పండుగంటే
జేబులో ఖర్చులకు కాసిన్ని కాసులుండి
అరమరికలు లేని మనుషుల సన్నిధిలో
ఉన్నదాంట్లోనే అన్నాన్ని అనుభూతులను పంచుకుని
కష్టసుఖాల కలబోతగా కాలప్రవాహంలో
కదిలి వచ్చిన ఆనంద జలపాతం.
ఇది క్షణికమైన
అనాదిగా ముసురుకుంటున్న సంక్షో భాలతో
మనాదిలో నున్న మనిషి మస్తిష్కాన్ని మధించి
మనసును ఉల్లాసంతో ఊగించే
ఉత్ప్రేరికం కావాలి కదా
కాని
సమాంతర రేఖల్లా సాగుతున్న భిన్న సమూహాలలో
అసమ సమాజం అల్లిన దుష్టత్వాల మధ్య
అణగారిన వ్యధాభరిత జీవితాల ఆక్రందన
ఏ కుసుమ కోమల హృదయాన్ని స్పృశించగలదు
ఎండమావులకెదురేగుతూ
ఎండిన నోరుకు దాహం తీర్చే
నీటి చెలిమెకై వెంపర్లాడే వేదనా భరిత బతుకుల హృదయ స్పందన ఏ రాతి గుండెను కదిలించగలదు
అరచేతిలో గీతలు మీ ఆయుష్షు ను అన్నాన్ని నిర్దేశించాయని
నీచంగా నిష్క్రియాపరత్వం లోకినెట్టి
ద్రోహచింతనతో దోపిడికి దారులు వేసిన ఫలితమే కదా
ఆకలితో నకనకలాడే పేగుల ఆత్మఘోష
తలలు గొడితేనే కాని తరాలకు తరుగని సిరులను దోచి
స్విస్ బ్యాంకుల్లో దాచి
నాయకులుగా వెలుగుతున్న నయవంచన వల్లనే కదా
అశ్రువులతో నిండిన ఆకలి భారతం
గొడ్డు సాకిరి జేస్తూ
గడ్డు రోజుల తలపుతో
కటిక నేలపైన బండరాయిలా నిదురించేదొకడు
మెత్తని హంసతూలికలపై ఒత్తిగిలి
మెదడులో మేటవేసిన చెత్తతో
కోట్లు కొల్లగొట్టిన భయంతో
కంటీమీదకునుకు లేక కలవరపడేదొకడు
గడ్డి గుడిసే గాజు మేడ
పక్క పక్కనే బతుకులీడ్చిన
పరామర్శకు నోచుకోని
మరయంత్రపు మానవ నైజంలో
ఆకలి వేదన అమానుషమైన అవనిలో
కాకిని కదిలించలేని ఎంగిలి వేళ్ళ కర్కషత్వానికి
పస్తులతో వెక్కిరించబడినదీనులకు
దిక్కేలేనప్పుడు
పండుగలెవరికోసం..
– గన్ రెడ్డి ఆదిరెడ్డి
9494789731