Take a fresh look at your lifestyle.

‘బాబు.. చేపల వేట..!

“‘ఈ ‌పరిస్థితుల్లో పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలి. కార్యకర్తలకు కాస్త మనోధైర్యం ఇవ్వాలి. నాయకత్వంపై నమ్మకం కలిగించాలి. అందుకే ఓ పాచిక వేసింది బాబు శిబిరం. తమ చేతిలో ఉండే లేదా బాబు మనిషి అని వైసీపీ ఆరోపించే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌తో ఎన్నికలను ఆరు వారాల పాటు ఏకపక్షంగా వాయిదా వేయించింది. ఈ హఠాత్‌ ‌పరిణామంతో స్వయంగా సీఎమ్‌ ‌జగనే ఖంగు తిన్నారు అనటం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ వాయిదాకు కమిషనర్‌ ‌రమేష్‌ ‌చెప్పిన కారణం ‘‘కొరోనా’’. ఇక్కడ ఇంగ్లీష్‌ ‌సామెత ‘Fishing in troubled water’ గుర్తుకొస్తుంది ..!”

‘బాబు.. చేపల వేట..!

Rehanaఎత్తుకు పై ఎత్తులు వేయటమే రాజకీయ క్రీడ. ప్రత్యర్థిని తమ వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేయటం చేయి తిరిగిన రాజకీయ నాయకుడు చేసే పని. ఈ వ్యూహాలు అనైతికమా, నైతికమా, సిద్ధాంత పరంగా ఉన్నాయా? అడ్డదారులు తొక్కుతున్నారా? అనేది మరో చర్చ. ప్రాథ•మికంగా ఏ ఆట లక్ష్యం అయినా ప్రత్యర్థిని ఓడించటం తద్వారా తమ గెలుపును ఖాయం చేసుకోవటమే కదా. ఇది చెప్పుకునేంత తేలిగ్గా జరిగే పని కాదు. పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలి. ప్రత్యర్థిపై గట్టిగా పంచ్‌ ‌విసరాలంటే అతని బలహీనత కూడా తెలిసి ఉండాలి. ఎక్కడ కొడితే తట్టుకోవటం కష్టమో తెలిస్తేనే పై చేయి సాధించటం తేలిక అవుతుంది. అంటే మన బలాన్ని పెంచుకోవటమే కాదు, ప్రత్యర్థి బలాలను, బలహీనతలను కూడా పసిగట్టాలి. మైదానంలో ఇద్దరున్నప్పుడు, ఇద్దరూ గెలుపు కోసం పోటీ పడుతున్నప్పుడు….ఇదే పని అవతలి పక్షం కూడా చేస్తుందిగా. అందుకే అవతలి శిబిరం ఎలాంటి వ్యూహాలు వేస్తుందో ముందే పసిగట్టగలిగితేనే ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది సాధ్యం కావాలంటే రెండాకులు ఎక్కువ చదివిన చాణుక్యులు ఉండాలి. అవతలి శిబిరంలో వేగుల వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలగాలి. ఈ రెండూ చేయలేకపోతే…తీరిగ్గా ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్‌లు పెట్టుకుని మైకుల ముందు ఆవేదన వ్యక్తం చేయటం మినహా మరొకటి మిగలదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ పరిస్థితి ఇలానే ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి కొన్నింటికి ఆరు నెలలు దాటితే, మరికొన్ని ఏడాదికి పైగా అయ్యింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, గెలుపు కసరత్తులు, కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికలు, 27న పంచాయతీ ఎన్నికల తొలి విడుత, 29న పంచాయతీ ఎన్నికల తుది విడుత ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పక్షానికి అనుకూలంగా వస్తుంటాయి సహజంగా. తెలంగాణలోనూ లోకల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ 90 శాతానికి పైబడిన స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో మొత్తం స్థానాల్లో 22 శాతం స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.

ఎన్నికలు జరిగితే మెజార్టీ స్థానాల్లో వైసీపీ జెండానే ఎగురుతుందన్నది ప్రత్యర్థి టీడీపీకి ఉన్న భయం. దీనికి తోడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, స్థానిక నేతలు వరుస కట్టి అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ సమయంలో చేరికల సీన్‌ ఇప్పుడు రివర్స్ అయ్యింది. గతంలో తమ ప్రభుత్వ అభివృద్ధిని చూసి అందరూ చేరుతున్నారు అని చెప్పుకున్న వారే…ఇప్పుడు టోన్‌ ‌మార్చి అంతా అరాచక పాలన, అప్రజాస్వామికం అంటూ విమర్శలకు దిగుతున్నారు. అదే రాజకీయం. ఈ పరిస్థితుల్లో పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలి. కార్యకర్తలకు కాస్త మనోధైర్యం ఇవ్వాలి. నాయకత్వంపై నమ్మకం కలిగించాలి. అందుకే ఓ పాచిక వేసింది బాబు శిబిరం. తమ చేతిలో ఉండే లేదా బాబు మనిషి అని వైసీపీ ఆరోపించే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌తో ఎన్నికలను ఆరు వారాల పాటు ఏకపక్షంగా వాయిదా వేయించింది. ఈ హఠాత్‌ ‌పరిణామంతో స్వయంగా సీఎమ్‌ ‌జగనే ఖంగు తిన్నారు అనటం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ వాయిదాకు కమిషనర్‌ ‌రమేష్‌ ‌చెప్పిన కారణం ‘‘కొరోనా’’. ఇక్కడ ఇంగ్లీష్‌ ‌సామెత ‘Fishing in troubled water’ గుర్తుకొస్తుంది ..!

ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో ఉండగా ఉన్నపళంగా వాయిదా వేస్తూ చేసిన ప్రకటన సంబద్ధత ఎంత అనేది ఒక ప్రశ్న. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవటం ప్రజాస్వామిక సంప్రదాయం. ప్రస్తుత వాయిదాలో దీన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ మాత్రం ఖాతరు చేయలేదన్నది స్పష్టమే. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ‘‘కొరోనా వైరస్‌’’‌ను సాకుగా చూపిస్తున్నప్పుడు…పక్క రాష్ట్రంలోనో, పక్క దేశంలోనో జరుగుతున్న పరిణామాలను కాకుండా మన రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. బేరీజు వేయటం అంటే పత్రికలను చూసో, టీవీలో చూసో కాదు. అధికారికంగా ఆరోగ్య శాఖా మంత్రినో, ఉన్నతాధికారినో లేదా ప్రభుత్వాన్నో అడి•గి నివేదిక తెప్పించుకుని దాని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటం రాజ్యాంగ స్పూర్తి. వాస్తవంగా ఏపీలో కొరోనా పాజిటివ్‌ ‌కేసు ఇప్పటి వరకు ఒక్కటే నమోదు అయ్యింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆ బాధితుడు కూడా వైద్య చికిత్స అనంతరం కోలుకోవటంతో రాష్ట్రంలో కొరోనా ప్రభావం నామమాత్రంగానే ఉందనుకోవాలి. అంతర్జాతీయ విమానాశ్రాలు ఉండే హైదరాబాద్‌, ‌ముంబాయి, బెంగళూరు, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలు ఏపీలో లేకపోవటం కూడా కొరోనా ప్రభావం లేకపోవటానికి ఒక కారణం. విదేశాల నుంచి వచ్చే వారు ఎవరైనా ఈ పట్టణాల్లో దిగుతారు. అక్కడే పరీక్షలు అవుతున్నాయి, అనుమానం ఉంటే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఏపీకి ఎన్నికలు వాయిదా వేయటమే కాకుండా ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని చెప్పటం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యవహారమే. పథకాల అమలు, కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండదు. ఈ పరిణామం తర్వాత తేరుకున్న జగన్‌ ‌ప్రభుత్వం సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించింది వాయిదాను ఎత్తివేయాలని అభ్యర్థిస్తూ. ఉన్నత ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే, నిర్వహించే ఎన్నికల సంఘ అధికారం జోలికి వెళ్లకుండా ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని ఆదేశించింది. కనీసం ప్రభుత్వ పాలన ఆగకుండా చూసుకునే అవకాశం సీఎమ్‌ ‌జగన్‌కు లభించింది. ఉన్నంతలో కాస్త ఊరట అనుకోవాల్సిందే జగన్‌ ‌శిబిరం.

ప్రత్యర్థి వ్యూహాలను అంచనా వేయటంలో వైఫల్యం?

సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంలోనూ టీడీపీ వ్యూహాలను పసిగట్టడంలో విఫలమయ్యింది వైసీపీ. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును మండలిలో ప్రవేశపెట్టడానికే ప్రభుత్వం ఇబ్బంది పడటం చూశాం. చివరకు శాసనమండలి ఛైర్మన్‌ ‌నిబంధనలను నిస్సంకోచంగా పక్కన పెట్టి సబ్‌ ‌కమిటికి పంపిస్తూ నిర్ణయం తీసుకోగలిగారు. ఆ తర్వాత సీఎమ్‌ ‌జగన్‌ ఏకంగా మండలినే రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవటం వేరే అంశం. ఇప్పుడు కూడా ఎన్నికలను వాయిదా వేయించే టీడీపీ వ్యూహం, వేయగలిగే అవకాశం వారి చేతిలో ఉన్న అంశాన్ని జగన్‌ ‌శిబిరం ముందుగా పసిగట్టలేకపోయి ఉంటుంది అనే అనుకోవాల్సి వస్తుంది తాజా పరిణామాలను బట్టి. 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నా…ప్రతిపక్ష నేత మీట నొక్కగలిగారు అంటే సీఎమ్‌కు రాజకీయ చదరంగంలో ఇదొక పాఠం లాంటిదే. కేసు విచారణ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదని నిలదీసింది, ఎన్నికల కోడ్‌ను రద్దు చేసింది, పాలన స్థభించాలని కోరుకుంటున్నారా అని అడిగింది…వంటివి వైసీపీ నేతలు చెప్పుకోవటం చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లాంటివే. యుద్ధ క్షేత్రంలో ఉన్నప్పుడు యుద్ధ నీతిని పాటించాల్సిందే. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలంటే…చాణుక్యుని వ్యూహాలను ఎక్కుపెట్టాల్సిందే.

Leave a Reply