ఆ తరువాత వరద సాయాన్ని యధావిధిగా కొనసాగించవచ్చని కోర్టులో పేర్కొంది. ఈ సహాయం వోటర్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందనీ, గత నెల 20న ఈ పథకం 10 రోజుల పాటు ఆపితే ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడింది. ఈ అంశాలపై వచ్చే నెల 4న కౌంటర్‌ ‌దాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు అదే తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply