Take a fresh look at your lifestyle.

అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్‌లో మల్లగుల్లాలు

జాతీయ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నూటా ముప్పై ఏళ్ళ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కు కేంద్రంలో నాయకత్వ లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. దాదాపు 2019 నుండి ఆ పార్టీ పూర్తి స్థాయి నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నది. అనారోగ్యంగా ఉన్నా సోనియాగాంధీయే పార్టీ తాత్కాలిక అధినేతగా నెట్టుకొస్తున్నది. అయితే పేరుకే సోనియాగాంధీ అధినేతగా వ్యవహరిస్తున్న ఆమె చుట్టూ ఉన్న కొందరు నాయకుల ఆలోచనల మేరకే పార్టీ నిర్ణయాలు ఉంటున్నాయని, అవి పార్టీ భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నాయన్నది ఆ పార్టీలోని కొందరి సీనియర్ల అభిప్రాయం.

 

గతంలో ఒకసారి రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ అర్థాంతరంగంగానే కాడి వదిలేయడంతో పార్టీ ఇప్పుడు నావికుడులేని నావగా తయారయిందని ఆ పార్టీ నేతలు పలువురు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్న పార్టీకి దశ, దిశ చూపించే సమర్థతగల నాయకుడెవరన్న విషయంలో గత కొంతకాలంగా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. రాహుల్‌ ఎప్పుడైతే పార్టీ సారథ్యంపై అయిష్టత కనబర్చాడో చాలా మందికి మళ్ళీ అదే గాంధీ కుటుంబానికి చెందిన ప్రియంకా వాద్రాపై అశలు పెంచుకున్నారు. చూడడానికి ఇందిరాగాంధీలాగా ఉండడమే కాకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయే తత్వం ఉన్న ఆమెకు నాయకత్వం ఇచ్చినా ఫరవాలేదన్నట్లుగా పార్టీ వర్గాలు కొందరు మొగ్గుచూపారు. కాని, తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె మీద ఉన్న ఆశలు కూడా అడియాశలే అయినాయి.

 

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లే రాహుల్‌, ‌ప్రియాంక తిరిగి ప్రచారం చేశారు. కాని ఏమైంది. కనీసం రెండు అంకెల స్థానాలను కూడా సాధించలేకపోయారు. కేవలం రెండు స్థానాలతో సరిపుచ్చుకున్నారు. ఆమె చరిష్మగాని, గాంధీ కుటుంబ నేపథ్యంగాని అక్కడ పనిచేయలేదు.
ఇక అధికారంలో ఉన్న పంజాబ్‌ను చేతులారా జారవిడుచుకుంది కాంగ్రెస్‌ ‌పార్టీ. అక్కడ 117 స్థానాలకు పోటీచేస్తే అధికారంలో ఉండి కూడా కేవలం పద్దెనిమిది స్థానాలను మాత్రమే పొందింది. పైగా ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో చిత్తుగా ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. ఇక మిగతా మూడు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. మణిపూర్‌లో నైతే అరవై స్థానాలకుగాను అయిదు స్థానాల్లో, గోవాలో నలభై స్థానాలకు గాను 11, ఉత్తరాఖండ్‌లో డెబ్బై స్థానాలకుగాను పందొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలువగలిగింది. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్‌ ‌పార్టీ కన్నా పురాతన పార్టీ అంటూ ఏదీలేదు. అయినా ఇటీవల కాలంలో వరుస ఓటములను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు నాయకత్వ లోపమేనంటున్నారు సీనియర్లు. దాదాపు గడచిన రెండేళ్ళుగా వారు బాహాటంగానే పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలని సూచిస్తున్నారు.

 

పార్టీ పతనావస్థకు చేరుకుంటున్న తీరుపై ఆవేదన చెందుతున్న పలువురు, పార్టీ సీనియర్‌ ‌నేత గులాం నబీ ఆజాద్‌ ‌సారథ్యంలో గత కొంతకాలంగా పలుమార్లు సమావేశమవుతూ తమ అభిప్రాయాలను అధిష్టానానికి విన్నవిస్తూనే ఉన్నారు. గత సంవత్సరం ఓ లేఖ ద్వారా సోనియా గాంధీకి విషయాలను వివరించే ప్రయత్నం కూడా చేశారు. అలా అభిప్రాయాలు వెలుబుచ్చిన వారంతా ఒక 23 మంది వరకు ఉండడంతో బారికి జి 23 సభ్యులుగా నామకరణం చేశారు. సోనియాగాంధీకి లేఖ ఇచ్చి దాదాపు సంవత్సరకాలం అవుతున్నా ఇంతవరకు ఆ విషయంలో తీసుకున్న చర్యలేవీలేవు. అలా అని పార్టీ ప్రతిష్ట ఏమన్నా పెరిగిందా అంటే అంతకంతకు దిగజారుతూ వొస్తున్నది. అందుకే తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఫలితాల తర్వాత తమ భవిష్యత్‌ ఏమిటని జి 23 సభ్యులంతా మరోసారి సమావేశమైనారు. అయిదు రాష్ట్రాల ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటి ఉన్నత స్థాయి సమావేశం జరుగడానికి ఒక రోజు ముందే వీరి సమావేశం జరిగింది.  ఇటీవల కాలంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగాల్సి ఉన్నాయి. ఈ సందర్భంలోనైనా పార్టీకి పటిష్టమైన, సమర్థవంతమైన నాయకత్వానికి అప్పగించడం ద్వారా పూర్వ వైభావాన్ని తీసుకు రావాలన్న వారి తీర్మానాన్ని సిడబ్ల్యుసి సమావేశంలో వెలుబుచ్చినట్లు తెలుస్తున్నది.

 

అయితే పార్టీలోని మరికొందరు నేతలు నాయకత్వం గాంధీ వారసత్వంలోనే ఉండాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తున్నది. సమావేశం జరుగుతున్న సమయంలో దిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు వేలదిమంది పార్టీ కార్యాలయానికి చేరుకుని రాహుల్‌గాంధీ, ప్రియాంక పేర్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలున్నట్లు వ్యక్తమవుతున్నది. పార్టీ నాయకత్వంలో మార్పు కోరుతున్న జి 23 సభ్యులు పార్టీ సీనియర్‌ ‌నాయకుడు ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌పేరును సూచించినట్లు తెలుస్తున్నది. గాంధీ అనుకూల వర్గం వారి సూచనలను పరిగణనలోకి తీసుకోని పక్షంలో నాయకత్వంపై అయిష్టతను వ్యక్తం చేస్తున్న వారి పరిస్థితేమిటన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చనాయాంశంగా మారింది.

Leave a Reply