Take a fresh look at your lifestyle.

దుబ్బాక బై ఎలక్షన్‌లో.. ఫీల్డ్ అసిస్టెంట్లు..?

ఇప్పటికే కుమ్ములాటలు, అసంతృప్తులతో కొట్టుమిట్టాడుతున్న గు‘లాబీ’
తాజాగా..బరిలోకి ఫీల్డ్ అసిస్టెంట్లు
టిఆర్‌ఎస్‌కు కంట్లో నలుసులా..?
ప్రభుత్వ వైఖరికి నిరసనగా…
తొలుత భారీ బహిరంగ సభ…అప్పటికీ సర్కార్‌ ‌స్పందించుకుంటే…
బై ఎలక్షన్‌లో 500 మంది దళిత ఎఫ్‌ఏలు నామినేషన్లకు సమాయత్తం?

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక గురించి ఉమ్మడి మెదక్‌ ‌జిల్లానే కాకుండా యావత్‌ ‌రాష్ట్రం ఇటు వైపు ఆసక్తిగా చూస్తోంది. అందరూ దుబ్బాక బై ఎలక్షన్‌ ‌గురంచి చర్చించుకు ంటున్నారు. మాట్లాడుకుంటున్నారు. దుబ్బాక బై ఎలక్షన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలోని మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఫథకం(ఎంజిఎన్‌ఆర్‌ ఈజిఎస్‌)‌లో క్షేత్ర స్థాయిలో పని చేసే సహాయకు(ఎఫ్‌ఏ)‌లు వారికి జరిగిన అన్యాయమై గళమెత్తడంతో పాటు ఈ బై ఎలక్షన్‌ ‌బరిలో ఉండటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు ఏడున్నర వేల మంది ఎఫ్‌ఏలు, వారి కుటుంబాలు కలిసి దుబ్బాక నియోజక వర్గంలోని గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నారనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు సోమ వారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. వివరాల్లోకి వెళ్లితే…ఈజీఎస్‌లో 2006 నుంచి పని చేస్తున్న7,500మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్న ఫలంగా పని(ఉద్యోగం) నుంచి పంచాయితీ రాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి శాఖ ఫీల్డ్ అసిస్టెంట్లపై తాత్కాలిక సస్పెన్షన్‌ ‌చేస్తూ గత ఫిబ్రవరి నెలలో ఉత్తర్వులను జారీ చేసింది. సుమారు 15యేం డ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా… గ్రామాలలో నిత్యం కూలీలకు అందుబాటులో ఉంటూ ఉపాధి హామీ పనులనే కాకుండా గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ కార్యాక్రమాలలోనూ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. కేవలం ఈ ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరి పట్ల ఏమాత్రం దయ, కనికరం, మానవత్వం కూడా చూపెట్టకుండా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్క్యులర్‌ ‌నెంబర్‌:4779/2020‌ని జారీ చేయడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లందరూ రోడ్డెక్కారు.

ఉన్నఫలంగా పని(ఉద్యోగం) నుంచి తీసేయడం వల్ల తమతో పాటు తమపై ఆధారపడిన కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయనీ, తమపై కనికరం చూపాలంటూ రాష్ట్ర ఫీల్డ్ అసిసెంట్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఆందోళన చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు గత మార్చిలో సమ్మెకు దిగారు. సమ్మె ఫలితంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యను పరిష్కరిస్తాననీ, సిఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాననీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మార్చి 23న హామీ ఇవ్వడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఆందోళనను విరమించుకున్నారు. అంతేకాకుండా, సిఎం కేసీఆర్‌ ‌విధానాలను క్రమశిక్షణతో అమలు చేయడానికి కృషి చేస్తామనీ, కేసీఆర్‌ ‌కలలుకంటున్న బంగారు తెలంగాణకు మేము త్పోడుతామనీ గతంలో జరిగిన పొరపాట్లను భవిష్యత్‌లో జరగకుండా చూసుకుంటామనీ ప్రభుత్వానికి కూడా విన్నవించకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ల తాత్కాలిక సస్పెన్షన్‌ ఉత్తర్వులను ఎత్తివేయలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోకపోవడంతో…గత కొన్ని నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు కొరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌…‌మరో వైపు పని(ఉద్యోగం)లేక, వేతనాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్య పరిష్కారానికి ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసిన ప్రతి ఒక్కరికీ వినతి పత్రం సమర్పించడం…తమల్ని తిరిగి పనిలోకి తీసుకోవాలంటూ చేసిన ఏ ఒక్క విజ్ఞప్తి, వేడుకోళ్లు ఇసుమంత కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సమస్యను నేరుగా సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి ముఖ్యంగా తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతోనే రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్‌ ‌ప్రతినిధులు ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తమ సమస్యను పరిష్కరించడానికి త్వరలో జరగనున్న దుబ్బాక బై ఎలక్షన్‌ను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేన్‌ ‌ప్రతినిధులు నిమగ్నమై ఉన్నారనీ తెలుస్తుంది.

ఇదీ వారి వాదన..
ప్రభుత్వం ఉపాధి హామీ పనికి ప్రజలు రావడం లేదని పని దినాల సంఖ్య తక్కువ ఉందనే కారణంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ 4779సర్క్యులర్‌ ‌విడదల చేసిందని ఇది సరైన విధానం కాదనేది ఫీల్డ్ అసిస్టెంట్ల వాదన. చట్టబద్ధంగా కార్మికులు సమ్మె చేస్తుంటే కలంపోటుతో తొలగిస్తున్నట్లు పంచాయతీ సెక్రెటరీ ద్వారా తొలగింపు పత్రాలను ఇవ్వడం జరిగిందని ఇదేనా ప్రభుత్వం చేసే న్యాయమని ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా చేస్తున్న సమ్మెను పరిష్కరించాల్సింది పోయి కక్షసాధింపు చర్యలకు భయాందోళనకు ఫీల్డ్ అసిస్టెంట్లను గురి చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే సర్క్యులర్‌ ‌రద్దు చేయాలనీ, కనీస వేతనం 21,000 రూపాయలు, ఆరోగ్య బీమా సౌకర్యం, నెల నెలా వేతనాలు ఉపాధి హమీ కార్మికుల డబ్బులు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

తొలుత భారీ బహిరంగ సభ….ప్రచారం…
ప్రాణ త్యాగాలు చేసి, పోరాడి, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమనీ, ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 7500మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయనీ, తమకు జరిగిన అన్యాయంపై సర్కార్‌కు తెలిసి వచ్చేలా చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమనీ ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులు అంటున్నారు. తమ సమస్యను ప్రభుత్వాధినేత కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లడానికి గానూ తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7వేల 500మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో దుబ్బాకలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తమల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలనీ ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. అప్పటికీ సర్కార్‌ ‌దిగిరాకపోతే.. మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముందుగా దుబ్బాక నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు 145 మందితో పాటు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని 355 మంది దళిత ఫీల్డ్ అసిస్టెంట్లతో మొత్తంగా 500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో దుబ్బాక బై ఎలక్షన్‌లో నిలబడటానికి నామినేషన్‌ ‌వేయాలని నిర్ణయించినట్లు సిద్ధిపేట జిల్లా బాధ్యుడు గజిబింకార్‌ ‌శ్రీనివాస్‌ ‌తెలిపారు.

ఐదొందల మంది నామినేషన్లు…?
తెలంగాణ కోసం పోరాడిన కుటుంబాలకు చంద్రశేఖర్‌రావు అండగా ఉంటారనుకున్న వారికి నిరాశే ఎదురు కావడంతో…ఈ ఉప ఎన్నికలో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు 500మంది నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారనీ సమాచారం. వీరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7500మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబ సభ్యులు దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారాన్ని నిర్వహించాలని కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నామనీ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల సమస్యలను తెలంగాణ ప్రజల నోటీసుకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నామనీ, మేము ఈ కుటుంబాల నుండి 500 మందికి నామినేషన్లు దాఖలు చేస్తున్నామన్నామనీ తెలిపారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు 500మంది వరకు అభ్యర్థులు నామినేషన్‌ ‌వేయాలని నిర్ణయించుకోవడం…వీరికి మద్దతుగా 7500కుటుంబాలు ప్రచారం చేయాలని కూడా నిర్ణయించుకోవడంతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కంట్లో నలుసుగా మారే ప్రమాదం లేకపోలేదనీ తెలుస్తుంది. ఇప్పటికీ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తుల తీరుతో ఆ పార్టీ పెద్దలకు వానకాలంలో ముచ్చమటలు పట్టిస్తుండగా…తాజాగా ఫీల్డ్ అసిస్టెంట్లు 500మంది వరకు నామినేషన్లు వేయాలని నిర్ణయించుకోవడం వీరికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7500మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు తోడుగా వారి కుటుంబ సభ్యులు కలిసి ప్రచారానికి వచ్చేందుకు సమాయత్తమవుతుండటంతో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురు కావచ్చనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి!.

Leave a Reply