అమరావతి, జనవరి 19 : ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వెలువడినా.. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా.. చివరకు అటెండర్ పోస్టులు పడినా.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా పోటీ పడుతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్లో పోలీసు కొలువులకు గట్టి పోటీ నెలకొంది.. అది ఎంతలా అంటే.. ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడేలా.. ఎస్ఐ పోస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువు జనవరి 18వ తేదీతో ముగిసింది.. ఆ సమయానికి 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది..
వీరిలో పురుష అభ్యర్థులు 1,40,453 మంది, మహిళా అభ్యర్థులు 32,594గా ఉన్నారు. అయితే, పోలీసు శాఖలో కేవలం 411 (సివిల్ పోలీసు-315, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్-96) పోస్టుల భర్తీకి మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.. 2022 నవంబరు 28న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా డిసెంబరు 14 నుంచి 2023 జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు.. ఇక, అభ్యర్థులకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.. ఫిబ్రవరి 19న ప్రాథమిక పరీక్ష జరగనుంది.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.