Take a fresh look at your lifestyle.

బిజెపికి పరీక్షగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న ఎన్నికలు బిజెపికి సవాల్‌గా మారనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఈ రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు బిజెపికి కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఈ అయిదు రాష్ట్రాల్లో పంజాబ్‌ ‌మినహా అన్ని రాష్ట్రాల్లో బిజేపి పార్టీనే అధికారంలో ఉండడం. తమ అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు పంజాబ్‌ను కూడా హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంగా బిజెపి ఉంది. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆలోచనతోనే ఆ పార్టీ పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కాషాయ జండా ఎగురవేయటం మాత్రం అంత సులభమేమీ కాదన్నది స్పష్టమవుతున్నది.

సంవత్సర కాలానికి పైగా దేశ రాజధాని దిల్లీ చుట్టూ డేరాలు వేసుకుని ఆందోళన చేసిన రైతాంగంలో అధికశాతం పంజాబ్‌ ‌రైతులే. వారి ఆందోళనకు కేంద్ర సర్కార్‌ ‌చివరకు తలవొగ్గినప్పటికీ ఏదో రీతిలో విరమించుకున్న ఆ మూడు చట్టాలను తిరిగి ప్రవేశపెడుతా మంటూ రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న కేంద్రమంత్రుల తీరుపై ఇంకా అక్కడి రైతులు ఆగ్రహంగానే ఉన్నారు. ఈఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌ ‌పర్యటనలో ఏర్పడిన అవాంతరాన్ని చూసినప్పుడు కారణాలేవైనా బిజెపికి అక్కడి ప్రజలు అనుకూలంగా లేరన్నది స్పస్టమవుతున్నది. కాగా తన స్థానాన్ని పదిలపర్చుకునే విషయంలో కాంగ్రెస్‌ ‌బిజెపితో పాటు అకాలీదళ్‌, ఆప్‌ ‌పార్టీలను ఎదుర్కోవాల్సిఉంది. గత ఎన్నికల్లో ఆప్‌ ‌గణనీయమైన సీట్లను సాదించుకోవడంతో ఈసారి మరింత కష్టపడైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రజలనే సిఎం అభ్యర్థిని ఎంచుకోవాలని ఆ పార్టీ అధినేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌చేసిన ప్రకటనకు విశేష స్పందనరావటం కూడా ఆ పార్టీపైన అక్కడి ప్రజలు చూపిస్తున్న విశ్వాసానికి మచ్చుతునక.

ఇకపోతే ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు ఆ పార్టీకి అతి ముఖ్యమైన రాష్ట్రం. సహజంగా కేంద్ర నాయకత్వంపై ఈ రాష్ట్ర ఎన్నికల ప్రభావం ఉంటుందంటారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రాష్ట్ర ఎన్నికలు కీలకంగా భావించడమన్నది మొదటినుండీ జరుగుతున్నది. యోగి ఆదిత్యనాథ్‌ ‌ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పెద్దగా చెప్పుకోదగిన ప్రగతిని సాధించలేకపోయినా శాంతి భద్రతలు నెలకొల్పడం ద్వారా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాడన్న పేరుంది. అయితే ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది రాజకీయ సమీకరణలు మారుతూ వస్తున్నాయి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో బిజెపి ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు పార్టీ మారటమన్నది అక్కడ కలకలం లేపుతున్నది. ఆ పార్టీని ఎందుకు వీడిపోతున్నారన్నది ఇప్పుడా రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరంతా సమాజ్‌వాది పార్టీ వలసబాటపడుతున్నదానికి అడ్డుకట్ట వేసేందుకు ఇజెపికూడా పెద్ద వ్యూహ రచనే చేస్తున్నది. సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంసింగ్‌ ‌యాదవ్‌ ‌కోడలు అపర్ణ యాదవ్‌ను బిజెపిలోకి ఆకర్షించడం ద్వారా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌కు పెద్ద షాకే ఇచ్చింది.

ఒక ఏడాదిలోనే మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చడంద్వారా ఉత్తరాఖండ్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందన్న అపవాద బిజెపికి ఉంది. మొదటినుండి బిజెపికి సవాల్‌గా నిలుస్తున్న ఆమ్‌ ఆద్మీపార్టీ ఈసారి ఇక్కడ ఎన్నికలరంగంలో ప్రవేశించింది. ఇంతవరకు బిజెపి, కాంగ్రెస్‌ ‌మద్యే పోటీ తీవ్రతరంగా ఉండేది. ఇప్పుడు ఆప్‌ ‌పార్టీ రావడంతో ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పేట్లులేదు.

దశాబ్దంన్నర కాలంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మణిపూర్‌ను గత ఎన్నికల్లో బిజెపి హస్తగతం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌కన్నా బలంగా ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితుల ప్రభావం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. నాగాలాండ్‌లో భద్రతా బలగాల చేతిలో పద్నాలుగురు పౌరులు మరణించినతర్వాత ఈశాన్య ప్రాంతంలో పరిస్థితులు మారాయి. ఈసారి బిజెపి అధికారాన్ని తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ఇక్కడ సవాల్‌ ‌చేయబోతున్నది.

గోవాలో చతుర్ముఖ పోటీ తప్పేట్లులేదు. ఈసారైనా బిజెపి నుండి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న హస్తం పార్టీకి బరిలోకి దిగుతున్న ఆప్‌, ‌టిఎంసి పార్టీలు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌లేదా బిజెపి ఏదో ఒకటి ఇక్కడ అధికారంలోకి వొస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో విసుగుచెందిన ఇక్కడి ప్రజలకు కొత్తగా రంగప్రవేశం చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక ఆశా దీపంగా కనిపిస్తున్నది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉచిత వైద్యం, ఆరు నెలల్లో భూ హక్కులను కల్పిస్తామని, పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతీ మహిళకు వెయ్యి రూపాయలు అందిస్తామన్న కేజ్రీవాల్‌ ‌చేసిన ఎన్నికల ప్రకటన అక్కడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.

మొత్తంమీద ఫిబ్రవరి పది నుండి మార్చి ఏడవ తేదీవరకు ఏడు విడుతలుగా జరుగబోయే ఈ ఎన్నికలను ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పార్టీలన్నీ సన్నద్దమవుతుండగా, బిజెపికిది పరీక్షగా మారింది.

Leave a Reply