- చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురుచూపు
- జమ్మలమడుగు డివిజన్‌లో కుండపోత వర్షం
- పొంగి పొర్లుతున్న కుందూ,పెన్నా నదులు
కడప, అక్టోబర్ 14 : ప్రొద్దుటూరులోని పెన్నానదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారు కమలాపురం మండలం, కంచన్నగారిప్లలె దగ్గర చెట్లను పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు, పోలీసులు గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది బోట్లతో రంగంలోకి దిగారు. ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాల కారణంగా కడప జిల్లాలో ఉధృతంగా పెన్నా, కుందూ నదులు ప్రవహిస్తున్నాయి. జమ్మలమడుగు డివిజన్‌లో కుండపోత వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో అంతా జలమయమైంది. ఎక్కడ చూసినా నీళ్లు పొంగి పొర్లాయి. వరద నీరు పెరగడంతో కుందూ పోటెత్తింది.
నెమళ్లదిన్నె వంతెనపై రెండు అడుగుల మేర ప్రవాహం పెరిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఖరీఫ్ పంటలకు ప్రాణం పోస్తుందని ఆశించిన వర్షం రైతాంగానికి అపార నష్టాన్ని మిగల్చింది. పెద్దముడియంతో పాటు ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి కుందూ నది ఉధృతంగా పారుతోంది. నెమళ్లదిన్నె వంతెనపై రెండు అడుగుల మేర ప్రవాహం పెరిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పెద్ద పసుపుల నుంచి ఉలవప్లలె, పాలేరు నుంచి పెద్దముడియం, చిన్నపసుపుల నుంచి జమ్మలమడుగు, ఎన్.కొట్టాలప్లలె ఇలా.. పలు గ్రామాల మధ్య వంతెనలు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు వచ్చింది.
పెద్దపసుపులలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల ఆవరణంలోకి వర్షం నీరు చేరింది. అలాగే విద్యుత్ అంతరాయం కూడా తలెత్తింది. గురువారం సాయంత్రం వరకు విద్యుత్ పునరుద్ధరణ జరగక జనం అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా పత్తి, జొన్న, మినుము, పెసర, సోయాబీన్ తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు నెమళ్లదిన్నె కుందూ వద్ద పరిస్థితి సక్షించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే తహసీల్దారు జ్యోతి రత్నకుమారి సిబ్బందిని అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలను ఆదేశించారు.