- సరిహద్దు జిల్లాల్లో శాస్త్రీయ అధ్యయనం
- 13 కల్ల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి
- వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి
- వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలి
- వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలో సిఎం కెసిఆర్ ఆదేశం
కొరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో వైరస్ ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన సరిహద్దు జిల్లాల్లో కొరోనా ప్రభావం పూర్తిగా సమసిపోలేదన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి, వైరస్ విస్తరణకు గల కారణాలను ‘క్రిటికల్ అనాలిసిస్’ చేయాలన్నారు. అందుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కొరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించి రావాలన్నారు.
నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరి ఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. పర్యటన అనంతరం నివేదికను సిద్ధం చేసి కేబినెట్‌కు సమర్పించాలన్నారు. జిల్లాల్లో కొరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పర్యటన సందర్భంగా విశ్లేషించాలన్నారు. కొరోనా నియంత్రణకోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలన్నారు. ఇందుకుగాను స్థానిక జిల్లా కలెక్టర్లను, డిపివోలు, మున్సిపల్ కమిషనర్, డిఎంహెచ్ ఓ దవాఖానా సూపరిండెంట్ లతో సహా సంబంధిత స్థానిక అధికారులను సమావేశ పరిచి అప్రమత్తం చేయాలన్నారు. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రగతిభవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొరోనా వ్యాప్తికి సరియైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. కొరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తున్నది. దాన్ని కట్టడి చేయాలన్నా, ముందస్తుగా నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైంది. ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వొస్తదో, ఎంత వరకు విస్తరిస్తదో తెలియట్లేదు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అయితది. కొరోనా రోగ కారణం దాని లక్షణం మొత్తంగా కొరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి వున్నది. కొరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరమున్నది. కొరోనా నియంత్రణకోసం నూతన మార్గాలను అనుసరించాలె. కొత్త వేరియంట్ల పేరుతో వేవ్‌ల రూపంలో వొస్తున్న దశలవారీ కొరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రజలను కొరోనా భారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలె.’’ అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొరోనా నియంత్రణలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పనితీరు ఎట్లా వున్నది? మందులు ఇంజక్షన్ల లభ్యత సక్రమంగా వున్నదా? సకాలంలో సరఫరా అవుతున్నవా? బెడ్లు ఆక్సీజన్ అందుబాటులో ఉన్నవా? అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. రాష్ట్రం ఇప్పటికే అమలు చేసిన జ్వర సర్వే ద్వారా కొరోనాను ముందస్తుగా కట్టడిచేయడంలో సఫలీకృతమయ్యామన్నారు.
ఇప్పటికే నిర్వహించి సత్ఫలితాలను రాబట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే కార్యక్రమాన్ని కొరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కొరోనా మరో వేవ్ వొస్తుందంటూ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా వుండాలని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కొరోనా స్థితిగతులను, నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలన్నారు. నియంత్రణ కోసం చేయదగ్గ పని ఏమిటో గుర్తించడంలో వైద్యశాఖ అధికారులు కసరత్తు చేసి సఫలీకృతం కావాలని సీఎం అన్నారు.
ప్రజల్లో తప్పనిసరిగా మాస్కులను ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొరోనా కట్టడికోసం ప్రభుత్వంతో కలిసిరావాలని, స్వీయ నియంత్రణను పాటిస్తూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్య పరిస్థితుల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తద్వారా కూడా కొరోనా కట్టడి చేయగలిగామని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి, కొరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, సీఎం ఓఎస్డీ తాడూరి గంగాధర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ కట్టా చంద్రశేఖర్ రెడ్డి, వైద్యవిద్యా సంచాలకులు కె. రమేశ్ రెడ్డి, హెల్త్ డైరక్టర్ జి. శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ విసీ బి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలి
వరంగల్ పట్టణాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానా ఏర్పాటుకు సంబంధించిన చర్యల గురించి సీఎం ఆరాతీసారు. నూతన దవాఖానను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం ద్వారా తూర్పు తెలంగాణ మొత్తం వైద్యసేవలకు వరంగల్లుకు తరలేలా ఉండాలన్నారు. అన్ని విభాగాలతో కూడిన సమీకృత భవన సముదాయంగా నూతన దవాఖానా నిర్మాణం వుండాలని సీఎం అన్నారు.