Take a fresh look at your lifestyle.

ఉపాధి ఊసులేని ఫీల్‌ ‌గుడ్‌ ఆర్థిక సర్వే

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే లో ఆశాజనకమైన అంశాలను పొందుపర్చారు. కేంద్ర బడ్జెట్‌ ‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీ, సోమవారం నాడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ ‌లోని ముఖ్యాంశాలను ఇందులో పొందు పర్చారు. ఇది సానుకూలమైన బడ్జెట్‌ అని ఆమె అన్నారు.ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనప్పుడు సానుకూల దృక్పథంతో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న మన పూర్వీకులు చూపిన మార్గంలోనే ఆర్థిక సర్వేను రూపొందించారు. వి షేప్‌ ‌రికవరీతో 2021-22లో 11 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేశారు. కొరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది.ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నిటి పరిస్థితీ అదే. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ మన కన్నా బాగా దెబ్బతింది.దానిని గాడిలో పెట్టడం కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ‌కు పెను సవాల్‌ ‌గా పరిణమించింది. ఎంత క్లిష్ట సమయంలోనైనా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తామన్న హామీతోనే ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌ ‌రూపకల్పన చేస్తుంది. మన దేశంలో పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ అధినేతలు లాక్‌ ‌డౌన్‌ ‌సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లో బాగా లబ్ధి పొందారు.

ఆర్థిక రంగంలో రారాజుగా పరిగణించబడే అంబానీ, ఆదానీల ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. తయారీ రంగం కొంత మేర దెబ్బతిన్నా, స్వల్పకాలంలో తిరిగి పుంజుకుంది.ఎటొచ్చీ కోలుకోని రంగం వ్యవసాయమే. అందుకే రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రెండు మాసాలుగా ఆందోళన సాగిస్తున్నారు. ఏ అంశంపై చర్చ మొదలైనా అది వ్యవసాయం వైపే దారితీస్తుందన్న వ్యాఖ్యల్లో అసత్యం లేదు. వ్యవసాయం లేనిదే దేశ ఆర్థిక పరిస్థితి లేదు. అయితే స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 15.74 శాతం మాత్రమే. సేవారంగం 54.77 శాతం ఉంది. అంటే ఉత్పత్తుల కన్నా సేవారంగానికే మన దేశంలో ప్రాధాన్యత లభిస్తోంది. తయారీరంగం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో వృద్ధి రేటు పెరిగితేనే దేశం ఆర్థికంగా పుంజుకున్నట్టు.ఈ కోణంలో ఆలోచిస్తే మన దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే పారిశ్రామిక,కార్పొరేట్‌ ‌సంస్థలు పారిశ్రామిక, తయారీ రంగాల్లో వృద్ది రేటును పెంచేందుకు ప్రయత్నించకుండా, సేవారంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు ఉత్పత్తి, తయారీ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వకపోతే మానవ మనుగడే దుర్లభం అవుతుంది.

ప్రస్తుత వ్యవస్థలో తిండి కన్నా వినోదానికీ, సెల్‌ ‌ఫోన్‌ ‌ల వినియోగానికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కష్టించి పని చేసే తత్వాన్ని పాలకులు ఒక్కరోజులో కాకుండా, కొన్ని సంవత్సరాలుగా దిగజార్చారు. దీని వల్ల కొత్త తరాల్లో సులభంగా ధనాన్ని సంపాదించే మార్గాలను అన్వేషించే ధోరణి పెరిగిపోతోంది. తయారీ రంగంలో వృద్ధి 15 శాతం మాత్రమే ఉంది. తయారీ రంగాన్ని మెరుగు పర్చడానికి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే మేక్‌ ఇన్‌ ఇం‌డియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.అయితే, మేక్‌ ఇన్‌ ఇం‌డియా కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ సంస్థలే సాగిసాగిస్తున్నాయి. ప్రైవేటు లేదా కార్పొరేట్‌ ‌సంస్థలు విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. చైనా తో భాగస్వామ్యానికి మన దేశంలోని పారిశ్రామిక సంస్థలు కొరోనా ముందు వరకూ చాలా పోటీ పడ్డాయి. కొరోనా వారి పరుగునకు బ్రేక్‌ ‌వేసింది. చైనా నుంచే కరోనా వ్యాపించడం వల్ల ఆ సంస్థలతో భాగస్వామ్యానికి ఇప్పుడు మన పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపడం లేదు. అయితే, చైనా నుంచి ఖాళీ చేసిన బహుళ జాతి సంస్థలను మనవైపు ఆకర్షించడంలో కూడా మన ప్రభుత్వం తగిన కసరత్తు చేయలేదు. ప్రధానమంత్రి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న నినాదం మంచిదే కానీ, తగిన వనరులు లేనిదే స్వదేశీ ఉత్పత్తులు పెరిగే అవకాశాలు లేవు. అయితే, వచ్చే సంవత్సరం బడ్జెట్‌ ‌లో మానవీయ కోణంలో కేటాయింపులు జరపనున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారు.

ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందనీ, లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో ప్రకటించిన ప్యాకేజీలు, తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల లక్ష మంది ప్రాణాలను కాపాడగలిగామని ఆయన చెప్పారు. ఆర్థికంగా నష్టపోతే తిరిగి కోలుకోవచ్చు. ప్రజల ప్రాణాలు పోతే తిరిగి వారిని బతికించలేం అనే సూత్రం ఆదారంగా బడ్డెట్‌ ‌కేటాయింపులు చేస్తున్నట్టు చెప్పారు. కోవిడ్‌-19 ‌సమయంలో హాస్పిటల్స్ ‌ల్ల్లో సౌకర్యాలు లేకపోవడం వైద్య,ఆరోగ్య రంగాల పట్ల మన నిర్లిప్త తన బహిర్గతం చేశాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని వచ్చే బడ్జట్‌ ‌లో వైద్య,ఆరోగ్య రంగాలకు ఎక్కువ కేటాయింపులు జరపాలని ఆర్థిక సర్వే సూచించింది. కోవిడ్‌ ‌సమయంలో వ్యవసాయ రంగం సానుకూల వృద్ధిని నమోదు చేసిందనీ, పారిశ్రామిక రంగం బాగా దెబ్బతిందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల వల్ల రైతుల ఆదాయం కాలక్రమంలో పెరుగుతుందనీ, దీనిపై నిరాశ చెందరాదనీ,అనుమానాలు పెట్టుకోరాదని సర్వే విజ్ఞప్తి చేసింది.అయితే, కార్పొరేట్‌ ‌రంగం ప్రమేయం గురించి ప్రస్తావన చేయలేదు. వ్యవసాయ సంస్కరణలపై రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను తీర్చే ప్రయత్నం చేయలేదు. గృహ నిర్మాణం రంగం పుంజుకుందనీ,రానున్న కాలంలో మరింతగా పుంజుకోగలదని చెప్పింది.అయితే, వ్యవస్థీకృత రంగంలో లేని కార్మికుల ఉపాధి గురించి ప్రస్తావన చేయలేదు. అదే ముఖ్యం. అసంఘటిత రంగ కార్మికులే ఉపాధి కోసం వలసలు పట్టి ప్రభుత్వాలకు సవాల్‌ ‌గా నిలిచారు. వలస కార్మికులకు చేయదగిన కార్యక్రమాల గురించి కూడా ఆర్థిక సర్వేలో ప్రస్తావించలేదు. ఉపాధి ఊసులేకుండా ప్రభుత్వ అనుకూల ధోరణిలో రూపొందించిన సర్వేగానే కనిపిస్తోంది.

Leave a Reply