Take a fresh look at your lifestyle.

వరద సాయం బాధితులందరికీ అందడం లేదు

జవహర్‌ ‌నగర్‌లో మహిళల ఆందోళన.. కూకట్‌పల్లిలో ఇరువర్గాల ఘర్షణ
‌జవహర్‌నగర్‌ ‌మున్సిపల్‌ ‌కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వరద బాధితుల సహాయం అందరికీ అందడం లేదని బాధితుల ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ‌కార్యాలయం వద్దకు బాధితులు భారీగా చేరుకున్నారు. వోట్లు వేయలేదని కార్పొరేటర్లు డబ్బులు ఇవ్వడం లేదని మహిళలు వాపోతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే నగరంలోని కూకట్‌పల్లి దాయారుగూడలో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బాధితులకు వరద పరిహారం అందించే విషయంలో అన్యాయం చేస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు.

అయితే అర్ధరాత్రి సమయంలో బీజేపీ నాయకులు, స్థానికులపై గుర్తు తెలియని దుండగులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ ‌నాయకులే దాడి చేయించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో హైదరాబాద్‌లో పలుచోట్ల వివాదాస్పదంగా మారుతోంది. బాధితులకు పరిహారం ఇవ్వాల్సింది పోయి..అధికారపార్టీకి సంబంధించిన కార్యకర్తలకు డబ్బులు పంచుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వొస్తున్నాయి. అందులో భాగంగా కూకట్‌పల్లి దాయారుగూడలో రెండు వర్గాల మధ్య  జరిగిన దాడి సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply