తెలంగాణలో తొలి కోవిడ్ టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోవిడ్ టీకాను తొలి దశలో భాగంగా 139 కేంద్రాలలో ఒక్కో సెంటర్లో 30 మందికి వేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ విడుదల చేసిన మీడియా ప్రకటనలో తెలంగాణకు బుధవారం 20 వేల కోవాగ్జిన్ డోసులు వచ్చినట్లు తెలిపారు. మొదటగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని గాంధీ హాస్పిటల్ నుంచి మంత్రి ఈటల ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కోవిడ్ వాక్సిన్ మొదట్లో ప్రభుత్వ హెల్త్‌కేర్ వర్కర్లకు, ఆ తరువాత ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 తరువాత రోజు టీకాల సంఖ్యను వరుసగా 50, ఆ తరువాత 100కు పెంచనున్నట్లు వివరించారు. అంచెలవారీగా వాక్సిన్ డోసులను పెంచుతామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది హెల్త్‌కేర్ వర్కర్లు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కోవిడ్ టీకా కోసం రాష్ట్రవ్యాప్తంగా 57 హాస్పిటల్స్‌లో ఐసీయూ పడకలను ఏర్పాటు చేశామన్నారు. టీకా ఇచ్చిన తరువాత ఖాళీ వ్యాక్సిన్ వాయిల్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బుధవారం నుంచే జిల్లాలకు కోఠి నుంచి వ్యాక్సిన్ తరలింపు పక్రియను ప్రారంభమైందనీ, హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు ఎస్కార్ట్ భద్రత మధ్య ఇన్సులేటర్ వాహనాలు తరలి వెళ్లాయని చెప్పారు. కోవాగ్జిన్ డోసులను క్లినికల్ ట్రాయల్స్‌లో భాగంగానే టీకా తీసుకునే వాళ్ల అనుమతి, సంతకం తీసుకున్నాకే వేయనున్నట్లు వెల్లడించారు.