Take a fresh look at your lifestyle.

ఆనందమయ జీవితానికి ఆర్థిక అక్షరాస్యతే పునాది..

మన విద్యా వ్యవస్థలో ఆర్థిక అక్షరాస్యత బోధనలకు చోటే లేదు. మొక్కై   వంగనిదే మానై వంగునా. లేత మనసులకు ఆర్థిక జ్ఞానాన్ని నేర్పే వెసులుబాటుకు తావే లేదు. ఆర్థిక క్రమశిక్షణను చిన్నతనం నుండే బోధించడంతో పెరిగి పెద్దవాడైనపుడు కుటుంబ పోషణలో స్థిరత్వం మరియు సంతోషాలను ప్రసాదించగలడని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మన విద్యా విధానం డిగ్రీలను, నైపుణ్యాలను అందిస్తూ యువతకు ఉద్యోగ ఉపాధులను చూపవచ్చు.

గత సంవత్సర కాలంగా కరోనా విధించిన లోక లాక్‌డౌన్‌, అ‌ప్రకటిత కర్ఫ్యూ లాంటి సామాజిక అనివార్యతల నడుమ ప్రజలు గడప దాటడం కష్టంగా మారింది. వ్యాపారాలు, వృత్తులు, ఉపాధులు, ఉద్యోగాలు, పనిపాటలు మూత పడ్డాయి. పేదలకు కనీస అవసరాలు అందని ద్రాక్షలే అయ్యాయి. బతకడం భారమైంది. ఆర్థికంగా చితికిన జీవులు బక్కచిక్కి పోయారు. రెక్కాడందే డొక్క నిండేదెలా అనే పశ్నకు సమాధానమే తెలియని దుస్థితిలో విశ్వ మనిషి సతమతం అవుతున్నాడు. పేద ధనిక వర్గాలు అనాలోచితంగా చేసే విచ్ఛలవిడి దినసరి ఖర్చుల పట్ల సరైన అవగాహన లేదు. నేటి ఆదాయం రేపటికి పునాది కావాలనే ఇంగితం కరువైంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించడంతో కుటుంబాల్లో అశాంతి రాజ్యమేలుతున్నది. పిల్లల నుండి పెద్దల వరకు ఆదాయ వ్యయాల పట్ల లోతైన అవగాహన లేదు. ఎంత సంపాదిస్తున్నావన్నది ముఖ్యం కాదని, ఎలా ఖర్చు చేస్తున్నామనేదే ప్రధానమని తెలియక సంకట స్థితుల్లోంచి బయట పడడం బహుకష్టంగా తోస్తున్నది.

ఆర్థిక క్రమశిక్షణ గూర్చి మనకు తెలియదు. మన విద్యా వ్యవస్థలో ఆర్థిక అక్షరాస్యత బోధనలకు చోటే లేదు. మొక్కై వంగనిదే మానై వంగునా. లేత మనసులకు ఆర్థిక జ్ఞానాన్ని నేర్పే వెసులుబాటుకు తావే లేదు. ఆర్థిక క్రమశిక్షణను చిన్నతనం నుండే బోధించడంతో పెరిగి పెద్దవాడైనపుడు కుటుంబ పోషణలో స్థిరత్వం మరియు సంతోషాలను ప్రసాదించగలడని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మన విద్యా విధానం డిగ్రీలను, నైపుణ్యాలను అందిస్తూ యువతకు ఉద్యోగ ఉపాధులను చూపవచ్చు. ఉద్యోగం పొందిన తరువాత లభించే పరిమిత వేతనంతో సంసారాన్ని సజావుగా నడపడం తెలియని యువ సంస్కృతిని మనం చూస్తున్నాం. ఉన్నపుడు ఎగిరి పడడం, లేనప్పుడు కుంగి పోవడం సాధారణం అయ్యింది. అప్పులు చేయడం, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం.

ప్రాధాన్యతలను మరిచి విచక్షణారహితంగా ఖర్చు చేయడం, కనీస అవసరాలకు మరియు విలాసాలకు మధ్య వ్యత్యాసం తెలియక పోవడం నేటి యువత జీవనశైలిలో భాగం అయ్యింది. మన పాఠశాలలు మరియు కళాశాలల్లో కంప్యూటర్‌ అక్షరాస్యత వలె ఆర్థిక అక్షరాస్యతను నేర్పించే ఏర్పాటు లేకపోవడం విచారకరం. నేటి ఆర్థిక స్థిరత్వమే రేపటి ఊహించని సమస్యలకు సమాధానమని తెలపాల్సిన అవసరం ఉంది. చాప ఉన్నంత వరకే కాళ్ళు చాపు కోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. డబ్బు ఉన్నపుడే రేపటి గూర్చి ప్రణాళికలు వేసుకోవాలి. ప్రమాదాలు చెప్పి రావు. అనారోగ్యాలు అడిగి చేరవు. కరోనాలు హెచ్చరించి ప్రవేషించవు. అనుకోని అసౌకర్యాలను అధిగమించడానికి నిన్న ఆదా చేసిన విత్తమే నేడు మనలను కాపాడుతుంది.

- Advertisement -

చిన్నపిల్లలు చిల్లర (పాకెట్‌ ‌మనీ) డబ్బులు దాచుకునే గళ్ళ గురిగి మనకు గుర్తుంది. పిల్లలకు డబ్బుల ప్రాధాన్యతల్ని, ఖర్చు చేసే విధానాన్ని, ఆదా చేయవలసిన అవసరాన్ని పాఠాలుగా మనసుకు ఎక్కించాలి. ఆదా చేయడానికి మరియు పిసినారితనానికి వ్యత్యాసం వివరించాలి. ఆదాయంలో కొంత సొమ్మును ఆదా చేయడం వల్ల వ్యక్తికి మరియు కుటుంబానికి రేపటి పట్ల భయం తొలగడం, ప్రతికూల సమయాల్లో బయట పడకలమే ధీమా కలిగి, గృహ భద్రత మరియు ఆరోగ్యకర వాతావరణం నెలకొంటాయని తెలుసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను పిల్లలకు తెలపడం మన కనీస బాధ్యతగా గుర్తించాలి. డబ్బును సక్రమంగా నిర్వహించడం వ్యక్తిగత అంశమని, మన అలవాట్లతో వ్యయానికి సంబంధం ఉంటుందని నేర్పించాలి. ప్రేమ పేరుతో తల్లితండ్రులు పిల్లలకు విచ్చలవిడిగా డబ్బును అందుబాటులో ఉంచితే, వారికి అనాలోచితంగా వృధా ఖర్చు చేయడం మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి అలవాటు కలిగిన పిల్లలు ఎదిగిన తరువాత కుటుంబాన్ని సజావుగా నిర్వహించడం కష్టం అవుతుంది. ఆదాయంలో కొంత సొమ్ము ఆదా చేయవలసిందే అని చిన్నతనం నుంచే నేర్పాలి. ఉద్యోగులు తమ వేతనాన్ని కుటుంబం గడవడానికి, పిల్లల విద్యకు వినియోగించాల్సిందే. ఉద్యోగంలో చేరిన రోజే పదవి విరమణ తేదీ నిశ్చయమైందని చాలా మంది మరిచి పోతారు.

నేటి ఆదాయం రేపటికి భరోసాను ఇవ్వాలి. మన వృత్తిలో ఎదుగుదల, వైవాహిక జీవితం, స్వంత ఇల్లు నిర్మించుకోవడం, అనుకోని ప్రమాదాలను ధైర్యంగా ఎదురుకోవడం, పిల్లలకు ఉన్నత ఉత్తమ విద్యను అందించడం, వాహనాల నిర్వహణ లాంటి అనేక అంశాలు ఆర్థిక అక్షరాస్యతపైననే ఆధారపడి ఉంటాయని మరువరాదు. చిరుప్రాయంలో అనుభవం మరియు విషయ పరిజ్ఞానం తక్కువగా ఉంటాయి. తెలియక పోవడం క్షంతవ్యం కాదని, తెలుకుకోవడం మన కనీస బాధ్యతని నేర్పించాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కుటుంబంలో అశాంతి, అనారోగ్యకర వాతావరణం, భవిష్యత్తు పట్ల అనిశ్చితి, ఇంట్లో గొడవలు, మానసిక ఒత్తడి, కుటుంబ పోషణలో ఇబ్బంది, పిల్లల పెంపకంలో అశ్రద్ధ లాంటి సమస్యలు అనునిత్యం వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యకర జీవన విధానానికి ఆర్థిక అక్షరాస్యతే పునాది కావాలి.

విద్యాలయాల్లో పాఠ్యాంశాలతో పాటు ఆనందకర ఆరోగ్యకర జీవనశైలి అంశాలైన మంచి అలవాట్లు, మానవీయ విలువలు, వ్యక్తిగత నైపుణ్యాలు, కంప్యూటర్‌ అక్షరాస్యత, ఆర్థిక క్రమశిక్షణలు లాంటి అంశాలను బోధించాలి. సకల విలువల విత్తులు నాటే క్షేత్రాలు తరగతి గదులే కావాలి. తల్లితండ్రులు సంతానానికి ఆస్తిపాస్తుల కన్న ప్రధానమైన పరిపూర్ణ జీవనశైలిని అందించే కృషి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బోధనలే రేపటి సంతోషాలకు కారణాలని మన పిల్లలకు నేర్పుదాం. నేటి ఆర్థిక అక్షరాస్యతే రేపటి కుటుంబ సభ్యుల ఆనందానికి పెట్టుబడి అని వివరిద్దాం. ఆకర్షణీయ జీవితాని• మరియు ఆనందమయ జీవితానికి వ్యత్యాసాన్ని నేర్పిద్దాం.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply