- పాఠశాలలు తెరిచే వరకూ కొనసాగిస్తాం
- మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్
రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఈనెల నుంచే ప్రభుత్వం సాయం అందించనుంది. ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయం అంశంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 1.45 లక్షల మంది ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్నారని అధికారులు మంత్రులకు వివరించారు. వారికి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నెలకు రూ. 2000 చొప్పున రూ. 4 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. దీంతో గుర్తింపు పొందిన పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ. 2000 ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా 25 కిలోల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందజేయాలనీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని మంత్రులు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పాఠశాలలను తాత్కాలికంగానే మూసివేశామనీ, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్రైవేటు టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలని నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండరాదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమనీ, వీరికి అందించే సాయం 45 రోజుల్లోనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన డాటాను ప్రభుత్వం త్వరలోనే తెప్పించుకుంటుందని చెప్పారు. ఈనెల 16 నుంచి 19లోగా వివరాల పరిశీలన, గుర్తింపు నిర్వహించి 20 నుంచి 24 మధ్య వారి అకౌంట్లలో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో బియ్యం నిల్వలు సిద్ధంగా ఉన్నాయనీ, ఈ పథకంలో అర్హులైన వారందరికీ బియ్యం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రులు సబితా, గంగుల వెల్లడించారు.