Take a fresh look at your lifestyle.

ఆరుతడి పంటలు పండించండి .. లాభాలు పొందండి విఠలాపూర్‌ ‌రైతులతో మంత్రి హరీష్‌రావు

మీ ఊర్లో ఏం కూరగాయలు పండిస్తున్నారు.? నీళ్లు వచ్చాయి కదా., ఇక నుంచి ఆరుతడి పంటలు పండించి లాభాలు పొందాలని, వరి పంటలు వేయొద్దని విఠలాపూర్‌ ‌గ్రామ మహిళా రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌కోరారు.సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్‌ ‌మండలం విఠలాపూర్‌ ‌గ్రామ శివారు ప్రధాన ఎడమ కాలువ సమీపంలో సోమవారం ఉదయం ఆరుతడి పంటలు పండించే రైతు పొలం వద్ద మహిళా రైతులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇంత కష్టపడి.. గింత దూరం మీ కోసం నీళ్లు తెస్తే., తీరా మీరు వరి పంటలు వేస్తే ఏం లాభమని, కూరగాయల పంటలు పండించాలని, వాటి వల్ల వచ్చే లాభాలను సవివరంగా వివరిస్తూ..  రైతులకు చక్కగా అవగాహన కల్పించారు. రంగనాయక సాగరులోకి నీళ్లు వచ్చి, కుంటల్లో, బావుల్లో చెంబుతో నీళ్లు ముంచుకునే పరిస్థితి వచ్చిందని., ఇక ఇప్పుడు ఏం పంటలు వేస్తారని., రైతులను మంత్రి ఆరా తీస్తూ..వంగలేనోళ్లు వరి పంటలేస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. విఠలాపూర్‌ ‌గ్రామ రైతు శంకరయ్య పొలంలో కూర్చుని మహిళా రైతులతో ముచ్చటిస్తూనే., ఏం శంకరయ్య ఏం పంటలు వేశావంటూ.. ఏ మేర లాభాలు వచ్చాయని.. ఆరా తీయగా పత్తి పంట వేస్తే లక్ష లాభం వచ్చిందని, మిర్చి, కీరదోస తదితర పంటలు వేసినట్లు అనుకున్న స్థాయిలో లాభం వచ్చిందని, వరి పంటలు వేస్తే ఏం లాభం లేదంటూ.. తన అనుభవాన్ని మంత్రికి వివరించారు.

అందరూ నీ మాదిరిగా ముందు ఆలోచన చేస్తే అనుకున్న లాభాలు వస్తాయని గ్రామ యువ రైతులు శంకరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ విషయమై గ్రామస్తులు మాకు ఇంకా ఉపాధి పనుల వేతన చెల్లింపులు రాలేదని., 2 వారాల ఈజీఎస్‌ ‌పైసలు ఇప్పించాలని మంత్రికి మొర పెట్టుకున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ గోపాల్‌ ‌రావుతో ఫోన్‌ ‌లైనులో మంత్రి మాట్లాడుతూ.. రూ.1.90కోట్లు ఇటీవల విడుదల చేయించినట్లు, వీటిలో రెండు రకాల చెల్లింపులు ఉన్నాయని, ఆ పెండింగులో ఉన్న చెల్లింపులు ఇవ్వాలని అధికారిక వర్గాలను ఆదేశించారు. ప్రతి రోజూ 4, 5 గ్రామాల్లో తప్పనిసరిగా తిరగాలని ఏంపీడీఓకు ఆదేశించారు. రెండు రోజుల్లో ఈజీఎస్‌ ‌పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తానని నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

– పిల్ల కాల్వ పనులు ప్రారంభించిన మంత్రి హరీష్‌

‌చిన్నకోడూర్‌ ‌మండలం చందలాపూర్‌ ‌ప్రధాన ఎడమ కాలువ నుంచి పిల్ల కాలువ తీయడం ద్వారా చిన్నకోడూర్‌, ‌బెల్లంకుంట, పెద్ద చెరువు నిండనున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా చందలాపూర్‌ ‌ప్రధాన ఎడమ కాలువ కింద సోమవారం ఉదయం పిల్ల కాల్వ తీసేందుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాలువ వెంట మంత్రి కలియ తిరిగారు. మంత్రి వెంట చిన్నకోడూర్‌ ‌మండల ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

Leave a Reply