Take a fresh look at your lifestyle.

ఆసక్తిని కలిగిస్తున్న అయిదు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్‌ ‌ఫలితాలు

తాజాగా దేశంలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వివిధ విశ్లేషణ సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలు దేశ ప్రజలకు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. దేశంలో కొరోనా పరిస్థితులు తీవ్రమైనప్పటికీ లెక్క చేయకుండా ఈ అయిదు రాష్ట్రాలు ఎన్నికలను కొనసాగించాయనే కంటే ఈ అయిదు రాష్ట్రాలను తమ సొంతం చేసుకోవడానికి బిజెపి చాలా ఆసక్తిని కనబరిచిందనే చెప్పాలె. ఈ అయిదు రాష్ట్రాల్లోకూడా అందరి దృష్టిని ఆకర్షించింది పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు ఎన్నికలు. అన్నిటికన్నా చెప్పుకోదగింది పశ్చిమబెంగాల్‌. ‌పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని నెరిపిన లెఫ్ట్ ‌పార్టీని తోసి తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ఇక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అప్పటినుండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీ బెంగాల్‌ ‌టైగర్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో అమెకు నిప్పులో ఉప్పులా తయారైంది.

ఈ పరిస్థితిలో ఇక్కడి ఎన్నికలు దేశ ప్రజలందరిని ఆకర్షించేవిగా మారాయి. ఇక్కడి రాజకీయ పరిణామాలు త్వరితగతిన మారుతూ వచ్చాయి. అటు రాజకీయంగా ఇటు మానసికంగా తనను ఇబ్బందులకు గురిచేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై మమత విరుచుకుపడని క్షణంలేదు. కాగా ఎట్టి పరిస్థితిలోనూ మమతను గద్దె దింపడం ఖాయమంటూ ప్రధాని నరేంద్రమోదీ మొదలు అగ్ర బిజెపి నేతలు కాలుకు బలపం కట్టుకుని తిరిగినట్లు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ రెండు పార్టీల మధ్య కేవలం మాటల యుద్దమేకాదు. అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మమత కాలుకు తీవ్ర గాయంకావడం, ఆమె చక్రాల కుర్చీలోనే కూర్చుని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడంలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

మమతకు అత్యంత సన్నిహితుడిని ఆమెకు ప్రత్యర్థిగా నిలబెట్టడం, ఆమెకు అత్యంత సన్నిహితుడైన అధికారులను బదిలీచేయడం లాంటి కేంద్ర చర్యలు సైతం ఈ ఎన్నికల్లో అమె గెలుపును నిరోదించలేకపోతున్నట్లు వివిధ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో మమతను ఈసారి ఇంటికి పంపడం ఖాయమంటూ విస్తృత ప్రచారం చేసిన బిజెపి అనుకున్నది సాధించలేక పోతున్నట్లుగా ఈ సర్వేలు చెబుతున్నాయి. దాదాపు తొమ్మిదినుండి పది సంస్థలు బెంగాల్‌తోపాటు ఇటీవల జరిగిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే తాము నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ ‌సర్వే ఫలితాను వెల్లడించాయి. బెంగాల్‌ ‌విషయానికొస్తే విచిత్రకరమైన అంశమేమంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఎనిమిది విడుతలుగా ఎన్నికలు నిర్వహించారు.

అతి పెద్ద రాష్ట్రమైన బెంగాల్‌లో తమ కాషాయ జంఢాను పాతేందుకు కావల్సిన మానవ వనరులను సమీకరించుకోవాలనుకుందో ఏమోగాని, మమతను ఊపిరి తీసుకోకుండా చేయగలిగిందా పార్టీ. అయితే సర్వేలు మాత్రం ఆ పార్టీకి పట్టంకట్టే దిశలోకనిపించడంలేదు. 294 శాసనసభ స్థానాలున్న ఈరాష్ట్రంలో అత్యంత మెజార్టీ స్థానాలు బిజెపి కైవసం చేసుకుంటుందని రెండు సంస్థలు అంచనా వేయగా, మిగతా సంస్థలన్నీ అధిక స్థానాలను తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌సాధించుకుంటుందని తమ సర్వేలో వెల్లడించాయి. అలాగే తమిళనాడులో అన్నా డిఎంకెతో కలిసి దక్షిణాధిలో పాగా వేయాలనుకున్న బిజెపికి కాస్తా నిరాశే ఎదురవుతుందన్నట్లుగా ఆ సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్న సంకేతాలిచ్చినప్పటికీ నటుడు కమల్‌ ‌హసన్‌ ‌కొత్తగా పెట్టిన మక్కల్‌ ‌నీది మయ్యం పార్టీపట్ల ప్రజలు పెద్దగా ఆదరణ చూపినట్లులేదు. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడులో యాక్సిస్‌ ‌మై ఇండియా, రిపబ్లిక్‌ ‌సిఎన్‌ఎక్స్, ‌పి మార్క్, ‌టుడేస్‌ ‌చాణక్య లాంటి సంస్థలన్నీ ఈసారి డిఎంకె 160 నుంచి 195 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి.

మమతతోపాటు కేంద్రంపై ధ్వజమెత్తిన డిఎంకెకే ఇక్కడి ప్రజలు పట్టం కట్టనున్నారన్నది సర్వే చెబుతున్న అంశం. కేరళలో కూడా బిజెపి ఒక డిజిట్‌కు మించి సాధించుకోలేదని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ అధికారంలోఉన్న ఎల్‌డిఎఫ్‌ ‌కూటమే తిరిగి విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. నాలుగు సర్వే సంస్థలు చెబుతున్నదాన్ని బట్టి 71 నుండి 111 స్థానాలవరకు అధికార ఎల్‌డిఎఫ్‌ ‌సాధించుకుంటుందని, 20 నుండి 68 వరకు స్థానాలు యుడిఎఫ్‌కు వొచ్చే అవకాశాలున్నాయంటున్నాయి సర్వేలు. అయితే అస్సాంలో మాత్రం బిజెపి కూటమి రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయంటున్యాయి . ఇక్కడ 126 స్థానాలకు గాను 58 నుంచి 84 స్థానాల వరకు బిజెపి దక్కించుకునే అవకాశముండగా, కాంగ్రెస్‌కు 40 నుండి 66 స్థానాలు రావచ్చని అయిదు సర్వే సంస్థల ఫలితాలు చెబుతున్నాయి.

పుదుచ్చేరిలో కూడా ఇంచుమించు ఇలాంటి ఫలితాలే రావచ్చంటున్నాయి. ఇక్కడ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ 16 నుంచి 23 స్థానాలను గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యుపిఏ 10 నుండి 13 స్థానాలను పొందే అవకాశమున్నట్లు సిఎన్‌ఎక్స్, ఏబిపి సి ఓటర్స్ ‌తమ సర్వేలో వెల్లడించాయి. మొత్తంమీద ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత హల్‌చల్‌ ‌చేశాయో, ఫలితాల విషయంలోనూ అంత ఉత్కంఠతను కలిగిస్తున్నాయి. ఈ ఫలితాలు ఒక విధంగా దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకు దారి తీసేవిగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply