Take a fresh look at your lifestyle.

‌ప్రజాస్వామిక, సమగ్ర తెలంగాణ కోసం పోరాడాలి

  • మేథా పాట్కర్‌, ‌ప్రొ.నాగేశ్వర్‌, ‌ప్రొ.పద్మజా షా పిలుపు
  • రాజకీయ పార్టీల నేతలకు తెలంగాణ ప్రజా అసెంబ్లీ సమావేశాల తీర్మానాలు

‌ప్రజాస్వామిక, సమగ్ర తెలంగాణ కోసం ప్రజాస్వామిక వాదులు, సామాజిక హక్కుల కార్యకర్తలు, మేధావులు పోరాడాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త మేధా పాట్కర్‌, ‌ప్రముఖ విద్యా వేత్తలు ప్రొ.కె.నాగేశ్వర్‌, ‌ప్రొ.పద్మజా షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొరోనా పరిస్థితుల నేపథ్యంలో కార్మిక, కర్షక, అసంఘటిత రంగాల, వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి తక్షణ పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం లక్ష్యంగా నిర్వహించిన తెలంగాణ ప్రజా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా మేథా పాట్కర్‌ ‌మాట్లాడుతూ రైతు వ్యతిరేక 3 ఆర్డినెన్సులను వ్యతిరేకించాలనీ, లాక్‌డౌన్‌ ‌కారణంగా ప్రభావితమైన వారి జీవనోపాధులను సంరక్షించాలనీ, పౌర హక్కులను కాలరాయడం మానాలని తెలంగాణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ప్రతీ కార్మికునికి రూ. 10 వేలు ఆర్థిక సాయం కింద అందజేయాలనీ, ప్రభుత్వం నిధుల కొరతను సాకుగా చూపి తప్పించుకోవద్దని సూచించారు. పీఎం కేర్స్, ‌భవనాలు, నిర్మాణాల చట్టం కింద వసూలు చేసిన అందుబాటులో ఉన్న సెస్‌ ‌నిధులను ఆర్థిక సాయంగా అందజేయాలని పేర్కొన్నారు. ప్రజా అసెంబ్లీలో చేసిన తీర్మానాలన్నింటిపై రాజకీయ అసెంబ్లీలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రొ.పద్మజా షా మాట్లాడుతూ తెలంగాణలో అసెంబ్లీ ఒక వేలం పాట లాగా తయారైందనీ, ప్రజలే వారి రాజకీయ ప్రతినిధులు జవాబుదారీగా ఉండేలా వొత్తిడి తీసుకు రావాలని సూచించారు. ప్రొ.నాగేశ్వర్‌ ‌మాట్లాడుతూ కోవిడ్‌ ‌కారణంగా ఏర్పడ్డ విపత్తును ప్రభుత్వం ఆసరాగా చేసుకుని పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు.

జీవనోపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు సామాజిక భద్రతతో పాటు ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్ట పరిచడం కోసం ప్రభుత్వంపై వొత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక హక్కులు, పాలన వ్యవస్థల జవాబుదారితనం సవాళ్లు అంశంపై జరిగిన సెషన్‌లో హెచ్‌ఆర్‌ఎఫ్‌ ‌నుంచి సామాజిక కార్యకర్త జీవన్‌ ‌కుమార్‌, ‌పీవోడబ్ల్యు నుంచి సంధ్య మాట్లాడుతూ దేశం ప్రస్తుతం రాజ్యాంగ హక్కులపై కనీవినీ ఎరుగని రీతిలో ఫాసిస్టు దాడులను ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసిందనీ, ప్రజాస్వామ్య హక్కులు, ఉద్యమాలపై నిరంతరం ఉక్కు పాదం మోపుతోందని విమర్శించారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ ‌వ్యక్తులు, ఆదివాసీలు, దళితులు, మతపరమైన మైనార్టీల అంశంపై సామాజిక హక్కులు కార్యకర్తలు సజయ, మీరా నిర్వహించిన సమావేశంలో వికలాంగులు, బాలల హక్కులు, సంచారజాతి, అనురక్షిత తెగలు, నిరాశ్రయ వ్యక్తులు వంటి అంశాలపై అనేక మంది వక్తలు ప్రసంగించారు. ఈ సమావేశంలో విమల మోర్తాల ప్రసంగిస్తూ అన్ని రంగాలలో జెండర్‌ ‌బడ్జెటింగ్‌, ‌జెండర్‌ ఇం‌క్లూషన్‌ ఆవశ్యకతలను వివరించారు. కాగా, తెలంగాణ ప్రజా అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన వివిధ అంశాలపై ఆమోదించిన తీర్మానాలను అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు డిమాండ్ల రూపంలో సమర్పించి శాసనసభ సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కోరినట్లు నిర్వాహకులు కిరణ్‌కుమార్‌ ‌విస్సా, రవి కన్నెగంటి, కె.సజయ తెలిపారు.

Leave a Reply