Take a fresh look at your lifestyle.

వ్యవసాయాన్ని పండుగ చేసిన నాయకుడు

వ్యవసాయం దండగ అని పూర్వపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ సందర్భంలో అంటే, కాదు, పండుగ చేసి చూపిస్తానని ప్రతిన చేసి అక్షరాలా రుజువు చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ పథకం పేరు వినగానే వైఎస్ ఆర్ గుర్తుకు వొస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అంతకుముందు అమలు జరిపిన వారున్నా, వారిది ఆరంభ శూరత్వమే అయింది. పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రవేశపెట్టి మధ్యలో ఆపేశారు. అలాగే, పలు రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరిగా ఈ పథకం చివరి వరకూ కొనసాగలేదు. వైఎస్ఆర్ మాత్రం పట్టుదలతో తాను అధికారంలో ఉన్నంత కాలం దీనిని అమలు జేశారు. 2003లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ జరిపిన పాదయాత్రలో వైఎస్ రైతుల గుండె చప్పుడు విన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వారి పరిస్థితి ఏటికాయేడు ఎంత దయనీయంగా తయారవుతోందో స్వయంగా చూశారు. వారి కష్టాలు, కన్నీళ్ళను చాలా దగ్గరగా చూశారు. అందుకే రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని తు.చ. తప్పకుండా అమలు జేశారు 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూనే ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేసిన వైఎస్ ఆర్ రైతులకు కోట్లాది రూపాయిల వడ్డీలేని రుణాలు అందించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కర్షక్ పరిషత్ ద్వారా రైతులకు సాయం అందించారు కానీ, అది స్వల్పకాలం మాత్రమే కొనసాగింది.

అందువల్ల వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరపడం ఎన్నో విధాల సముచితం . అయితే, రైతులకు వడ్డీలేని రుణాల పథకం కింద పదకొండువందల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టిన నారా చంద్రబాబునాయుడు తానైతే రైతులకు రెండు లక్షల చొప్పున ప్రయోజనం కలిగేట్టు చర్యలు తీసుకుని ఉండేవాడినని ఇప్పుడంటున్నారు. చంద్రబాబు బకాయి పెట్టిన వడ్డీలేని రుణాలను ఇప్పుడు వైఎస్ కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఇదొక్కటే కాదు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు వైఎస్ మాదిరిగా ఉన్నపళంగా బాధితులను ఆదుకోవడానికి హుటాహుటీ వెళ్ళి వారిని ఓదార్చడమే కాకుండా, జగన్ భారీగా సాయం అందిస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమార్స్ ఘటనలో బాధితులను ఆదికోవడాన్ని ఇటీవల ప్రజలు కళ్లారా చూశారు. వైఎస్ తన హయాంలో జల యజ్ఞం కింద తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టినప్పుడు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఎద్దేవా చేసిన వారు అధికారంలోకి వొచ్చినప్పుడు అప్పట్లో సగం పూర్తి అయిన ప్రాజెక్టుల ఆకృతులనూ, అంచనాలనూ బాగా పెంచేసి అంతా మేమే చేశామని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో బాగా వెనకబడిన ప్రాంతమైన పాలమూరు (మహబూబ్) ను వలసల జిల్లా అనేవారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరిగిన జిల్లాల్లో అదీ ఒకటి. ఆ జిల్లాను చంద్రబాబునాయుడు దత్తత చేసుకుని ఒక్క కాలువను కూడా తవ్వించలేదు. వైఎస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఆర్ డిఎస్, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రాజీవ్ భీమా, కల్వకుర్తి వంటి ప్రాజెక్టుల ను చేపట్టి సగానికి పైగా పూర్తి చేశారు. ఆయన తర్వాత అధికారంలోకి వొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అటుపిమ్మట తెరాస ప్రభుత్వం మూడొంతులు పూర్తి అయిన ఆ ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేసింది. ఇదంతా తామే చేశామని చెప్పుకుంటోంది.అది వేరే విషయం. రైతుల ఆర్తనాదాలను విని స్పందించిన పాలకుల్లో వైఎస్ ది మొదటి స్థానం. అంతేకాక, వ్యవసాయక కార్యకలాపాలపై ఆయనకు మంచి అవగాహన ఉండేది. ఇప్పుడు జగన్ కూడా అదే తీరులో స్పందిస్తున్నారు. వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ జగన్ చేసిన ప్రకటన ఆయన గుండె లోతుల్లోంచి వొచ్చింది. తండ్రి ఆశయాలను సాధించేందుకు కంకణం కట్టుకున్న జగన్ ఇప్పటికే రైతుల కోసమే కాకుండా , వెనకబడిన తరగతుల విద్యార్ధులు, డ్వాక్రా మహిళా సంఘాల , కార్పొరేట్ విద్య, కార్పొరేట్ హాస్పిటల్స్ ల్లో ఆరోగ్య శ్రీ పథకం అమలు వంటి కార్యక్రమాలను చేపట్టారు.

అవన్నీ నిర్విఘ్నంగా కొనసాగితే తండ్రి పేరు నిలబపెట్టిన వారవుతారు. అలాగే, యూపీఏ ప్రభుత్వంతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడి సాధించిన వైఎస్ బతికి ఉంటే అది ఎప్పుడో పూర్తి అయి ఉండేదనీ, ఎవరిని కదిపినా ఇప్పటికీ అంటూంటారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రాణహిత ప్రాజెక్టు కు జాతీయ హోదా కోసం వైఎస్ ఎంతో కృషి చేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వొచ్చిన ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకోలేదు. తెరాస ప్రభుత్వం తనదైన రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి నిర్మాణం సాగిస్తోంది. నిజానికి వైఎస్ చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులనే ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఆకృతులు,అంచనాలు మార్చి అమలు జేస్తోంది. కాళేశ్వరం పూర్వనామం ప్రాణహిత, అలాగే, టేల్ పాండ్ ను మరో పేరుతో ఇప్పుడు చేపట్టారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు కార్యాచరణ రూపం ఇచ్చింది వైఎస్సే. బ్రహ్మానంద రెడ్డి హయాం నుంచి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో భారీ నీటి పారుదల శాఖను నిర్వహించిన వారిలో జీవీ సుధాకరరావు, జె నరసింగరావు, జె చొక్కారావు, శీలం సిద్ధారెడ్డి, తెలుగుదేశం హయాంలో కడియం శ్రీహరి మొదలైన వారంతా తెలంగాణ వారే. అయితే, వైఎస్ ఇచ్చిన ఊపు తెరాస ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రాతిపదిక అయింది. రాయలసీమకు మాత్రమే వైఎస్ ముఖ్యమంత్రిగా పని చేశారని గిట్టని వాళ్లు విమర్శించినా, మూడు ప్రాంతాలనూ సమానంగా చూసి రైతుల కోసం, పేదలు, దళితులు, అట్టడుగు వర్గాల కోసం కృషి చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకున్నారు. ఆయన రాజకీయ ఆలోచన లతో విభేదించిన వారి గుండెల్లోనూ జ్ఞాపకంగా మిగిలిపోయారు .జగన్ కూడా ఆయన బాటలో చాకచక్యంతో నడవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply